లేటెస్ట్

కేంద్ర చట్టానికి రాష్ట్రం తూట్లు...!?

‘రెరా’లో అతి చేసిన ‘నారాయణ’

చట్ట ఉల్లంఘనపై కేంద్రం సీరియస్‌...!?

‘రెరా’పై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఏమిటి?

పార్లమెంట్‌ చట్టాలకు తూట్లు పొడిచే జీవోనా...?

సెమీ క్వాసీ జ్యుడీషియల్‌ సంస్థపై మంత్రి నారాయణ పెత్తనం ఏమిటి..?

‘రెరా’ కార్యాలయంలో విలేకరుల సమావేశంపై అభ్యంతరం

అవినీతికి ఆస్కారం ఇచ్చేందుకేనా...?

రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు ఇచ్చే అవకాశం

రాష్ట్ర ప్రభుత్వంలో కలకలం...!

దిద్దుబాటు చర్యలకు దిగిన ‘సిఎంఓ’..!

‘సిఎంఓ’లో ‘రెరా’పై అత్యవసర సమావేశం

అమరావతి, ఫిబ్రవరి 02: ‘ఆంధ్రప్రదేశ్‌ స్థిరాస్థి ప్రాధికార నియంత్రణ సంస్థ’ (రెరా) చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించడంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ చట్టాల ఉల్లంఘనకు మున్సిపల్‌ మంత్రి ‘నారాయణ’ బాధ్యుడని ఆయన కేంద్ర చట్టాలకు తూట్లు పొడిచాడని, పార్లమెంట్‌ చేసిన చట్టాలను కాదని, నూతన జోవోలను ఆయన తెస్తున్నారని కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. మున్సిపల్‌ మంత్రిగా ఉంటూ ఒక సెమీ క్వాసీ జ్యుడిషియల్‌ అథారిటీ  విధుల్లో ఆయన జోక్యం చేసుకుని ‘రెరా’ను బ్రష్టు పట్టిస్తున్నారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి.  ‘రెరా’ ఏర్పాటు లక్ష్యాలను ఆయన ఉల్లంఘించారని,రియల్‌ ఎస్టేట్‌ సంస్థలతో లాలూచీ పడి, నిబంధనలను సవరిస్తామని బహిరంగంగా ప్రకటించారని కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. అసలు ఆయన ‘రెరా’ విధుల్లో  ఎలా జోక్యం చేసుకుంటారని  ప్రశ్నించినట్లు తెలుస్తోంది.  ‘రెరా’ ఛైర్మన్‌గా నిబంధనలకు విరుద్ధంగా తన సామాజికవర్గానికి చెందిన అధికారిని నియమించుకున్నారనే దానిపై కూడా కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది.  మున్సిపల్‌ మంత్రిగా ఉన్న ఆయన ‘రెరా’ కార్యాలయంలో సమీక్షలు ఎలా చేస్తారని, అక్కడే మీడియా సమావేశం ఎలా నిర్వహిస్తారని కూడా ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణను కోరినట్లు తెలుస్తోంది. ‘రెరా’ చట్టాలను ఉల్లంఘించిన వైనంపై దర్యాప్తు జరిపే అవకాశం ఉంది.  

ఏమిటి ‘ఉల్లంఘన’లు...!

(రెరా) జ్యుడిషియల్‌ అధికారాలు ఉన్న రాజ్యాంగ సంస్థ (సెమీక్వాసీ జ్యుడీషియల్‌ బాడీ).  ఈ సంస్థ విధుల్లో ఎవరూ జోక్యం చేసుకోవడానికి ఎటువంటి అధికారం ఉండదు. చివరకు ముఖ్యమంత్రికి కూడా దీనిపై అజమాయిషీ ఉండదు. దేశంలో 26 రాష్ట్రాల్లో ‘రెరా’లు ఉన్నాయి. రియల్‌ఎస్టేట్‌ సంస్థల నుంచి ముఖ్యంగా భవననిర్మాణ, లేఔట్‌ల్లో అక్రమాలు, అవినీతి జరగకుండా నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను ఏర్పాటు చేసింది.  ఒకసారి ‘రెరా’లో రిజిస్ట్రేషన్‌ అయిన సంస్థ నుంచి వినియోగదారులు ప్లాట్‌లు కొనుగోలు చేస్తే..ఆ సంస్థ ఏదైనా మోసం, ఉల్లంఘనలు చేస్తే దానికి ‘రెరా’ జవాబుదారీగా ఉంటుంది. సదరు వినియోగదారు నష్టపోయిన సొమ్ముకు ‘రెరా’ గ్యారెంటీ ఇస్తుంది. దీనిపై ఎటువంటి రాజకీయ, అధికార ఒత్తిడి లేకుండా ఉండేందుకే కేంద్ర ప్రభుత్వం దానికి సెమీ క్వాసీ జ్యుడిషియల్‌ అథారిటీ ప్రతిపత్తిని కల్పించింది. ఇదొక్కటే కాదు..చాలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు సెమీ క్వాసీ జ్యుడిషియల్‌ అథారిటీ ప్రతిపత్తి కలిగి ఉన్నాయి. ఉదాహరణకు ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ను తీసుకుంటే..దాని విధుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి జోక్యం చేసుకునే పరిస్థితి లేదు. ఆ కార్యాలయంలోకి కూడా ఆర్థిక మంత్రి వెళ్లరు. అదే విధంగా రాష్ట్రంలోని ‘ఎపిఇఆర్‌సి’ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ‘ఆంధ్రప్రదేశ్‌ ఎలక్టర్‌సిటీ రెగ్యులేటరీ కమీషన్‌’ దీనిపై సర్వ అధికారాలు ఆ సంస్థ ఛైర్మన్‌కే ఉంటాయి. దీనిలో ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకోవడానికి అనుమతి ఉండదు. కనీసం ఛైర్మన్‌ను పిలిచి మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. ఇప్పుడు ఒక వేళ ‘రెరా’పై అవినీతి ఆరోపణలు వస్తే నేరుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం లేదు. కోర్టు ద్వారా నివేదించిన తరువాతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి అటువంటి నిబంధనలు ఉన్న ‘రెరా’ విషయంలో మంత్రి నారాయణ, ఆయన సామాజికవర్గానికి చెందిన మున్సిపల్‌ కార్యదర్శి(ఇప్పుడు బదిలీ అయ్యారు) రెరా చట్టాలను అడ్డగోలుగా అతిక్రమించారు. దీనిలో ముందుగా ‘రెరా’ ఛైర్మన్‌గా మున్సిపల్‌శాఖ కార్యదర్శిని నియమించారు. ఇది నిబంధనలకు విరుద్ధం. వాస్తవానికి ‘మున్సిపల్‌శాఖ కార్యదర్శి’ని నియమించాలంటే..‘రెరా’ ఏర్పాటు సమయంలోనే అవకాశం ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో ‘రెరా’ ఏర్పాటు చాలా సంవత్సరాల క్రితమే జరిగిపోయింది. అయితే..ఇప్పుడు ‘నారాయణ’ తన కార్యదర్శిని నిబంధనలకు విరుద్ధంగా ‘రెరా’ ఛైర్మన్‌గా నియమించారు. 

పార్లమెంట్‌ చట్టానికి జోవో ద్వారా తూట్లు...!

‘రెరా’ ఛైర్మన్‌ పదవి ఖాళీగా ఉంటే..‘రెరా’ రిజిస్ట్రేషన్‌ సమయంలో సీనియర్‌గా ఉన్న వ్యక్తిని ‘ఛైర్మన్‌’గా నియమించాలి. కానీ..ఇక్కడ అదేమీ పట్టించుకోకుండా తన కార్యదర్శిని ‘నారాయణ’ ఛైర్మన్‌గా నియమించారు. ఇది పార్లమెంట్‌ చేసిన చట్టాలను ఉల్లంఘించడమే. ఇది మొదటి తప్పు. ఇక రెండోది. ‘రెరా’ కార్యాలయంలో సమీక్షలు చేయడం. ఇదీ నిబంధనలకు విరుద్ధం. మంత్రి నారాయణకు అక్కడ సమీక్షలు చేసే అధికారం లేదు. ఈనెల 6వ తేదీన ఆయన ‘విజయవాడ’లోని  ‘పిన్నమనేని పాలిక్లినిక్‌ రోడ్‌లో ఉన్న ‘రెరా’ కార్యాలయంలో అప్పటి మున్సిపల్‌ శాఖ కార్యదర్శి ‘కన్నబాబు’తో కలసి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రెరా’ నిబంధనలను సరళతరం చేస్తామని ప్రకటించారు. దీని కోసం జీవో తెస్తామని కూడా ప్రకటించారు. పార్లమెంట్‌ చేసిన చట్టాలను ఆయన ఎలా తూట్లు పొడుస్తారు..? ఆయనకు ఆ అధికారాలు ఎక్కడ నుంచి వచ్చాయి..?   అదే విధంగా ‘రెరా’లో ఉన్న ఫైళ్లను ఆయన ఎలా పరిశీలిస్తారు..? నిబంధనలను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అనుగుణంగా మారుస్తామని చెప్పారు. ‘రెరా’ ఉన్నది దేనికి..? రియల్‌ఎస్టేట్‌ సంస్థలకు వత్తాసు పలకడానికా..? తనకు అధికారంలేని చోటకు మంత్రి వెళ్లడం ఏమిటి..? పైళ్లను పరిశీలించడం ఏమిటి..? నిబంధనలను సరళతరం చేస్తామని హామీలు ఇవ్వడం ఏమిటి..? ఏమిటి ఇదంతా..? ‘నారాయణ’ రాజకీయ నాయకుడు..! ఆయనకు తెలియదనుకుందాం..? మరి ఆయన పక్కనే ఉన్న మున్సిపల్‌శాఖ కార్యదర్శికి ఈ సంగతి తెలియదా..? తెలిసినా మనల్ని అనేవాడు ఎవడు..? అనే ధైర్యంతో ఉన్నారా..?  ‘రుషికొండ’ ప్యాలస్‌ నిర్మిస్తే మనల్ని ఆపినోడు ఎవడు..? ఇక్కడ కూడా ఆపేవాడు..ఎవడు..? అన్న ధీమా ఆయనలో ఉందా..? కాగా ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పుడు కేంద్రం దర్యాప్తు చేయబోతోంది.


దిద్దుబాటు చర్యలు...!

కాగా ‘నారాయణ’ వ్యవహారంపై ముఖ్యమంత్రి కార్యాలయం దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. ‘రెరా’ విషయంలో ‘నారాయణ’ చేసిన తప్పులను దిద్దేందుకు సిఎంఓ కార్యాలయం సోమవారం నాడు సమావేశాన్ని నిర్వహించబోతోంది. ‘రెరా’లో జరిగిన తప్పులపై ముఖ్యమంత్రికి తెలియజేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. కాగా ‘నారాయణ’ వల్ల ‘కూటమి ప్రభుత్వం’ ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై కోర్టులో కేసులు దాఖలు చేసేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారు. అధికారం లేని చోట..‘నారాయణ’ అధికారం ఎలా చెలాయిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అవినీతికి ఆస్కారం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.  ‘చంద్రబాబు’ ‘నారాయణ’పై అపారనమ్మకంతో మున్సిపల్‌శాఖను అప్పగించారని, కానీ..ఆయన నమ్మకాన్ని ‘నారాయణ’ వమ్ము చేస్తున్నారని, లేనిపోని వివాదాల్లో తల దూరుస్తున్నారని టిడిపి వర్గాలు అంటున్నాయి. ఇంతకు ముందు కూడా ‘నారాయణ’ అప్పటి ‘సిఆర్డీఏ కమీషనర్‌’ ‘కాటంనేని భాస్కర్‌’తో వివాదాలకు దిగారు. ‘సిఆర్‌డిఏ’ కార్యాలయంలో ‘భాస్కర్‌’ సీటు పక్కన సీటు వేయించుకుని కూర్చునేవారు. అసలు ‘నారాయణ’కు అక్కడకు వెళ్లే అధికారం ఎక్కడ ఉంది..? ఈ వివాదంలో నిజాయితీపరుడైన ‘భాస్కర్‌’ను బదిలీ చేసి ‘చంద్రబాబు’ ‘నారాయణ’కు ఒత్తాసు పలికారనే విమర్శలను కొనితెచ్చుకున్నారు. మరి ఇప్పుడు ‘రెరా’లో కూడా ‘నారాయణ’ ఇదే వివాదాలు సృష్టించడం ఎందుకు..? ఇప్పుడు ‘రెరా’ వ్యవహారంలో కేంద్రం సీరియస్‌ అయితే..అది ‘నారాయణ’తో పాటు కూటమి ప్రభుత్వానికి అప్రతిష్టే. ఇప్పటికైనా..ముందూ వెనుకా చూసుకుని వ్యవహరించడం అటు ‘నారాయణ’కు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది.!

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ