లేటెస్ట్

వీళ్లంటే భయమా...!?

తెలుగుదేశం పార్టీలో ఇటీవల కాలంలో ఒక వింతైన విషయంపై చర్చ జరుగుతోంది. పార్టీ కోసం దూకుడుగా పనిచేసిన నాయకులంటే..పార్టీ అగ్రనాయకత్వానికి ఒకరకమైన భయం ఉందనేదే ఆ చర్చ. పార్టీ కోసం, పార్టీ అధినేత, ఆయన కుమారుడు శ్రేయస్సు కోసం ప్రాణాలకు వెరవకుండా పనిచేసిన వారిని పక్కన పెడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘జగన్‌’ అరాచకాలను ఎదుర్కొని, ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారిని, అలుపెరగకుండా పోరాడిన వారినీ అధినేత ఇప్పుడు పట్టించుకోవడం లేదనే భావన పార్టీ వర్గాల్లో ఉంది. ఒకవేళ పార్టీ కార్యకర్తల నుంచి, నాయకుల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తే..ఏదో నామమాత్రమైన పదవి ఇచ్చి సరిపుచ్చుతున్నారు. ఎందుకు అధినాయకత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందో..ఎవరికీ అర్థం కావడం లేదు. పార్టీ ఫైర్‌బ్రాండ్‌లుగా ఉన్నవారిని కావాలని అవమానిస్తున్నారనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. ఒకప్పుడు ‘అన్న ఎన్టీఆర్‌’ కాలంలో పార్టీ ఫైర్‌బ్రాండ్‌లు ఆయన ప్రోత్సహించేవారు. వారు అడిగిన పదవులు ఇచ్చి, వారికి పూర్తి స్వాతంత్య్రం ఇచ్చేవారు. దీంతో..వారు పార్టీ కోసం ‘ఎన్టీఆర్‌’ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసేవారు. కానీ నేడా పరిస్థితి పార్టీలో లేదని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ‘చంద్రబాబునాయుడు’ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇటువంటి దోరణులు నెలకొన్నాయి. పార్టీలో తన కంటే ఎక్కువగా ఫోకస్‌ అయ్యేవారిని ఆయన పట్టించుకోరని, వారిని ఒక పద్దతి ప్రకారం అణిచివేస్తారనే అపవాదు ఆయనపై ఉంది. అయితే..ఇటీవల కాలంలో అది మరింత పెరిగిందనే వాదన పార్టీలో ఉంది. ఎవరైనా నాయకుడు గొప్పగొప్ప పోరాలు చేసి..ఉనికిలోకి వస్తే..వారికి పార్టీ సరైన గుర్తింపు ఇవ్వడం లేదనే ఆరోపణ బలంగా ఉంది. అదీ ‘కమ్మ’ సామాజికవర్గానికి చెందిన వారైతే..అసలు పట్టించుకోరు. దీనికి పలు ఉదాహరణలు చెప్పుకోవచ్చు.

‘టిడిపి’ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘విజయవాడ’కు చెందిన ‘కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌’ ‘జగన్‌’పై తిరుగులేని పోరాటం చేశారు. ప్రాణాలను లెక్కచేయకుండా ఆయన పోరాడారు. పలుసార్లు ఆయనపై, ఆయన ఇంటిపై దాడి జరిగినా..తన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నా..ఆయన ‘జగన్‌’పై పోరాటాన్ని ఆపలేదు. ఈ క్రమంలో ఆయన ‘రాజమండ్రి’ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అప్పట్లో ఆయన పోరాటాన్ని చూసిన రాజకీయపరిశీలకులు, పార్టీ నాయకులు ‘టిడిపి’ అధికారంలోకి వస్తే..‘పట్టాభి’కి మంచి భవిష్యత్తు ఉంటుందని భావించారు. అయితే..‘టిడిపి’ అధికారంలోకి వచ్చిన తరువాత..మొదటి ఐదు నెలలు ఆయనను పట్టించుకోనే పట్టించుకోలేదు. చివరకు మీడియా, పార్టీ వర్గాల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో..ఆయనకు నామమాత్రమైన స్వచ్ఛకార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవిని ఇచ్చి మమ అనిపించారు. ఈయనొక్కరేనా..ఇలాంటి వాళ్లు పదులు సంఖ్యలో ఉన్నారు. ఎమ్మెల్యేలు ‘చింతమనేని ప్రభాకర్‌’, ‘ధూళ్లిపాళ్ల నరేంద్ర, గోరంట్ల బుచ్చయ్య చౌదరి’ ‘వెలగపూడి రామకృష్ణ’లది ‘పట్టాభి పరిస్థితే. ఇక డిప్యూటీ స్పీకర్‌ ‘రఘురామకృష్ణంరాజు’ గురించి చెప్పేదేముంది...? ఆయన చేసిన పోరాటం గురించి ప్రపంచంలో ఏమూలను ఉన్న తెలుగువాడిని అడిగినా చెబుతారు...కానీ..ఆయనకూ అన్యాయం జరిగింది. మంత్రి పదవి వస్తుదనుకుంటే..అది ఇవ్వలేదు. సరికదా..కొన్నాళ్లపాటు ఖాళీగా ఉంచడంతో..ప్రజల నుంచి తీవ్రమైన అసంతృప్తి రావడంతో చివరకు ‘ఉపశాసనసభాపతి’ని చేశారు. దళిత వర్గానికి చెందిన ‘మహాసేన’ ‘రాజేష్‌’ది మరీ విషాదం. ‘జగన్‌’ ఓటమి కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. అయితే ఆయన కొన్ని విషయాల్లో ‘అతి’గా వ్యవహరించడం ఆయనకు నష్టాన్ని తెచ్చిపెట్టింది. అయితే..దాని వల్లే..ఆయన చేసిన పోరాటాలను తీసిపారేయడానికి వీల్లేదు. కానీ ఆయనకు కూడా అన్యాయమే జరిగింది. అదే విధంగా ‘బ్రహ్మంచౌదరి’ పరిస్థితీ అంతే..! ‘చంద్రబాబు’ ఇంటిపైకి ‘జోగి రమేష్‌’ దాడికి వస్తే..మొదట తిప్పికొట్టింది..బ్రహ్మం చౌదరే...? ‘జోగి’ దాడిని అడ్డుకుని, ఎదురుదాడి చేసి..‘జోగి’ని పరిగెత్తించారు బ్రహ్మంచౌదరి. అయితే..పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు అధినాయకత్వం గుర్తింపు ఇవ్వలేదు. పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేస్తానన్నా..చలించకుండా..పార్టీ కోసం ‘బ్రహ్మంచౌదరి’ పోరాడారు. ఇక ‘ఏబీ వెంకటేశ్వరరావు’ గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఆయన గురించి గత రెండు రోజులుగా చర్చ సాగుతూనే ఉంది. మొత్తం మీద..టిడిపి అధినాయకత్వం ఫైర్‌బ్రాండ్‌లను చూసి భయపడుతుందని చెప్పకనే చెప్పిట్లయింది.  ఎందుకు అధినాయకత్వం వీరిని చూసి భయపడుతుంది..? తమ కంటే..వీరు ఎదుగుతారనా..? లేక వారిని ప్రోత్సహిస్తే..ఇబ్బందులను తెచ్చిపెడతారనే భావన..? లేక వెన్నుపోటు పొడుస్తారనే భయమా..? భయాలు ఏమైనా..అధినాయకత్వం ఇటువంటి వారి విషయంలో వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలు తెచ్చిపెడుతోంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ