‘జగన్’ మీడియాతో అంటకాగుతోన్న సీనియర్ అధికారులు...!
మాజీ ముఖ్యమంత్రి ‘వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి’ సిఎం పదవి నుంచి దిగిపోయినా, అధికారుల్లో ఆయన హవానే కొనసాగుతోంది. కొంత మంది సీనియర్ అధికారులు ఆయనకు ఇప్పటికీ సహకరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మీడియాకు సంబంధించిన అంశాల్లో ‘జగన్’ మీడియా హడావుడి కొనసాగుతూనేఉంది. కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు వారిని పిలిపించుకుని కొన్ని అంతర్గత అంశాలను వారిచే బహిర్గతం చేయిస్తున్నారు. ఇలా చేస్తున్నవారిలో కీలకమైన శాఖలను నిర్వహిస్తున్నవారు కూడా ఉన్నారు. మరి కొందరు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు కూటమి ప్రభుత్వానికి చెందిన విషయాలను ‘జగన్’ మీడియాకు లీకులు ఇస్తున్నారు. ‘జగన్’కు చెందిన మీడియాతోపాటు, ఆయనకు అనుబంధంగా పనిచేసే మరికొన్ని ఛానెల్స్‌తో పాటు, యూట్యూబ్, వెబ్‌సైట్లకు వీరు పదే పదే ప్రభుత్వ అంతర్గత సమాచారం అందిస్తున్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని ‘జగన్’ మీడియా ప్రభుత్వంపై బురదజల్లుతోంది. కాగా కొందరు ‘జగన్’ అభిమానులైన ఐఏఎస్ అధికారులు ‘జగన్’ మీడియా ప్రతినిధులను పిలిపించుకుని..ప్రభుత్వ విషయాలను వాళ్లకు విపులంగా వివరిస్తున్నారనే ప్రచారం సచివాలయంలో జరుగుతోంది. సున్నితమైన అంశాలను వారు ‘జగన్’ ప్రతినిధులకు చేరవేస్తున్నారు. ఎక్కడో హైదరాబాద్‌లో ఉండి...ఇక్కడి అంశాలను వారు యధేచ్ఛగా అంతర్గత విషయాలను ప్రచారం చేస్తున్నారు. ఇలా వారికి లీకులు ఇస్తున్న అధికారులపై కూటమి ప్రభుత్వం ఇంత వరకూ దృష్టి పెట్టలేదు. ‘దావోస్’ పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కానీ, రాజధాని అమరావతి, పోలవరం విషయాలకు సంబంధించిన అంతర్గత విషయాలు వెనువెంటనే ‘జగన్’ మీడియాకు చేరిపోతున్నాయి. కూటమి ప్రభుత్వంపై అవకాశం దొరికినా..దొరకకపోయినా..విషం చిమ్ముతున్న ‘జగన్’ మీడియాకు కొందరు అధికారులు పదే పదే అంతర్గత విషయాలను చేరవేస్తున్నారు. ఇలా చేరవేస్తున్నవారిపై చర్యలు తీసుకోకపోతే..కూటమి ప్రభుత్వం భారీగానే నష్టపోతోంది. గతంలో ‘జగన్’కు మద్దతు ఇచ్చిన కొన్ని ఛానెల్స్, వెబ్‌సైట్స్ మరోసారి క్రియాశీలకం అయ్యాయి. వీరంతా కలసి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ పెద్దలు వెంటనే చర్యలు తీసుకోకపోతే..కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పడకతప్పదు.