‘పెద్దిరెడ్డి’ కేంద్రంగా రాజకీయాలు..!?
అడవి దొంగకు రక్షణ కల్పిస్తారా..?
కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడతారా..?
‘బాబు’పై విరుచుకుపడుతోన్న ‘టిడిపి’ సోషల్‌మీడియా...!
హోంమంత్రి అమిత్‌షాను కలిసిన ‘రామచంద్రయాదవ్’...!
‘పెద్దిరెడ్డి’ విషయంలో ఏమి జరుగుతోంది...?
వైకాపాకు ‘పెద్దిరెడ్డి’ రాజీనామా చేస్తారా..?
మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే ‘పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి’ కేంద్రంగా రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఆయన అటవీభూములను ఆక్రమించారని, రెవిన్యూ దస్త్రాలను దగ్ధం చేశారని, గనుల్లో అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని ప్రముఖ దినపత్రిక ‘ఈనాడు’ పుం:ఖాను పుం:ఖాలుగా వార్తలు రాస్తోంది. మరోవైపు ఆయన అధికారంలో ఉన్నప్పుడు తమపై దాడులు చేశారని, ఆయన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని ‘పుంగనూరు’కు చెందిన ‘టిడిపి’ కార్యకర్తలు ‘తెలుగుదేశం’ పార్టీ కార్యాలయంలో ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే..ఆయనపై ఎన్ని ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చినా..ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ ఆయనపై చర్యలు తీసుకోవడానికి సంసిద్ధంగా లేరు. ఆయనపై ఏదో నామమాత్రపు విచారణ జరిపిస్తున్నారు. వందల కొద్ది అటవీ భూములను ‘పెద్దిరెడ్డి’ ఆయన కుటుంబం కొట్టేస్తే..అటు కేంద్ర అటవీశాఖ కూడా స్పందించడం లేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సిన రీతిలో స్పందించడం లేదు. అదే సమయంలో అటవీశాఖ మంత్రిగా ఉన్న ‘పవన్‌కళ్యాణ్’ కూడా ఈ విషయంపై మౌనం వహిస్తున్నారు.
అసలు ఎందుకు ‘పెద్దిరెడ్డి’ అవినీతిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదో..? ఆయనపై చర్యలు తీసుకుంటే..వచ్చే నష్టం ఏమిటో తెలియక పార్టీ నేతలు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. కొందరు నేతలు అయితే..‘చంద్రబాబునాయుడు’కు ‘పెద్దిరెడ్డి’కి ఉన్న ఒప్పందం వల్లే ఆయనపై ఈగవాలడం లేదని గుసగుసలాడుతున్నారు. మరోపక్క టిడిపిని సమర్థించే మీడియా ‘చంద్రబాబు’పై విరుచుకుపడుతోంది. ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? ‘టిడిపి’ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాలను ‘చంద్రబాబు’ మరిచిపోయారా..? ఇలా అయితే..ఎలా..? అంటూ కొందరు.. మరికొందరు అయితే..ఆయన ఇచ్చిన సొమ్ములకు ఆశపడి..ఆయనను వదిలేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. స్వయంగా ‘చంద్రబాబు’ను వేధించినా..ఆయనపై చర్యలు ఉండవా..? ఎందుకు ఈ విధంగా జరుగుతోందని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకుంటున్నారు. అయితే..‘చంద్రబాబు’ ఆయనపై చర్యలు తీసుకుంటే..ఆయన ‘బిజెపి’లోకి వెళతారని, అందుకే ఆయనకు ‘బిజెపి’ రక్షణ లేకుండా చేయడానికే వ్యూహాత్మకంగా ‘చంద్రబాబు’ వ్యవహరిస్తున్నారని కొందరు అంటున్నారు. అయితే ఇది అంతగా అతకడం లేదు. అయితే..‘పెద్దిరెడ్డి’ లక్ష్యంగా రాజకీయాలు జరుగుతున్నాయని స్పష్టమవుతోంది. ‘చంద్రబాబు’ ఆయన విషయంలో మెతకగా వ్యవహరించడానికి ‘బిజెపి’నే కారణం కావచ్చు. ఆయనను ‘వైకాపా’ నుంచి బయటకు తెస్తే..‘జగన్’ బలహీనమవుతారనే భావన ‘చంద్రబాబు’లో ఉన్నట్లుంది. అందుకే ‘పుంగనూరు’కు చెందిన ‘రామచంద్రయాదవ్’ను కేంద్రహోంమంత్రి వద్దకు పంపారనే ప్రచారం సాగుతోంది. మామూలుగా అయితే..‘రామచంద్రయాదవ్’ స్థాయికి ఆయనకు హోంమంత్రి ‘అమిత్‌షా’ అపాయింట్‌మెంట్ దొరకదు. కానీ..ఆయన హోంమంత్రిని కలవడం వెనుక టిడిపి పెద్దలు ఉన్నారనే ప్రచారం ఉంది. ఆయనపై ఫిర్యాదు చేయంచడానికే.. ‘రామచంద్రయాదవ్’ను ఢల్లీికి పంపించారా..? అనే అనుమానాలు ఉన్నాయి. మరోవైపు వైకాపా నుంచి పలువురు రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారనే ప్రచారం వైకాపాలో కలకలం రేగుతోంది. వారంతా మూకమ్ముడిగా ‘పెద్దిరెడ్డి’ నాయకత్వంలో బయటకు వస్తారని, దాంతో ‘జగన్’ పని అయిపోతుందనే అంచనాలతోనే ‘పెద్దిరెడ్డి’పై చర్యలు లేవని మరి కొందరు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద..‘పెద్దిరెడ్డి’ వ్యవహారం ఏమిటో..తెలియక టిడిపిలో గందరగోళ పరిస్థితి నెలకొంటోంది.