లేటెస్ట్

‘పంజాబ్‌’ తరువాత...మనమేనట...!?

‘టిడిపి కూటమి’ ప్రభుత్వం కూలుతుందట...!

‘ఆంధ్రా’లోనూ ‘శిండే’ వస్తాడట...!

‘టీడీపీ’ చీలుతుందంటూ జోరుగా ప్రచారం...!

‘కమ్మ’ల్లో తీవ్ర అసంతృప్తి ఉందట...!

‘తండ్రీకొడుకుల’పై అసంతృప్తే కారణమట...!

సోషల్‌ మీడియాలో ప్రచారం...!

‘ఢిల్లీ’ అసెంబ్లీ ఎన్నికల్లో ‘బిజెపి’ ఘనవిజయం సాధించడంతో..దేశ వ్యాప్తంగా ఉన్న ‘బిజెపి’యేతర ప్రభుత్వాలు తీవ్ర ఉక్కిరిబిక్కిరికి గుర‌వుతున్నాయి.. ఆయా అసెంబ్లీల్లో మూడు వంతుల మెజార్టీ ఉన్నా..అక్కడ ప్రభుత్వాలను ‘బిజెపి’ పెద్దలు కూల్చివేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ముందుగా ‘పంజాబ్‌’లో ‘ఆప్‌’ ప్రభుత్వాన్ని కూల్చడానికి అంతా సిద్ధమైందని ఆయా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ‘ఢిల్లీ’ ఓటమితో బలహీనపడిన ‘క్రేజీవాల్‌’ను ఇక ‘బిజెపి’ ఆడుకుంటుందని, ఆయన పార్టీని చీల్చేస్తారని, ఇక ఆయన రోజులు లెక్కపెట్టుకోవడమే మిగిలిందని, కొద్ది రోజుల్లో ‘ఆప్‌’ అధికారంలో ఉన్న ‘పంజాబ్‌’లో మరో ‘శిండే’ ఉద్భవిస్తారని సోషల్‌ మీడియాలో జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ‘ఆప్‌’ జాతీయ కన్వీనర్‌ ‘క్రేజీవాల్‌’ ‘పంజాబ్‌’లోని ఎమ్మెల్యేలను రక్షించుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారని జాతీయ మీడియా వార్తలను ప్ర‌సారం చేస్తోంది. వాస్తవానికి ‘పంజాబ్‌’ అసెంబ్లీలో 117 సీట్లు ఉంటే..ఇక్కడ ‘ఆప్‌’ 94 సీట్లను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంటే..మూడు వంతులకుపైగా మెజార్టీ. ‘ఆప్‌’ తరువాత ‘కాంగ్రెస్‌’కు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ ‘ఆప్‌’ను పడగొడతారని ప్రచారం చేస్తోన్న ‘బిజెపి’కి కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయితే..‘ఆప్‌’ ఎమ్మెల్యేలను చీల్చి..మరో కొత్త ‘షిండే’ను సృష్టిస్తారని, తద్వారా ‘ఆప్‌’ ప్రభుత్వాన్ని కూల్చి ‘బిజెపి’ కనుసన్నల్లో నడిచే నేతను ముఖ్యమంత్రిగా చేస్తారని సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిలో నిజమెంతో కానీ..‘బిజెపి’ తలచుకుంటే ఏమైనా చేస్తుందని, మహారాష్ట్రలో నిరూపించింది. ఇప్పుడు ఇక్కడ చేయరని చెప్పలేం. అయితే..ఇప్పుడు అంత అవసరం లేదు. కానీ..‘ఆప్‌’కు బ్రేకులు వేయాలనుకుంటే.. మాత్రం ఇక్కడ మరో ‘షిండే’ రావడానికి ఎన్నో రోజులు పట్టదని చెబుతున్నారు. కాగా..‘పంజాబ్‌’ తరువాత ‘బిజెపి’ పెద్దలు ‘ఆంధ్రప్రదేశ్‌’పై దృష్టిపెట్టబోతున్నారని, ఇక్కడ ఉన్న పరిస్థితులను ఆసరా చేసుకుని ఇక్కడి ‘కూటమి’ ప్రభుత్వాన్ని పడగొడతారని ప్రచారం చేస్తున్నారు. 

క్యాడర్‌లో నిర్లిప్తత, నిరుత్సాహం...!

దాదాపు ఎనిమిది నెలల క్రితం బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ‘టిడిపి’ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అనుకున్నంతగా ప్రజలను మెప్పించలేకపోతోంది. ఎన్నికలకు ముందు చేసిన వాగ్ధానాలను నెరవేర్చడానికి తడబాటుకు గురవుతోంది. ముఖ్యంగా సంక్షేమపథకాలను అమలు చేయడంలో..ఇబ్బందులకు గురవుతోంది. ఇది ఎలా ఉన్నా..కూటమిలోని ప్రధాన పార్టీ అయిన ‘టిడిపి’ తన స్వంత పార్టీ నేతలను, కార్యకర్తలను, సానుభూతి పరులను సంతృప్తి పరచలేకపోతోంది. వారు కోరుకున్నట్లు పాలన సాగకపోవడంతో.. వారు..తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘చంద్రబాబునాయుడు’ ఆయన తనయుడు ‘కార్యకర్తలకు’ సానుభూతిపరులకు ఎన్నోహామీలు ఇచ్చారు. కానీ..అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని నిలబెట్టుకునేందుకు వారు ప్రయత్నించక పోవడంతో వారు తీవ్ర నిరుత్సాహానికి, నిర్లిప్తతకు గురవుతున్నారు. తమను వేధించిన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో పాటు..ఇంకా వైకాపాకు చెందిన వారే పెత్తనం చేయడం వారి అసంతృప్తికి ప్రధాన కారణం. గతంలో..వైకాపాలో మంత్రులగా ఉండి..అడ్డగోలుగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ వైకాపాకు చెందిన మాజీ మంత్రులపై ఇంత వరకూ చర్యలు తీసుకోకపోవడం వారిలో ఆగ్రహానికి ప్రధాన కారణం. కనీసం ఒక్క మాజీ మంత్రిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదని, ఇది చేతకాని ప్రభుత్వమని వారు ధ్వజమెత్తుతున్నారు. తామేమీ కక్షసాధింపు చర్యలకు పాల్పడమని కోరడం లేదని, గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నవారిపై చర్యలు తీసుకోమని కోరుతున్నామని కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం అదేమీ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే...వైకాపాకుచెందిన మాజీ మంత్రులు, నాయకులతో..టిడిపి పెద్దలు కుమ్మక్కు అయ్యారని వస్తోన్న వార్తలు వారిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. తాము ప్రాణాలకు తెగించి పోరాడితే..ఇప్పుడు వీరు కుమ్మక్కు రాజకీయాలు చేస్తారా..? అంటూ నివ్వెరపోతున్నారు. 

వైకాపా అధికారులదే పెత్తనం...!

ఇది ఇలా ఉంటే..పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయినా..అనుకున్న స్థాయిలో నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేయకపోవడం...ఒకవేళ చేసినా..నామ మాత్రపోస్టులు ఇవ్వడం వారిలో నిర్లిప్తతకు కారణమవుతోంది. నిజంగా పనిచేసిన కార్యకర్తలను, నాయకులను పక్కన పెట్టి..అప్పుడే పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా వారిలో అసంతృప్తి, ఆగ్రహానికి కారణంగా చెప్పవచ్చు. మరోవైపు అధినేత ‘చంద్రబాబు’ ఆయన తనయుడు ‘లోకేష్‌’లను కలవడం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కష్టసాధ్యమవుతోంది. వారి అపాయింట్‌మెంట్ల కోసం వారు చకోరపక్షిలా చూస్తోన్నా..వారు మాత్రం వారికి దర్శనం ఇవ్వడం లేదు. బ్రోకర్లకు, పార్టీ ఫిరాయింపుదార్లుకు మాత్రం రెట్‌కార్పెట్‌ వేసి అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారనే అసంతృప్తి చాలా మందిలో ఉంది. మరోవైపు అధికార యంత్రాంగంలో మార్పులు చేయలేదు. గతంలో వైకాపాలో కీలకంగా పనిచేసిన వారికే మళ్లీ ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘జగన్‌’ సేవ చేసిన చాలా మంది ఐఏఎస్‌ అధికారులకు ఇక్కడా మంచిపోస్టింగ్‌లు లభించాయి. నిజాయితీపరులైన ఐఏఎస్‌ అధికారులను అప్రాధాన్యత పోస్టులు ఇచ్చారు. దీంతో..వారు కూడా మనకెందుకులే..అన్నట్లు..నామమాత్రంగా వ్యవహరిస్తున్నారు. పాలనకు కీలకమైన ‘సచివాలయం’లో వైకాపా వారి పెత్తనమే సాగుతోంది. ఇక ‘సిఎంఓ’ పరిస్థితి కూడా అంతంతమాత్రమే. ఇక్కడ బాధ్యత తీసుకుని పనిచేసే వారే లేరు. తూతూ మంత్రంగా పనిచేస్తున్నారు. 

‘కమ్మ’ల్లో తీవ్ర అసంతృప్తి...!

‘టిడిపి’ పార్టీకి ఇరుసులాంటి ‘కమ్మ’ల్లో అధినేత ‘చంద్రబాబునాయుడు’ ఆయన తనయుడు ‘లోకేష్‌’ల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం అవుతోంది. పార్టీ విజయం కోసం ప్రాణాలకు తెగించి, ఆస్తులను తెగనమ్ముకుని, సుదూర తీరాల నుంచి వచ్చి పనిచేస్తే..తండ్రీకొడుకులు తమను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి వారిలో రోజు రోజుకు పెరిగిపోతోంది. పార్టీకి గట్టిపట్టున్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ‘కమ్మ’ సామాజికవర్గానికి మంత్రి పదవులు ఇవ్వలేదని, ‘కమ్మ’ల కోటాలో ఇచ్చిన ఇద్దరూ ‘విఐపీ’లని వారు..‘కమ్మ’లను దగ్గరికే రానీయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ‘టిడిపి’ ఎప్పుడు గెలిచినా..కృష్ణా జిల్లాలో మంత్రి పదవి ఉంటుంది. కానీ..ఈసారి ఈ వర్గాన్ని దూరం పెట్టారు. పెడితే..పెట్టారు..కానీ..వారి విన్నపాలను వినేవారు..ఎవరూ లేరు...? ‘కమ్మ’ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వాలంటే ‘తండ్రీకొడుకులు’ వణికిపోతున్నారు. తమపై ఎక్కడ కులముద్ర పడుతుందోనన్న భయంతో..వారిని దూరం పెడుతున్నారు. ఐఏఎస్‌ అధికారుల దగ్గర నుంచి..కానిస్టేబుల్‌ పోస్టుల వరకూ ‘కమ్మ’లైతే దూరంగా ఉంచడమే. గత ‘జగన్‌’ ఆగడాలవల్ల తీవ్రంగా నష్టపోయిన ‘కమ్మ’ అధికారులు.. ఇప్పుడూ..అదే విధమైన కష్టాలను ఎదుర్కొంటున్నారు. ‘జగన్‌’ వల్ల తీవ్రంగా నష్టపోయాం..ఇప్పుడు కొంచమైనా.. కోలుకుంటామను కుంటే..అంతకంటే దారుణంగా తండ్రీకొడుకులు వ్యవహరిస్తున్నారంటూ వారు..ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమర్థులు, నిజాయితీపరులైన ‘కమ్మ’ అధికారులకు ఎందుకు వీళ్లు పోస్టింగ్‌లు ఇవ్వడం లేదు. ‘చంద్రబాబు’ చెప్పినా..కొందరు అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వడం లేదు. ఒక ‘ఈడీ’ పోస్టు కోసం ఒక కమ్మ అధికారి దాదాపు ఎనిమిది నెలల నుంచి తిరుగుతున్నా..ఆయనకు పనికాలేదు. ఆయనేమీ అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి కాదు. అలా..అని అసమర్థుడూ కాదు..నిజాయితీపరుడు, సమర్థుడైన..ఆ అధికారికి పోస్టింగ్‌ ఇవ్వకపోవడానికి కారణం..ఆయన కులమే..? ఆయనే కాదు..మరి కొందరి ‘కమ్మ’ అధికారుల పరిస్థితీ..అదే..ఇటువంటి పరిస్థితులు ‘కమ్మ’ల్లో అసంతృప్తికి కారణమవుతోంది. తమకు ఎటువంటి మేలు చేయని ఈ ప్రభుత్వానికి తాము మాత్రం ఎందుకు మద్దతు ఇవ్వాలనే ఆలోచన వారిలో కలుగుతోంది. ఇప్పటికే..కొందరు బాహాటంగా ‘తండ్రీకొడుకుల’ను దూషిస్తున్నారు.


‘క‌మ్మ షిండే’ వ‌స్తార‌ట‌...!

ఇటువంటి పరిస్థితుల్లో ‘బిజెపి’ వేస్తోన్న ఎత్తులు..కూటమి కూలడానికి కారణమవుతాయనే విశ్లేషణలు, వార్తలు వస్తున్నాయి. ‘బిజెపి’ సృష్టించే ‘షిండే’ ఈ వర్గం నుంచే వస్తారని, దాంతో..వీరి మద్దతు..ఆయనకు దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. చాలా మంది సీనియర్‌ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు పార్టీ అగ్రనేతలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ‘కమ్మ’ సామాజికవర్గానికి చెందిన వారూ..‘కాపు’ సామాజికవర్గానికి చెందిన వారు దీనిలో ఉన్నారు. ‘చినబాబు’ చుట్టూ చేరి ‘భజన’ చేసే నేతలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, క్షేత్రస్థాయిలో పనిచేసే వారిని గుర్తించడం లేదని, ‘చినబాబు’ పెత్తనాన్ని వ్యతిరేకించేవారు..అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ‘బిజెపి’ క్యాష్‌ చేసుకుంటుందనే సోషల్‌ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే..ఇది అంత తేలికైన వ్యవహారం కాదు. 175 సీట్లుఉన్న అసెంబ్లీలో టిడిపికి 136 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కనీసం 48 మంది పార్టీ ఫిరాయిస్తేనే..వారు అనుకున్నది జరుగుతుంది. అయితే..పరిస్థితులు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ‘బిజెపి’ వేస్తోన్న ఎత్తులను జాగ్రత్తగా గమనించుకుంటూ ‘చంద్రబాబు’ ముందుకు వెళ్లాలి. అసంతృప్తికి గురవుతున్న పార్టీ కార్యకర్తలను దగ్గరకు తీయాలి. గతంలో..ఎన్నోసార్లు ‘టిడిపి’ని దెబ్బకొట్టడానికి ప్రయత్నాలు జరిగినా..‘క్యాడర్‌’ పార్టీని కాపాడుకుంది. అయితే..ఇప్పుడు..అదే క్యాడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొంటోంది. దీన్ని.. అధినాయకత్వం వెంటనే సరిదిద్దాలి. లేకపోతే..‘బిజెపి’ వేసే ఎత్తులకు బలి కావాల్సి ఉంటుంది. సోషల్‌ మీడియాలో జరుగుతోన్న ప్రచారం నిజం అయ్యే పరిస్థితి ఉంది. తస్మాత్‌ జాగ్రత్త...!

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ