‘రాజమౌళి’ని రానీయొద్దు...!?
తెలంగాణకు చెందిన ఓ రిటైర్డ్ అధికారిని ‘కూటమి ప్రభుత్వం’ ‘ఆంధ్రప్రదేశ్’కు తెచ్చుకుని, ఆయనకు నామినేటెడ్ పదవి ఇవ్వబోతున్నారని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇది నిజమో కాదో..కానీ...అత్యంత వివాదాస్పద, అవినీతి అధికారిగా పేరు తెచ్చుకున్న సదరు అధికారిని ఎందుకు ‘చంద్రబాబు’ ప్రభుత్వం పదవి ఇవ్వాలని భావిస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయనేమైనా నిజాయితీ అధికారా..? సమర్థుడా..? లేక ఆయన కంటే మంచివాళ్లు ఇక్కడ లేరని, తెలంగాణ నుంచి తెచ్చుకుంటున్నారో..? రాజకీయ కారణాలతో అటువంటి వారిని తెచ్చుకుంటారా..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే..‘చంద్రబాబు’ పాత శిష్యుడు ‘ఎర్రబెల్లి దయాకర్‌రావు’ సిఫార్సుతో సదరు రిటైర్డ్ అధికారి ఇక్కడకు వస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన ‘రాజమౌళి’ అనే అధికారి రిటైర్డ్ అయిన తరువాత ‘తెలంగాణ సమాచారశాఖ డైరెక్టర్‌గా పనిచేశారు. ‘కెసిఆర్’ అప్పట్లో ఆయనను ‘ఎర్రబెల్లి దయాకర్‌రావు’ సిఫార్సుతో ‘తెలంగాణ’ ఐ&పిఆర్‌లో నియమించారు. అక్కడ పోస్టింగ్ తెచ్చుకున్న తరువాత ‘రాజమౌళి’ విశ్వరూపం చూపించారనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో పత్రికలకు, యాడ్ ఏజెన్సీలకు ప్రకటనలు మంజూరులో ఆయన అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. కోట్లాది రూపాయలను ఆయన యధేచ్చగా దుర్వినియోగం చేశారనే, తనకు నచ్చిన వారికి కోట్ల రూపాయలు దోచిపెట్టారనే వార్తలు వచ్చాయి. అప్పటి తెలంగాణ సమాచారశాఖ కమీషనర్ ‘అరవింద్‌కుమార్’తో కలిసి ఇష్టారాజ్యంగా నిధులను దుర్వినియోగం చేయడంతో పాటు భారీగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వీరి మీద ఉన్నాయి.
తెలంగాణ వ్యక్తికి ‘జాతీయ మీడియా సలహాదారు’ పదవా...!?
పలు ఆరోపణలు ఎదుర్కొని, అవినీతిపరులతో అంటకాగిన వ్యక్తికి ‘ఆంధ్రప్రదేశ్’లో పదవి ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆయనను జాతీయ మీడియా సలహాదారుగా నియమించబోతున్నారని, దీనిపై ఇప్పటికే దస్త్రం కదిలిందని చెబుతున్నారు. ‘ఢిల్లీ’ కేంద్రంగా ఆయన సేవలను వాడుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ‘ఢిల్లీ’తో పాటు ‘హైదరాబాద్’లో కూడా ఆయనను వాడుకుంటారని ప్రచారం సాగుతోంది.దీనిపై జర్నలిస్టు సంఘాలు, మేధావులు, తటస్తులు ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. ‘జాతీయ మీడియా సలహాదారు’ పదవికి ‘ఆంధ్రప్రదేశ్’లో ఎవరూ దొరకలేదా..? అంత సమర్థులు ఇక్కడ లేక అక్కడ నుంచి దిగుమతి చేసుకుంటున్నారా..? ‘ఆంధ్రా’లో సమర్థులు, నిజాయితీపరులైన జర్నలిస్టులు లేరా..? ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. మొత్తం మీద అత్యంత అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న ‘రాజమౌళి’ని ఇక్కడకు తెచ్చుకుని పదవి ఇస్తే కూటమి ప్రభుత్వ పరువు పోవడం ఖాయం. ప్రభుత్వ పెద్దల దృష్టికి ఈ విషయం వెళ్లిందో..లేదో తెలియదు. కిందస్థాయిలోనే..ఈ వ్యవహారం ముగించి ఆయనకు ఉత్తర్వుల ఆర్డర్ ఇస్తారా..? చూడాలి మరి...?