‘అలా..వెళ్లి...ఇలా వచ్చేస్తాడు’...!?
మాజీ ముఖ్యమంత్రి, ‘పులివెందుల’ శాసనసభ్యుడు ‘వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి’ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారట. ఆయనతోపాటు ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ వార్షిక బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. నిన్నటి దాకా..అసెంబ్లీలో తనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తేనే అసెంబ్లీకి వస్తానని లేకుంటే లేదని తెగేసి చెప్పారు. తాను అసెంబ్లీకి వచ్చినా..తనను మాట్లాడనివ్వరని,సమయం ఇవ్వరని అందుకే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనని చెప్పేశారు. తరువాత తనకు ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’కు ఇచ్చినంత సమయం ఇస్తేనే అసెంబ్లీకి హాజరవుతానని మరోసారి చెప్పారు.తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని హైకోర్టులో కేసు వేసినా..అక్కడ నుంచి సానుకూలమైన స్పందన రాకపోవడంతో..తాను అసెంబ్లీకి రానని, తాను ఇంట్లో నుంచే..అధికారపక్షాన్ని మీడియా ద్వారా ప్రశ్నిస్తానని చెప్పారు. దీంతో..ఇక ఆయన అసెంబ్లీకి రాడని అందరూ భావించారు. అయితే..సభ్యులు ఎవరైనా..ముందస్తు సమాచారం ఇవ్వకుండా అసెంబ్లీకి వరుసగా 60రోజులు హాజరు కాకపోతే..అసెంబ్లీ సభ్యత్వాలు రద్దు అవుతాయని అధికారపక్షం దాడిని మొదలెట్టింది. ఒకవైపు శాసనసభా స్పీకర్ ‘అయ్యన్నపాత్రుడు’, మరోవైపు ఉపసభాపతి ‘రఘురామకృష్ణంరాజు’లు ‘జగన్’కు సభకు రాకపోతే ఆయన సభ్యత్వం రద్దు అవుతుందని హెచ్చరించారు. సభ్యత్వం రద్దు అయితే...‘పులివెందుల’ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయని టిడిపి నేతలు పదే పదే ప్రకటనలు చేశారు. ఒకవేళ తాను ముందు చెప్పినట్లు అసెంబ్లీకి రాకపోతే..సభ్యత్వాన్ని రద్దు చేసి, ఉప ఎన్నిక నిర్వహిస్తారనే భయం ‘జగన్’లో నెలకొంది. ఉప ఎన్నికలు వస్తే..తనను అంత సులువుగా గెలవనీయరని, ఒక వేళ గెలిచినా మెజార్టీని నామమాత్రం చేస్తారనే భయం ‘జగన్’ను ఆవహించింది. మరోవైపు ఉప ఎన్నికలు వస్తే..ప్రచార సందర్భంగా ఎందుకు అసెంబ్లీకి వెళ్లలేదో..ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. సరే..అప్పుడు వెళ్లలేదు..ఇప్పుడు మళ్లీ గెలిస్తే..వెళతామా..? అన్న ప్రశ్నలు సహజంగానే ప్రజల నుంచి వస్తాయి. దీనికి ఆయన సమాధానం చెప్పుకోలేరు. ఇటువంటి పరిస్థితుల్లో..ఉప ఎన్నిక తెచ్చుకోవడం ఎందుకు..? అసెంబ్లీకి హాజరైతే పోతుందని ఆయన అంతరంగికులు ఇచ్చిన సలహాతో అసెంబ్లీకి రావాలని ఆయన నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. (జగన్ అసెంబ్లీకి హాజరుపై ఇంకా అధికారికంగా ప్రకటించలేదు) అయితే ఆయన అసెంబ్లీకి వచ్చినా సభలో ప్రజాసమస్యలపై ఆయనేమీ చర్చల్లో పాల్గొనరని, సోమవారం నాడు గవర్నర్ ప్రసంగం ప్రారంభించే సమయంలో సభకు వస్తారని, అక్కడ కనిపించి వచ్చినంత వేగంగానే అసెంబ్లీ నుంచి నిష్క్రమిస్తారని ప్రచారం సాగుతోంది. ‘మా నాయకుడు..ఇలా వచ్చి..అలా వెళ్లిపోతాడు’..ఇక అంతకు మించి మరేమీ ఉండదు. దీంతో ప్రస్తుతం ఉన్న సమస్య నుంచి ఆయన బయటపడతారని, తరువాత సంగతి తరువాత చూసుకోవచ్చనేది ఆయన అభిమతమని వారు అంటున్నారు. మొత్తం మీద ‘జగన్’ సమావేళాలకు రావడం ఖాయమైనా..ఆయన సభలో ఉండరనే ప్రచారం సాగుతోంది. చూద్దాం..అసెంబ్లీలో ‘జగన్’ ఎలా ప్రవర్తిస్తారో..?