అనుకున్నదే...అయింది...!?
మాజీ ముఖ్యమంత్రి ‘వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి’ శాసనసభా సమావేశాలకు వచ్చి వెళ్లారు. అందరూ ముందుగా అనుకున్నట్లే..ఆయన ‘ఇలా వచ్చి...అలా వెళ్లిపోయారు’..ఆయన అలా వెళతారని ‘జనమ్‌ఆన్‌లైన్.కామ్’ శనివారం నాడే చెప్పింది. ఆయన అంత కన్నా..వేరే చేస్తారని, అంతకన్నా వేరే ఆలోచన ఆయన చేయలేరని, అంత కన్నా..వేరేగా చేస్తే..ఆయన ‘జగన్’ ఎందుకు అవుతారు..? ప్రజలను గౌరవించాలనే ఆలోచన కానీ, ప్రజలేమనుకుంటారన్న ఇంగితనం కానీ..వెరపు కానీ..భయం కానీ ఆయనకు ఉండవు. తనను అవమానిస్తారన్న భయమే తప్ప..మరే ఆలోచనా ఆయన బుర్రకు ఎక్కదు. అవమానిస్తే..ఏమవుతుంది..కొంపలు మునిగిపోతాయా..? అవమానిస్తే..తట్టుకోవాలి..ప్రజల కోసం అవమానాలను ఎదుర్కొన్నామని చెప్పుకోవాలి. కానీ అంత ఓపిక, సహనం..ఎక్కడ ఉంటాయి..! అయ్యపేరు చెప్పుకోవాలి..లేకపోతే.. సానుభూతిని నమ్ముకోవాలి..లేకుండా డ్రామా ఆర్టిస్టులను నమ్ముకోవాలి..అంతే కానీ..నిజాయితీగా పోరాటం చేస్తామనే ధ్యాసే ఉండదు. ఎంత సేపటికి తనను తాను రారాజుగా భావించుకుంటూ..తనకు అందరూ లోబడి సలాములు కొట్టాలనే మానసిక ధౌర్భల్యం తప్ప...ఇతర ఆలోచనలు బుర్రలోకి రానే రావు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రజల సమస్యలను ఎలుగెత్తితే..కూటమిపై ఎంతో కొంత ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కదా..? ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే సంగతి ప్రజలకు నేరుగా తెలుస్తాయి..కదా..కనీసం గవర్నర్ ప్రసంగం అయ్యే వరకూ ఉండలేని భయమా..? ఏమవుతుంది..? ఉంటే..ప్రాణాలు తీస్తారా..? లేక రాయలసీమ ఫ్యాక్షనిస్టుల తరహాలో తలలు తీస్తారా..? ఎందుకు భయం..నిలబడి..కలబడి నిలువలేని వారికి రేపు ప్రతిపక్షహోదా ఇచ్చినా..ఇంతే కదా..? ప్రతిపక్షహోదా ఉంటేనే కలబడతావా..? ప్రశ్నిస్తావా..? గతం పాఠాలు నేర్పుతుంది..? ఇంగితం ఉంటే నేర్చుకోవచ్చు.
‘పిజెఆర్’ పాటి పోరాటం చేయలేవా..?
1994లో ‘జగన్’ కు మాతృసంస్థ అయిన ‘కాంగ్రెస్’కు కేవలం 26 స్థానాలు వచ్చాయి. ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయినా..అప్పటి ‘కాంగ్రెస్’ పక్షనాయకుడు ‘పి.జనార్థన్‌రెడ్డి’ అప్పటి పాలకపార్టీ అయిన ‘తెలుగుదేశం’ పార్టీని ముప్పుతిప్పలు పెట్టారు. అప్పట్లో కూడా ఇప్పుడు ఉన్నట్లే..‘టిడిపి’కి ‘సిపిఎం’ ‘సిపిఐ’ పార్టీల మద్దతు ఉండేది. మొత్తం ఎమ్మెల్యేల్లో 256 మంది ఎమ్మెల్యేల మద్దతు అప్పటి అధికారపార్టీకి ఉండేది. ‘కాంగ్రెస్’ ఘోరంగా ఓడినా..దాన్ని పట్టించుకోకుండా అప్పటి ‘సిఎల్‌పి’ లీడర్ ‘పిజెఆర్’ ‘చంద్రబాబు’ను ఐదేళ్లు పాటు నిద్రలేకుండా చేశారు. ‘పిజెఆర్’ను అధికారపార్టీ ఎంత రెచ్చగొట్టినా..ఎంత అవమానించినా..ఆయన తొణకకుండా ఐదేళ్లపాటు ‘సిఎల్‌పి’నాయకుడిగా పోరాడారు. ‘పులి’....‘పులి’..అంటూ ఒకటే ఊదరగొట్టే వారు..కనీసం ‘పిజెఆర్’ అంత పోరాటపటిమనైనా చూపించలేరా..? తాను కాగితం పులిని కాదని చెప్పుకోవడానికైనా..ప్రయత్నించాలి కదా..? కానీ..జగన్ మాత్రం...ఎవరేమనుకున్నా..నాకేంటి..? అంటూ ఫలాయనం చిత్తగిస్తున్నారు. ‘పిజెఆర్’లా ‘జగన్’ ఎందుకు పోరాడలేరంటే..ఆయన స్వతాగా ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదు. ‘వై.ఎస్’ పుత్రుడిగా రాజకీయాల్లో ఆయనది పూలపాన్పు. ఆయన మరణంతో వచ్చిన సానుభూతి, ఒక్కసారి చూద్దామన్న ప్రజల కోరికే..‘జగన్’ను నాయకుడ్ని చేసింది. ఇప్పుడు అవన్నీ అంతరించే సరికి ‘జగన్’లోని అసమర్థ నాయకుడు ప్రజల ముందు ఆవిష్కరించ బడుతున్నాడు. ఇటువంటి అసమర్థ నాయకునితో ఐదేళ్లు ‘వైకాపా’ ఎలా మనగలుగుతుందో..చూడాలి..ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో..అన్న భయం ఆ పార్టీ సీనియర్ నాయకుల్లోనూ, కార్యకర్తల్లోనూ, సానుభూతిపరుల్లోనూ వ్యక్తం అవుతుంది. ‘జగన్’ అసెంబ్లీకి వస్తే..ఏదో చేస్తాడనుకున్న వారికి..ఆయన ఈరోజు వ్యవహరించిన తీరుతో హతాశులయ్యారు. ఇతను మారడు..ఇతనితో ఏమీ కాదనే భావన అటువంటి వారిలో వ్యక్తం అవుతుంది. ‘జగన్’ సంగతి తెలిసిన వారికి ఇది ముందే తెలుసు.