జివిరెడ్డిది తొందరపాటా...!?
ఫైబర్‌నెట్ ఛైర్మన్ ٗజివిరెడ్డిٗ రాజీనామా వ్యవహారం టిడిపిలో తీవ్ర చర్చకు కారణమవుతోంది. యువకుడు, ఉత్సాహవంతుడు, రాష్ట్ర హితాన్ని కోరుకునే ఆయన రాజీనామా టిడిపిలో కొంత మందికి మింగుడు పడడం లేదు. ఫైబర్‌నెట్ ఎండి ‘దినేష్‌కుమార్’తో పడక..తన మాట నెగ్గలేదన్న బాధతో పాటు, ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’ తనకు మద్దతు ఇవ్వలేదనే కారణంతో ఆయన రాజీనామా చేశారు. అయితే..ఈ వ్యవహారంలో ఆయనకు పార్టీ శ్రేణుల నుంచి సానుభూతి లభించినా..ఆయన వ్యవహరించిన తీరు సరికాదనే భావన కొందరిలో ఉంది. ఫైబర్‌నెట్ ఎండికి తనకూ పడకపోతే..ఆ విషయాన్ని పదే పదే బహిరంగంగా మీడియా ముందు మాట్లాడి ప్రభుత్వ పరువు తీయడం సరికాదనే వాదన ఉంది. ముఖ్యమంత్రికి, ‘లోకేష్’కు చెప్పానని ఆయన చెబుతున్నా..ఈ వ్యవహారంలో ఆయన తొందరపాటు చర్యలకు పాల్పడ్డారనే భావన ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’లో ఉంది. అధికారులతో పనిచేయించుకోవాలి తప్ప..వారిపై ఆరోపణలు నేరుగా చేస్తే..అధికార వ్యవస్థ అసలు పనిచేయదు కదా..అనేది ముఖ్యమంత్రి ఉద్దేశ్యం. గత వైకాపా ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేసింది. ఈ శాఖ ఆ శాఖ అని లేదు..అన్ని శాఖల్లోనూ..ఫైబర్‌నెట్ పరిస్థితే ఉంది. మరి అలాంటప్పుడు అన్నిశాఖలకు చెందిన ఛైర్మన్లు, మంత్రులు ఆయా శాఖల కార్యదర్శులు, హెచ్ఓడిలు, ఇతర ముఖ్య అధికారులపై బహిరంగంగా ద్వజమెత్తితే..ఏమవుతుంది. ఈరోజు ‘జివిరెడ్డి’ ఆరోపణలు చేశారు..రేపు ఇంకో రెడ్డో..లేకపోతే..ఇంకెవరైనా..బయటకు వచ్చి రచ్చ రచ్చ చేస్తే ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ రాదా..? ప్రభుత్వ అధికారులతో పనిచేయించుకోవాలి కానీ..వారితో గిల్లికజ్జాలు పెట్టుకుంటే నష్టం ఎవరికి...? ఇప్పుడు ‘దినేష్‌కుమార్‌ను జిఎడికి రిపోర్టు చేయించారు. దీనితో ఆయనకు వచ్చిన నష్టం ఏమిటి..? పనిచేసినా..చేయకపోయినా..ఆయన జీతం ఆయనకు వస్తుంది. రేపు ఇంకో అధికారిని ఇక్కడ వేస్తారు..ఆయన అదే తీరులో ఉంటే..ఏమి చేస్తాం. ఆయనను తప్పిస్తాం..తరువాత..ఏమిటి..? ఇదెక్కడికి దారి తీస్తుంది. గతంలో ‘జగన్’కు భయపడి అధికారులు...పనిచేశారు..మనకు చేయడం లేదు..అంటే..‘జగన్’ చేసినట్లూ మనమూ..అరాచకం చేద్దామా..? ఆయన అరాచకాన్ని భరించలేకే..‘చంద్రబాబు’ను ప్రజలు తెచ్చుకుంది. బాధ్యతాయుతమైన పోస్టులో ఉండి ఒక ఐఏఎస్ అధికారిపై బహిరంగ విమర్శలతో ఆయనేం చెప్పాలనకున్నారు. ఇదేమైనా రాజరికమా..? చెప్పిన వెంటనే..చేయడానికి..ఈ విషయంలో ‘దినేష్‌కుమార్’ తప్పులేదని అనడం లేదు. కానీ..ముందూ వెనుకా..చూసుకోవాలి కదా..తొందరపాటు చర్యల వల్ల ప్రభుత్వాన్ని చులకన చేయడం మంచిది కాదేమోనన్న భావన కొందరు టిడిపి నేతల్లో ఉంది. అయితే...‘జివిరెడ్డి’ ఇప్పుడే కాదు..ఇంతకు ముందు కూడా తొందరపాటు చర్యలకు పాల్పడ్డారనే ఫిర్యాదు ఉంది. అప్పట్లో నామినేటెడ్ పోస్టుల విషయంలో సిఎం పిఎస్ ‘చంద్రబాబు’ను కలవనీయడం లేదని ఆయనపై బహిరంగంగా మీడియాలో ధ్వజమెత్తారు. అప్పట్లోనే ఆయనపై వేటు పడుతుందనే సంకేతాలు వెళ్లాయి. కానీ..యువకుడు తెలియక మాట్లాడారు..అన్న భావనతో చూసీచూడనట్లు వదిలేశారు. అయితే..ఈసారి మాత్రం అధిష్టానం కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. క్రమశిక్షణ తప్పితే..ఎంతటి వారిపైన అయినా చర్యలు ఉంటాయని చెప్పడానికే అధిష్టానం ‘జివి రెడ్డి’ రాజీనామాను వెంటనే ఆమోదించింది. మొత్తం మీద..రాజకీయాల్లో సుధీర్ఘకాలం ఉండాలంటే..ఓర్పు,నేర్పుతో పాటు తొందరపాటుతనం తగ్గించుకుంటేనే అది సాధ్యమవుతుంది.