ఎమ్మెల్సీ సీట్ల భర్తీలో ‘కమ్మ’లకు ప్రాధాన్యత ఇస్తారా..?
రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించినా..ఐదు స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ప్రతిపక్ష ‘వైకాపా’కు ఒక ఎమ్మెల్సీని కూడా గెలిపించుకునే బలం లేకపోవడంతో..ఈ ఐదు స్థానాలూ కూటమికే దక్కబోతున్నాయి. అయితే..ఈ ఐదు స్థానాల కోసం పలువురు నాయకులు హోరాహోరిగా పోరాడుతున్నారు. అయితే వీటిలో ఒక స్థానం అప్పుడే రిజర్వ్ అయిపోయింది. ఒక స్థానాన్ని డిప్యూటీ సిఎం ‘పవన్‌కళ్యాణ్’ సోదరుడు ‘నాగబాబు’కు ఇస్తారు. ఆయనను ఎమ్మెల్సీగా తీసుకుని మంత్రిని చేస్తామని ముఖ్యమంత్రి ‘చంద్రబాబు నాయుడు’ గతంలోనే ప్రకటించారు. ఇది పోతే..ఇక మిగిలేది నాలుగే. ఈ నాలుగు స్థానాల్లో కులాలవారీగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సమప్రాధాన్యతను అధినేత ‘చంద్రబాబునాయుడు’ ఇస్తారు. అయితే..గత ఎన్నికల్లో ‘చంద్రబాబు’ స్వంత సామాజికవర్గానికి చెందిన పలువురికి ఆయన టిక్కెట్లు నిరాకరించారు. అప్పట్లో ఆయన వీరికి ఎమ్మెల్సీ సీట్లు ఇస్తానని హామీ ఇచ్చారు. పార్టీ గెలుపు కోసం ‘కమ్మ’ సామాజిక వర్గమంతా కలిసి పనిచేసింది. కొందరు భేషజాలకు పోకుండా తమ సీట్లను వదులుకున్నారు. ఇటువంటి వారికి ఇప్పుడు ‘చంద్రబాబునాయుడు’ న్యాయం చేస్తారనే భావన ఉంది. అంతే కాకుండా ‘చంద్రబాబు’ సిఎం అయిన తరువాత ఈ సామాజికవర్గాన్ని దూరం పెడుతున్నారని ఆ వర్గంలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తమను ‘తండ్రీకొడుకులు’ వాడుకుని ఇప్పుడు పక్కనపెట్టేశారని ఆ వర్గానికి చెందిన వారు ఆరోపిస్తున్నారు. తాము పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడామని, కానీ..పదవుల్లో మాత్రం దూరం పెడుతున్నారనే ఆగ్రహం వారిలో ఉంది. దీంతో..‘చంద్రబాబు’ వారిలో ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఈ వర్గానికి ప్రాధాన్యత ఇస్తారనే అంచనాలు ఉన్నాయి.
దాదాపు 10మంది ‘కమ్మ’ సామాజికవర్గానికి చెందిన వారు ఎమ్మెల్సీ సీట్లను ఆశిస్తున్నారు. మాజీ మంత్రి ‘దేవినేని ఉమామహేశ్వరరావు, కొమ్మాలపాటి శ్రీధర్, గన్ని వీరాంజనేయులు, కోడెల శివరామ్, నల్లపాటి రాము, టిడి జనార్థన్, బ్రహ్మంచౌదరి, అడ్వకేట్ ‘గొట్టిపాటి శివరామకృష్ణ ప్రసాద్,నెట్టెం రఘురాం, మక్కెన మల్లిఖార్జునరావు వంటి నేతలు రేసులో ఉన్నారు. వీరిలో ‘చంద్రబాబు’ ఎవరిని ఎంచుకుంటారో తెలియదు. కానీ..చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. తన సీటును ‘వసంతకృష్ణ ప్రసాద్’కు ఇచ్చి త్యాగం చేసిన మాజీ మంత్రి ‘దేవినేని ఉమామహేశ్వరరావు’ తనకు తప్పకుండా అవకాశం వస్తుందని భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ‘కొమ్మాలపాటి శ్రీధర్, గన్ని వీరాంజనేయులు, నెట్టెం రఘురామ్’లకు కూడా ఆశపడుతున్నారు. గతంలోపార్టీ రాష్ట్ర కార్యాలయంలో క్రియాశీలకంగా పనిచేసిన ‘టిడి జనార్థన్’ తనకు ‘చంద్రబాబు’ అవకాశం ఇస్తారని ఎదురు చూస్తున్నారు. స్వర్గీయ ‘కోడెల శివప్రసాదరావు’ రాజకీయ వారసుడు ‘కోడెల శివరామ్’ కూడా ఆశలు పెట్టుకున్నారు. నర్సరావుపేటలో క్రియాశీలకంగా పనిచేస్తోన్న ‘నల్లపాటి రాము’, న్యాయవాది ‘గొట్టిపాటి శివరామకృష్ణ ప్రసాద్’లు తాము పార్టీకి అందించిన సేవలను దృష్టిలో ఉంచుకోవాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. యువనేత ‘బ్రహ్మంచౌదరి’ కూడా ఆశలు పెట్టుకున్నారు. మాజీ మంత్రి ‘జోగిరమేష్’ ‘చంద్రబాబు’ ఇంటిపై దాడికి వచ్చినప్పుడు ఆయన మూకను ‘బ్రహ్మం చౌదరి’ గట్టిగా ఎదుర్కొని తరిమేశారు. ఆయనకు గతంలోనే నామినేటెడ్ పోస్టు వస్తుందని ఆశించారు. అయితే..అప్పట్లో ఆయనకు ఎటువంటి పదవి రాలేదు. అయితే..ఈసారి యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలని ‘చంద్రబాబు’ భావిస్తే..ఆయన పేరును కూడా పరిశీలిస్తారు.వీరు కాకుండా బయటకు రాని పేర్లు బోలెడు ఉన్నాయి. వారంతా చాపకింద నీరులా తమ పనితాము చేసుకుంటూ పోతున్నారు. నామినేషన్ల నాటికి.. ఆశ్చర్యకరమైన పేర్లు బయటకు వస్తాయోమో చూడాలి. మొత్తం మీద..పలువురు ‘కమ్మ’ సామాజికవర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్సీ పోస్టు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.