అనుభవంలేని...‘ఐఏఎస్’ల చేతిలో..రాష్ట్ర భవిష్యత్తు..!?
రాష్ట్ర ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’కు అపార పాలనానుభవంతో పాటు, రాజకీయ అనుభవం ఉందని, ఆయన అధికారంలో ఉంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని మెజార్టీ ప్రజలు, పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు భావిస్తుంటారు. ఆయన అనుభవంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళతారనే భావనతో..2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆయనకే ప్రజలు మద్దతు పలికి..అధికారంలోకి తెచ్చారు. అప్పుడే కాదు..మొన్నటి ఎన్నికల్లోనూ ‘జగన్’ చేతిలో అగమ్యగోచరంగా,అనాథగా మిగిలిపోయిన రాష్ట్రాన్ని ఆయనైతేనే మళ్లీ పట్టాలపైకి తెస్తారనే ఉద్ధేశ్యంతో ఆయన నేతృత్వం వహిస్తోన్న కూటమికి బ్రహ్మాండమైన మెజార్టీ కట్టబెట్టి..అధికారాన్ని ఇచ్చారు. అయితే..ఆయన తన అనుభవంతో..రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నా..కొన్ని విషయాల్లో మాత్రం ఆయన చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పాలన మొత్తాన్ని ఐఏఎస్ అధికారుల మీద వదిలేశారని, రాజకీయ నిర్ణయాలను కాదని, అధికారుల చేతిలో పాలనను పెట్టారని పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు, తటస్థులూ అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి అది చాలా వరకూ నిజమే. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారుల పాలనే సాగుతోంది. రాజకీయనాయకుల నిర్ణయాలను అమలు చేయాల్సిన ఐఏఎస్ అధికారులు వారి నిర్ణయాలను పక్కనపెట్టి స్వంత పెత్తనం చేస్తున్నారనే విమర్శ మెండుగా ఉంది. పోనీ..ఆ అధికారం చేస్తున్న అధికారులు అనుభవజ్ఞులా..అంటే కానే కాదు...? నిన్న మొన్న..ఐఏఎస్ పట్టాలు తీసుకుని వచ్చిన వారే. నిండా ముప్పయి సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారే..ఇప్పుడు కీలకమైన శాఖల్లో పెత్తనం చేస్తున్నారు. కనీసం జాయింట్ కలెక్టర్‌గా కూడా పనిచేయని వారిని కీలకమైనశాఖలకు అధిపతులను చేసేశారు. దీంతో..వారి అనుభవరాహిత్యం వల్ల పాలనలో ఘోరమైన తప్పులు జరుగుతున్నాయి. అంతేనా..వీరి వల్ల రాష్ట్రానికి భారీ నష్టం చేకూరుతుంది. వీరి వల్ల ‘ఆంధ్రా’ భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆందోళన తటస్థుల్లో కలుగుతుంది.
కీలక శాఖలకు జూనియర్ ఐఏఎస్ అధికారులా..?
రాష్ట్రానికి భారీ ఆదాయం తెచ్చే సంస్థలు, రాబోయే కాలంలో రాష్ట్ర భవిష్యత్తుకు చుక్కానిలా నిలిచే సంస్థలు, పెట్టుబడులు ఆకర్షించే సంస్థలకు అధిపతులుగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎటువంటి అనుభవం లేని జూనియర్ ఐఏఎస్ అధికారులను నియమించారు. ఇలా ఒకటీ రెండు సంస్థలు కావు. కనీసం నాలుగు సంస్థల్లో ఇటువంటి వారిని నియమించారు. ముఖ్యంగా పెట్టుబడులను ఆకర్షించడంలో..ముఖ్యమైన ‘ఏపిఐఐసీ’లో మేనేజింగ్ డైరెక్టర్‌గా జూనియర్ ‘ఐఏఎస్’ అధికారి ‘అభిశిక్తు కిశోర్’ను నియమించారు. ఈ యువ ఐఏఎస్ అధికారి కనీసం జాయింట్ కలెక్టర్‌గా కూడా పనిచేసిన దాఖలాలు లేవు. కానీ..కీలకమైన పెట్టుబడులు శాఖలో మేనేజింగ్ డైరెక్టర్ పోస్టు ఇచ్చారు. అదే విధంగా ‘ఎపి మారిటైమ్ బోర్డు’ ‘సిఇఓ’గా ‘ప్రవీణ్ ఆదిత్య’ను నియమించారు. ఈయన ‘కిశోర్’ కన్నా జూనియర్. ఎంతో కోస్తా తీరం ఉన్న రాష్ట్రానికి ‘మారిటైమ్‌బోర్డు’ కీలకమైంది. వివిధ పోర్టుల నిర్వహణ, నూతన పెట్టుబడులు ఆకర్షించడం, ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి ఆదాయం తెచ్చే మార్గాలు వెతకడం వంటి లక్ష్యాలు ఈశాఖకు ఉన్నాయి. కానీ..ఇక్కడ అనుభవలేమీ కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’కు అపారమైన అనుభవం, లక్ష్యాలు, మార్గాలు ఉన్నా..వాస్తవంగా పనిచేసే అధికారులకు అటువంటివేమీ లేవు. కానీ..వీరికి కీలకమైన పోస్టులు లభించాయి. అదే విధంగా ‘ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు’ (ఎపిఇడిబి)కి కూడా అనుభవం లేని జూనియర్ అయిన ‘సాయికాంత్ వర్మ’ను నియమించారు. ఈ సంస్థ రాష్ట్ర ఆర్థిక అభివృద్ది, పెట్టుబడుల ప్రోత్సాహం, వ్యాపార సౌలభ్యం, నూతన పరిశ్రమల స్థాపన వంటి అంశాల్లో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమల అభివృద్ధి, ప్రభుత్వ`ప్రవేట్ భాగస్వామ్యాలను పెంపొందించడం, వాణిజ్య సౌలభ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్) పెంపొందించడం, రాష్ట్ర ఆర్థిక వ్యూహాలను రూపొందించే లక్ష్యాలు ఉన్నాయి. అయితే..ఈ సంస్థ సిఈఓగా పనిచేస్తోన్న ‘సాయికాంత్‌వర్మ’కు పెద్దగా అనుభవం లేకపోవడంతో..‘చంద్రబాబు’ కష్టపడి తెచ్చిన పరిశ్రమలకు కనీసం గ్రౌండిరగ్ కూడా చేయలేకపోతున్నారు. ‘చంద్రబాబు’కు ఎంతో ఆసక్తి ఉన్న ‘ఈజ్ ఆఫ్ డూయింగ్) విషయంలోనూ...అదే పరిస్థితి ఉంది. ‘చంద్రబాబు’ అధికారంలో ఉన్న ప్రతిసారీ దేశంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’లో మొదటి స్థానంలో ఉండేది. మరి ఈసారి ఏమిటో తెలియదు. ఇటీవల జరిపిన పెట్టుబడుల సదస్సులో రాష్ట్రం ఒట్టి చేతులతో తిరిగి వచ్చింది. దీనికి ఎవరిని నిందించాలో అర్థం కావడం లేదు. కోట్లు ఖర్చు పెట్టి చేసిన పెట్టుబడుల సదస్సు తుస్సు మందనే విమర్శలు జోరుగా వచ్చాయి. అదే విధంగా ప్రజలకు తక్కువ ధరకే ఇంటర్‌నెట్‌ను అందించే ‘ఫైబర్‌నెట్’ సంస్థ తీరును ఇటీవలే బహిరంగంగా చూశాం. ఇక్కడ అనుభవం లేని ‘దినేష్‌కుమార్’ను నియమించారు. ఆయన దీన్ని పెంట పెంట చేసేశారు. ‘ఫైబర్‌నెట్’ ఛైర్మన్ ‘జివిరెడ్డి’తో గిల్లికజ్జాలకు దిగి..అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని బజారుకు లాగారు. వాస్తవానికి ఇక్కడ ఛైర్మన్, ఎండి ఇద్దరూ అనుభవం లేని వ్యక్తులు కావడంతోనే..అక్కడంత గొడవ జరిగింది.
వీళ్లను ప్రోత్సహిస్తుందెవరు..!?
ఎటువంటి అనుభవం లేని యువ ఐఏఎస్‌లకు కీలకమైనశాఖలు అప్పగించడంలో ఎవరి హస్తం ఉంది. అనుభవం లేకుండా వీళ్లు ఎలా పనిచేస్తారు..ఫలితాలు సాధిస్తారు. బ్రహ్మాండమైన లక్ష్యాలను ‘చంద్రబాబు’ నిర్దేశించుకున్నారు. మరి అటువంటి లక్ష్యాలను సాధించే సత్తా వీళ్లలో ఉండవద్దా..? మరి అటువంటి సత్తా లేని వారిని నియమించిందెవరు. వాస్తవానికి ఈ నియామకంలో యువనేత, సిఎంఓలోని ఇద్దరు అధికారులు కీలకపాత్ర పోషించారనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా సిఎంఓలోని ‘పికె’లు దీనిలో ఉన్నారని అంటున్నారు. వీరి నేతృత్వంలోనే ఈ యువ ఐఏఎస్ అధికారులు నడుస్తున్నారట. వారు చెప్పిందే చేస్తున్నారని, యువకులను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఉపయోగపడతారని, యువనేతకు వాళ్లు సలహా ఇవ్వడంతోనే..వారి నియామకాలు జరిగాయని చెబుతున్నారు. వాస్తవానికి వాళ్లు నిర్వహించే పోస్టుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమిస్తారు. కనీసం కార్యదర్శి, అంతకన్నా ఎగువస్థాయికి చెందిన వారిని నియమిస్తారు. సీనియర్స్ అయితే..వారికి గతంలో వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం ఉంటుంది కనుక..తమ అనుభవంతో..ముందుకు వెళతారు. కానీ..ఇక్కడ మాత్రం దానికి విరుద్దంగా జరుగుతోంది.
పొరుగు రాష్ట్రాలు ఏమి చేస్తున్నాయి..?
పొరుగు రాష్ట్రాలైన ‘తెలంగాణ’, ‘కర్ణాటక’, ‘తమిళనాడు’, ‘కేరళ’, మహారాష్ట్రలు ఈ కీలకమైన శాఖల్లో కార్యదర్శి, ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారులను నియమించి మంచి ఫలితాలను రాబడుతోంది. మన రాష్ట్రంలో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతోంది. దీంతో ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోంది. అదే సమయంలో కాలం హరించుకుపోతోంది. వీరి అనుభరాహిత్యం వల్ల కీలకమైన ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. ఉదాహరణకు ‘ఫైబర్‌నెట్’లో ఏడాదికి రెండువేల కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యం పెట్టుకుంటే.. కనీసం రెండు వందలు రూపాయలు కూడా రాబట్టలేదని ఆ సంస్థమాజీ ఛైర్మన్ ‘జివి రెడ్డి’ ఆరోపణలు గుప్పించారు. దీనికి ఆయన ఆ సంస్థ ఎండినే కారణంగా చూపారు. ఇదొక్కడేనా..మిగతా సంస్థల్లోనూ ఇదేవిధమైన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ దీనిపై ప్రత్యేక శ్రద్ధచూపించాల్సిన అవసరం ఉంది. జూనియర్ ఐఏఎస్‌లను అక్కడ నుంచి తొలగించి, సీనియర్లకు బాధ్యతలు అప్పగించాలి.సిఎంఓలో ఈ శాఖలపై ప్రత్యేక శ్రద్ధచూపించే అధికారులను నియమించి పర్యవేక్షించాలి. అప్పుడే ఆయన అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోగలుగుతారు. లేకుండా రాష్ట్ర భవిష్యత్తుతో ఆయన చెలగాటమాడినట్లే.