లేటెస్ట్

‘వైకాపా’ ‘పాము’కు పాలుపోస్తున్నదెవరండి...!?

‘వైకాపా’ నాయకులు పాములు వంటివారని, వారికి పాలుపోస్తే సహించేది లేదని, ముఖ్యమంత్రి, టిడిపి అధినేత ‘నారా చంద్రబాబునాయుడు’ పార్టీ నాయకులను హెచ్చరించారు. దీనిపై పార్టీలో చర్చ జరుగుతోంది. నిజమైన కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు ఎవరూ ‘వైకాపా’ వారిని సమర్ధించరు. కానీ..కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ నాయకులే వారితో కుమ్మక్కు అవుతున్నారని, వారూ వీరూ కలిసి వ్యాపారాలు చేస్తున్న సంగతి అధినేతకు తెలియదా..? అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతి జిల్లాలో కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయనే సంగతి పెద్దాయనకు తెలియదా...? రాజధాని జిల్లాలైన ‘గుంటూరు, కృష్ణాల్లో ఎవరు..ఎవరితో కుమ్మక్కు అయ్యారో..ఆయా జిల్లాలోని అందరికీ తెలుసునని, ఇప్పుడు ‘పాము’కు పాలుపోయవద్దని అంటే వాళ్లు ఆగుతారా.? అంటూ కొందరు కార్యకర్తలు, స్థానిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. ‘గుంటూరు’ జిల్లాలో ఓ మాజీ వైకాపా మంత్రితో ‘టిడిపి’కి చెందిన మాజీ మంత్రి కుమ్మక్కు అయ్యారనేది బహిరంగ రహస్యమే. మాజీ మంత్రిపై చర్యలు తీసుకోకుండా ఆయన కాపాడుతున్నారనే భావన కార్యకర్తల్లో ఉంది. అదే విధంగా కృష్ణా జిల్లాలోని వైకాపా మాజీ మంత్రులను కాపాడుతున్నారని, ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులు దీనిలో ఉన్నారని కార్యకర్తలు అంతరంగిక సమావేశాల్లో చెప్పుకుంటున్నారు. రాయలసీమలోని ‘కడప’ జిల్లాలో వైకాపా ఎంపి ‘అవినాష్‌రెడ్డి’తో ‘టిడిపి’ నేతలు కుమ్మక్కు అయ్యారని, టిడిపిలో అంతర్గత సంఘర్షణలతో ‘అవినాష్‌రెడ్డి’కి కొందరు ‘టిడిపి’ నాయకులే మద్దతు ఇస్తున్నారనే సంగతి కూడా బహిరంగ రహస్యమే. ఇక ‘చిత్తూరు’ జిల్లా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ‘వైకాపా’ హయాంలో సాక్షాత్తూ ‘చంద్రబాబు’నే తీవ్రంగా ఇబ్బంది పెట్టిన ‘పెద్దిరెడ్డి కుటుంబానికి’ ప్రభుత్వ పెద్దలే మద్దతు ఇస్తున్నారని కార్యకర్తల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ‘పెద్దిరెడ్డి’ అనుచరులు రెవిన్యూ కార్యాలయాలను తగులపెట్టినా, అటవీభూములను ఆక్రమించినా...ప్రజల ఆస్తులను కొల్లగొట్టినా..వారిపై చర్యలు లేవని, ఇక్కడ ‘పెద్దపాము’కు పాలుపోస్తున్నదెవరని..వారు ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా  కర్నూలు, అనంతపురంలోనూ వైకాపా పెద్దలను ‘టిడిపి’లోని వర్గాలు కాపాడుతున్నాయి. పైస్థాయిలో జరుగుతున్న కుమ్మక్కు కిందస్థాయికి పాకిపోయిందని, మీకు ఇంత..మాకు ఇంత..అంటూ పంచుకుతింటున్నారనే అభిప్రాయం బలంగా వెళుతోంది. పైస్థాయిపై ఇటువంటి అపోహలు రాకుండా చూసుకుంటే..ఇప్పుడు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు.


గతంలో ‘అన్న ఎన్టీఆర్‌’ అధికారంలో ఉన్నప్పుడు ‘టిడిపి’ వాళ్లు ‘కాంగ్రెస్‌’ నేతలతో మాట్లాడడానికే జంకేవారు. కానీ..ఇప్పుడా క్రమశిక్షణ అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైకాపా నాయకులు, వారి సైకో సైన్యంతో హోరాహోరిగా పోరాడిన ‘టిడిపి’ కార్యకర్తలు ఇప్పుడు జరుగుతున్న కుమ్మక్కు రాజకీయాలను చూసి రాజకీయాలపైనే విరక్తి చూపిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు పైసలు ఉన్నవారికే పనులు చేసిపెడుతున్నారు. గత వైకాపా హయాంలో వైకాపాకు మద్దతు ఇచ్చిన అధికారులే ఇప్పుడూ పెత్తనం చేస్తుండడంతో..వైకాపా నాయకులు పనులు సులువుగా అవుతున్నాయి. పైగా గత ఐదేళ్లలో ఇబ్బడిముబ్బడి సొమ్ములు సంపాదించిన వైకాపా నాయకులు ఇప్పుడు సొమ్ములు వెదజల్లి పనులు చేయించుకుంటున్నారు. వారి సొమ్ములకు మంత్రులు, ఎమ్మెల్యేలు పడిపోతున్నారు. వారిచ్చిన సొమ్ములు తీసుకుని వారికే పనులు చేసిపెడుతున్నారు. నిజమైన కార్యకర్తలు, సానుభూతిపరులకు పనులు జరగడం లేదనేది కాదనలేని సత్యం. వారిని పట్టించుకునే తీరిక ఎవరికీ లేదు. అధినేత ‘చంద్రబాబు’ పార్టీ మీటింగ్‌లో చెబుతున్నా..కింద స్థాయిలో మాత్రం ఎమ్మెల్యేలు, మంత్రులు కార్యకర్తలను దగ్గరకు కూడా రానీయడం లేదు. వారిని దగ్గరకు రానిస్తే..వారేమి పనులు అడుగుతారో..అడిగితే ఊరికే చేయాల్సి వస్తుందన్న భావనతో వారందరినీ దూరం పెడుతున్నారు. దీంతో కార్యకర్తలు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు వైకాపాతో కలవడానికి ఇష్టపడరు. కానీ..వైకాపా అనే పాముకు పాలుపోస్తోంది..అధికారం వెలగబెడుతోన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులే. ఇది అధినేత గుర్తించాలి. అప్పుడు వైకాపా అనే పామును రాజకీయాల నుంచి పారదోలడానికి అవకాశం ఉంటుంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ