లేటెస్ట్

‘కూటమి’కే జైకొట్టిన ‘విద్యావంతులు’...!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత జరుగుతున్న ప్రత్యక్ష ఎన్నికల్లో ‘విద్యావంతులు’ కూటమికే మళ్లీ జైకొట్టారు. మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు చోట్ల కూటమి బలపరిచిన అభ్యర్థులు ముందంజలో ఉండగా, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం ‘పీఆర్‌టియు’ అభ్యర్థి ‘గాదె శ్రీనివాసుల నాయుడు’ ‘స్వల్ప మెజార్టీతో ‘కూటమి’ బలపరిచిన అభ్యర్థి ‘రఘువర్మ’పై విజయం సాధించారు. హోరాహోరిగా జరిగిన ఈ ఎన్నికల్లో ‘గాదె’మూడో ప్రాధాన్యతా ఓట్లతో బటయపడ్డారు. ‘గాదె’కు మొదటి ప్రాధాన్యతా ఓట్లలో 7210 ఓట్లు రాగా, ‘ఏపిటీఎఫ్‌ అభ్యర్థి’ ‘రఘువర్మ’కు 6,845 ఓట్లు, వైకాపా బలపరిచిన ‘విజయగౌరి’కి 5804 ఓట్లు వచ్చాయి. దీంతో ఎవరికీ గెలుపు కావాల్సిన ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వచ్చింది. చివరకు మూడో ప్రాధాన్యతా ఓట్లతో ‘గాదె’ గెలుపొందారు. హోరాహోరిగా జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘కూటమి’ బలపరిచిన అభ్యర్థి పోరాడి స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాగా ‘గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్థి ‘ఆలపాటి రాజేంద్రప్రసాద్‌’ బ్రహ్మాండమైన మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకూ నాలుగు రౌండ్ల కౌంటింగ్‌ జరగగా ఆయన ప్రతి రౌండ్‌లో దాదాపు 10వేల ఓట్ల మెజార్టీ సాధిస్తున్నారు. ఇదే రీతిలో మిగతా రౌండ్లలో కూడా జరిగితే ఆయనకు దాదాపు 90వేల మెజార్టీ రావచ్చు. ఎన్నికలకు ముందు ‘పిడిఎఫ్‌’ అభ్యర్థి ‘లక్ష్మణరావు’ హోరాహోరిగా పోరాడుతున్నారనే వార్తలు వచ్చాయి. పైగా ఆయనకు ‘వైకాపా’ మద్దతు ఇవ్వడంతో ‘ఆలపాటి’కి, ‘లక్ష్మణరావు’కు మధ్య హోరాహోరి పోరు ఉంటుందని కొందరు విశ్లేషించారు. అయితే..అవన్నీ ప్రచారాలేనని, విద్యావంతులంతా గత ఎన్నికల్లో ఉన్నట్లే ఇప్పుడూ ‘కూటమి’ వైపే నిలిచారని వస్తోన్న ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల కన్నా మిన్నగా ‘గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్లు ‘కూటమి’కి అనుకూలంగా తీర్పు ఇస్తున్నారు.


బాబు, ప‌వ‌న్‌ల‌పైనే న‌మ్మ‌కం

తొమ్మిది నెలల్లో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదని ‘జగన్‌’తో పాటు ‘కమ్యూనిస్టులు’ ప్రచారాన్ని హోరెత్తించారు. దాన్ని కొన్ని మీడియా సంస్థలు బూతద్దంలో చూపించాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ‘కూటమి’ పని అయిపోయినట్లేనన్నట్లు ప్రచారం ప్రారంభించాయి. అయితే..కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఎనిమిది నెల‌ల్లోనే ఎన్నో హామీల‌ను నెర‌వేర్చింది. ఒకేసారి వెయ్యిరూపాయ‌ల పెన్ష‌న్ పెంపు, పోల‌వ‌రానికి నిధులు, రాజ‌ధాని అమ‌రావ‌తికి నిధులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్ర‌వేటీక‌ర‌ణ నిలుపుద‌ల‌, రాష్ట్రంలోని ర‌హ‌దారుల మ‌ర‌మ్మ‌త్తులు, మ‌ద్యం ధ‌ర‌లు త‌గ్గింపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దు, చెత్త‌ప‌న్ను ర‌ద్దు, ఉచిత ఇసుక ప‌థ‌కం..ఇలా ఎన్నో హామీల‌ను ఆరు నెల‌ల్లో పార‌ద‌ర్శ‌కంగా చేసింది. కూట‌మి ప్ర‌భుత్వ చిత్త‌శుద్దిపై విద్యావంతులకు న‌మ్మ‌కం కుద‌ర‌డంతోనే..ఈ ఎన్నిక‌ల్లో కూట‌మి ఎమ్మెల్సీల‌కు అంత మెజార్టీలు ల‌భిస్తున్నాయి. వైకాపా పోటీ చేయ‌క‌పోయినా..ప‌రోక్షంగా క‌మ్యూనిస్టుల‌కు మ‌ద్ద‌తు ఇస్తుండ‌డంతో..వారూ పోటీలో ఉన్న‌ట్లే. ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’, ఉప ముఖ్యమంత్రి ‘పవన్‌కళ్యాణ్‌’ల జోడి బాగానే పనిచేస్తుందని, కొన్ని సరిదిద్దుకునే లోపాలు ఉన్నా...మిగతా విషయాల్లో బాగానే ఉందనే అభిప్రాయాన్ని వారు తమ ఓటు ద్వారా తెలియచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీల్లో కొన్నింటిని నెరవేర్చింది. అయితే..మరికొన్నిటి అమలు చేస్తామని, ‘జగన్‌’ చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల ఆలస్యం అవుతుందన్న ‘చంద్రబాబు’ మాటలను వారు అర్థం చేసుకున్నారు. రాష్ట్రం బాగుండాలంటే ‘కూటమి’కే మద్దతు ఇవ్వాలని ‘విద్యావంతులు’ భావించారు. అందుకే ఎవరూ ఊహించని విధంగా కూటమి అభ్యర్థి ‘ఆలపాటి రాజేంద్రప్రసాద్‌’ రౌండ్‌ రౌండ్‌కూ భారీ మెజార్టీ సాధిస్తున్నారు. ఇక కూటమి బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓడిపోవడం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉపాధ్యాయుల మొత్తం ఓటింగ్‌ 20వేలు. దానిలో ‘పీఆర్‌టియు’ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 7210 కాగా కూటమి బలపరిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు 6845. ఇద్దరి మధ్య తేడా కేవలం 365 ఓట్లు. అయితే...ఓట్లు ఎన్ని అయినా..ఈ వర్గంలో ప్రభుత్వంపై ఎందుకు ఆగ్రహం వ్యక్తం అవుతుందో తెలుసుకుని ప్రభుత్వ పెద్దలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద..సార్వత్రిక ఫలితాలే..ఇప్పుడు కనిపిస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. రాష్ట్ర ప్రజలు ‘కూటమి’ పాలనపై సంతృప్తిగానే ఉన్నారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ