లేటెస్ట్

‘అన్నగారి’ అల్లుళ్లు...!?

‘ఆంధ్రుల’ ఆరాధ్యదైవం స్వర్గీయ ‘నందమూరి తారకరామారావు’ అల్లుళ్లైన ‘దగ్గుబాటి వెంకటేశ్వరరావు’, ‘నారా చంద్రబాబునాయుడు’లు సుమారు 30ఏళ్ల తరువాత ఒకే వేదికపై కనిపించడం, ఇద్దరూ హుషారుగా ఒకరిపై ఒకరు జోకులు వెసుకోవడం, అప్యాయంగా హత్తుకోవడం చూపరులను, ‘నందమూరి’ కుటుంబ అభిమానులను అలరించింది. ‘ఎన్టీఆర్‌’ పెద్దల్లుడైన ‘దగ్గుబాటి వెంకటేశ్వరరావు’ రాసిన ‘ప్రపంచచరిత్ర’ పుస్తకావిష్కరణ సభలో ఈ అరుదైన దృశ్యాలు కనిపించాయి. ఒకప్పుడు ‘తెలుగుదేశం’ పార్టీలో చురుగ్గా పనిచేసిన ఈ ఇద్దరు అల్లుళ్లు ‘అన్న’ ‘ఎన్టీఆర్‌’కు ‘నాదెండ్ల భాస్కర్‌రావు’ వెన్నుపోటు పోడిస్తే...ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు అనేక రకాలుగా పోరాడి  మళ్లీ మామను ‘సిఎం’ సీటులో కూర్చోబెట్టగలిగారు. ఆ తరువాత ‘టిడిపి’ ఏడేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఒకరు పార్టీ కార్యక్రమాలు చూసుకోగా..మరొకరు ప్రభుత్వ కార్యక్రమాలు చూసుకుని ‘ఎన్టీఆర్‌’కు చోదోడు వాదోడుగా ఉన్నారు. అయితే..1994లో ఎన్టీఆర్‌ అఖండ మెజార్టీతో మరోసారి ముఖ్యమంత్రి అవడం..ఆయన జీవితంలోకి ‘లక్ష్మీపార్వతి’ రావడంతో రాజకీయాలు చకచకా మారిపోయాయి. పార్టీ ‘లక్ష్మీపార్వతి’ చేతిలోకి వెళుతుందన్న భయంతో..‘తోడలుళ్లు’ ఇద్దరూ..‘అన్న’ కుటుంబసభ్యులతో కలిసి ‘ఎన్టీఆర్‌’ను పదవి నుంచి దించేశారు. ఈ సమయంలో ఈ ఇద్దరు అల్లుళ్లు ఒకే మాటమీద ఉన్నారు. అయితే.. తరువాత.. ఒకరిపై ఒకరు రాజకీయంగా పైచేయి సాధించడానికి ఎత్తుకుపై ఎత్తులు వేశారు. ఈ సందర్భంగానే....జరిగిన సంఘటనలు ఈ ఇద్దరి మధ్య పూడ్చలేని అగాధాన్ని సృష్టించాయి.



ఇద్ద‌రి మ‌ధ్య అగాదం...!

ఈ అగాధానికి ప్రధాన కారణం ఎన్టీఆర్‌ రాజకీయవారసత్వాన్ని ఇద్దరూ కోరుకోవడమే. అలా వారసత్వం కోసం వీరు..ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి రకరకాల మార్గాలను అన్వేషించారు. వాస్తవానికి ‘చంద్రబాబు’ కంటే ముందే ‘దగ్గుబాటి’ పార్టీలో ఉన్నారు. ‘ఎన్టీఆర్‌’ పార్టీ ప్రారంభించినప్పుడు ‘దగ్గుబాటి’ ఆయన భార్య ‘పురంధేశ్వరి’లు పార్టీ కరపత్రాలను వారే స్వయంగా గోడలపై అంటించారంటారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వారు చేయాల్సిందల్లా చేశారు. అయితే 1983లో ఎన్టీఆర్‌ అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తరువాత ‘చంద్రబాబు’ ‘టిడిపి’లో చేరారు. ఆ చేరిక ‘దగ్గుబాటి’కి ఇష్టంలేదంటారు. అయితే..‘చంద్రబాబు’లోని రాజకీయ చురుకుదల, ఆయన వ్యూహాలను చూసి ‘ఎన్టీఆర్‌’ ‘చంద్రబాబు’కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ‘ఎన్టీఆర్‌’ అధికారంలో ఉన్నప్పుడు ‘చంద్రబాబు’ ‘డాక్టర్‌’లు రెండు వర్గాలుగా ఉండేది. ‘చంద్రబాబు’ ఒక వర్గంలో కొంత మంది ‘టిడిపి’ నేతలు ఉంటే ‘దగ్గుబాటి’ వర్గంలో మరికొందరు ఉండేవారు. తమ తమ మనుషులకు టిక్కెట్లు ఇప్పించుకుని ‘చంద్రబాబు’ ‘డాక్టర్‌గారు’ ఇద్దరూ..తమ తమ వర్గాలను పటిష్టం చేసుకునేవారు. అయితే 1989లో ‘టిడిపి’ ఓడిపోయిన తరువాత ‘ఎన్టీఆర్‌’ జీవితంలోకి ‘లక్ష్మీపార్వతి’ రావడంతో పార్టీలో మూడో వర్గం ఏర్ప‌డింది.


ఎన్టీఆర్ ప‌ద‌వీచ్యుతి...!

మూడోవర్గం ఏర్పడడమే కాక పార్టీ అధినేత ‘ఎన్టీఆర్‌’ ‘లక్ష్మీపార్వతి’వైపు మొగ్గుచూపుతుండడంతో ఇద్దరు అల్లుళ్లు కుటుంబంతో కలిసి ‘ఎన్టీఆర్‌’ని పదవి నుంచి దించేశారు. అయితే ‘ఎన్టీఆర్‌’ను పదవి నుంచి దింపిన తరువాత ‘సిఎం’గా ‘చంద్రబాబు’ ఉండాలని, ‘దగ్గుబాటి’కి డిప్యూటీ సిఎం ఇవ్వాలని, హరికృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని ఒప్పందం కుదిరింది. అనుకున్నట్లే..ఎన్టీఆర్‌ను దించేసిన తరువాత ‘చంద్రబాబు’ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ..‘దగ్గుబాటి’కి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో తోడల్లుడిపై ‘దగ్గుబాటి’ క్రోథంలో రగిలిపోయారు. అంతేనా వెంటనే ‘ఎన్టీఆర్‌’ దగ్గరకు తిరిగి వెళ్లిపోయారు. అంతలోనే ‘ఎన్టీఆర్‌’ మరణించారు. ‘ఎన్టీఆర్‌’ మరణించిన తరువాత ‘దగ్గుబాటి’ ‘లక్ష్మీపార్వతి’లకు కలిసి ‘అన్నఎన్టీఆర్‌’ పార్టీని పెట్టుకుని అప్పుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే..అప్పుడు ఆ పార్టీ ఒక్క పార్లమెంట్‌ సీటును కూడా దక్కించుకోలేకపోయింది. అదే సమయంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ‘దగ్గుబాటి వెంకటేశ్వరరావు’ పోటీ చేస్తే..ఆయనను ఓడిరచడానికి ‘లక్ష్మీపార్వతి’ ప్రయత్నించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ‘దగ్గుబాటి’ ‘బిజెపి’లో చేరారు. అయితే..అదే సమయంలో ‘కేంద్రం’లో ‘బిజెపి’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ‘టిడిపి’ మద్దతు అవసరమైంది. దీంతో..బిజెపిలో ఉన్న ‘దగ్గుబాటి’ ‘చంద్రబాబు’ను కలిసేందుకు ఆయన ఇంటికి వచ్చారు. ‘దగ్గుబాటి’ స్వయంగా ‘చంద్రబాబు’ ఇంటికి వచ్చినా..ఆయన స్పందించకపోవడంతో మరోసారి ‘దగ్గుబాటి’ చిన్నబుచ్చుకున్నారు. ఈపరిస్థితుల్లో ఆయన ‘కాంగ్రెస్‌’లో సతీసమేతంగా చేరారు. ఆయన ఎమ్మెల్యేగా, ‘పురంధేశ్వరి’ ఎంపిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే..తనకంటే పార్టీలోకి వెనుక వచ్చి ‘చంద్రబాబు’ పార్టీని తన్నుకుపోయారని, తనకు విలువ ఇవ్వలేదని అప్పటి నుంచి ‘చంద్రబాబు’పై ‘వెంకటేశ్వరరావు’కు గుర్రు ఉండేది. 


‘ఒక చరిత్ర-కొన్ని నిజాలు’ 

ఈ నేపథ్యంలోనే ఆయన ‘ఒక చరిత్ర-కొన్ని నిజాలు’ అంటూ ‘చంద్రబాబు’ కుట్రలు చేశారని, ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించడంలో తన పాత్ర, ‘చంద్రబాబు’ పాత్ర, ‘లక్ష్మీపార్వతి’పాత్ర, హరికృష్ణపాత్ర ఇతర ప్రముఖుల గురించి రాశారు. ఈ పుస్తకం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే..ఆయన ఎన్ని పుస్తకాలు రాసినా..‘చంద్రబాబే’ చివరకి ‘టిడిపి’కి రాజకీయ వారసుడు కాగలిగారు. ఆయన ఎదుగుదలను ఎంత అడ్డుకోవాలన్నా..‘దగ్గుబాటి’ అడ్డుకోలేకపోయారు. ‘చంద్రబాబు’తో ఎక్కడలేనంత రాజకీయవైరాన్ని ‘దగ్గుబాటి’పెట్టుకున్నా..‘చంద్రబాబు’ డక్కీమొక్కీలు తిని..రాజకీయంగా ముందంజలోనే ఉన్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల వరకు కూడా ‘దగ్గుబాటి’‘చంద్రబాబు’ పొడను జీర్ణించుకులోకపోయారు.వీరిద్ద‌రి మ‌ధ్య వైరం ఎలా ఉందంటే చివ‌ర‌కు స్వంత అక్కా చెళ్లెల్లు అయిన పురంధేశ్వ‌రి,భువ‌నేశ్వ‌రిలు సుమారు 20ఏళ్ల‌పాటు ఒక‌రితో ఒక‌రు మాట్లాడుకోలేదు. అంతేనా..చంద్ర‌బాబుపై ఉన్న కోపంతో..ఆయ‌న‌ను దెబ్బ‌కొట్టాల‌నే ఆలోచ‌న‌తో.. చివరకు.. అత్యంత అవినీతి, రక్తచరిత్ర ఉన్న ‘జగన్‌’పార్టీలోనూ అత్యంత నిజాయితీపరునిగా పేరున్న ‘డాక్టర్‌గారూ’ చేరిపోయారంటే..ఆయనకు ‘చంద్రబాబు’ అంటే పడకపోవడమే. చివరకు మొన్నటి ఎన్నికల్లో ‘పర్చూరు’ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన ‘చంద్రబాబు’పై పోరాటంలో తెల్ల జెండా ఎత్తేశారు. తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని, తనకు రాజకీయ లక్ష్యాలు లేవని, శేషజీవితం.. ప్రశాంతంగా గడుపుతానని ఆయన ప్రకటించారు. ఈ ప్రకటన తరువాతే మళ్లీ ‘చంద్రబాబు’ ‘డాక్టర్‌గారు’ ఇద్దరూ అప్పుడప్పుడు బంధువులతో కలిసి మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు బహిరంగంగా అభినందనలు, జోకులు, ఆలింగనాలు చేసుకుంటూ జీవితాన్ని ఆహ్లాదకరంగా చేసుకుంటూ బంధుత్వంలోని మాధుర్యాన్ని చవిచూస్తున్నారు. సుమారు ముప్పయేళ్లపాటు సాగించిన పోరులో ఎవరు గెలిచారు..ఎవరు ఓడారనే దాని కన్నా..బంధువుల్లో ఎంత పోటీ ఉన్నా..చివరకు కలిసిపోవాలనే జీవితసత్యాన్ని వారిద్దరూ నిరూపించారు. దీనికి ఇద్దరూ అభినందనీయులే. కొన్ని కొన్ని పేరెన్నిక‌ గ‌ల రాజ‌కీయ‌ ఫ్యాక్ష‌న్ కుటుంబాలు  ఆస్తుల కోసం..రాజ‌కీయ ప‌ద‌వుల కోసం,పెత్తనం కోసం రక్తసంబంధీకులనే నరికేస్తుంటే..‘అన్నగారి’ అల్లుళ్లు మాత్రం బంధుత్వాలకు విలువనిస్తూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా, ఆదర్శనీయంగా ఉండడం..రేపటి తరానికి మార్గదర్శకులు అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ