‘ఐఏఎస్’ల బదిలీలు ఎప్పుడో...!?
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో..పెండిరగ్ పనులు ఊపందుకోబోతున్నాయి. రాజధాని ‘అమరావతి’ టెండర్లుతో పాటు, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక, సీనియర్ ఐఏఎస్, ఐపిఎస్‌ల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకోబోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిదిమాసాలు కావస్తున్నా..పాలనపై ఇంకా పట్టురాలేదనే విమర్శలు అన్ని వర్గాల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవస్థలో కీలకమైన ఐఏఎస్ అధికారులను బదిలీ చేయబోతున్నారు. ముఖ్యంగా కొందరు సీనియర్ ఐఏఎస్‌లు మంత్రులు, కార్పొరేషన్ ఛైర్మన్ల మాట వినడం లేదని, అధికారులే పెత్తన చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ‘ఫైబర్‌నెట్’ మాజీ ఛైర్మన్ ‘జీవీరెడ్డి’ ఆ సంస్థ ఎండి ‘దినేష్‌కుమార్’పై ఆరోపణలు చేసి, తన పదవికి రాజీనామా చేసిన తరువాత, ఐఏఎస్ అధికారులపై పలు ఫిర్యాదులు వచ్చాయి. ఐఏఎస్ అధికారులు ఇంకా ‘వైకాపా’ నాయకులకే ఊడిగం చేస్తున్నారని, టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లును వీరు అసలు పట్టించుకోవడం లేదని, అధినేత ‘చంద్రబాబు’కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఇప్పుడు పలువురు సీనియర్ ఐఏఎస్‌లను బదిలీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నాడు మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. ఈ మంత్రివర్గ సమావేశం తరువాత కానీ, లేకపోతే ‘శని, ఆది’ వారాల్లో ఐఏఎస్ అధికారుల బదిలీ ఉత్తర్వులు వెలువడుతాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే లిస్ట్ తయారైందని, దీన్ని ముఖ్యమంత్రి ఆమోదించడమే తరువాయి అని ప్రచారం జరుగుతోంది. సీనియర్ ఐఏఎస్‌లతో పాటు, కొందరు జూనియర్ ఐఏఎస్ అధికారులు ప్రాదాన్యత కలిగిన శాఖలను పర్యవేక్షిస్తున్నారని, అయితే వారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వేగాన్ని అందుకోలేకపోతున్నారని, దీంతో వారిని అక్కడ నుంచి తప్పించి, సీనియర్లకు ఆ బాధ్యత అప్పగించాలనే భావన ముఖ్యమంత్రిలో ఉందంటున్నారు.
మరోవైపు సిఎంఓలో మార్పులు ఉండవచ్చని, అక్కడ పనిచేస్తోన్న ఇద్దరు జూనియర్ ఐఏఎస్‌ల పనితీరు సరిగా లేదని, వారిలో ఒకరిని తప్పిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరిలో ఒకరు వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్నారనే విమర్శ ఉంది.మరో అధికారి పనితీరు కూడా సరిగా లేదని, ఆయన వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్తిగా లేరంటున్నారు. ఇటీవల ఆయనను ‘చంద్రబాబు’ తీవ్రంగా మందలించారని ప్రచారం సాగుతోంది. అయితే..‘సిఎంఓ’లో ఎవరినీ కదిలించరని, వారిని అలాగే కొనసాగిస్తూ, సిఎంఓలోకి కొత్తవారిని తీసుకుంటారంటున్నారు. ఆ వచ్చిన వ్యక్తికి మొత్తం సిఎంఓ పర్యవేక్షణ బాధ్యత ఇస్తారంటున్నారు. అయితే..ఇది సాధ్యమయ్యే పనికాదు. సిఎంఓ పర్యవేక్షణ అంటే ఆ వ్యవహారం మరింత గందరగోళానికి గురవుతుందని, అలా కాకుండా ఆ నియమించే అధికారికి కొన్ని ప్రత్యేక అధికారాలు ఇస్తారంటున్నారు. దీంతో ఇప్పుడు సిఎంఓలో ఉన్న ఐదుగురితో పాటు మరో వ్యక్తి అక్కడకు వస్తారంటున్నారు. కాగా..నామినేటెడ్ పదవుల్లో భాగంగా ఓ ఇద్దరు వ్యక్తులను సలహాదారులుగా నియమిస్తారంటున్నారు. గతంలో సలహాదారుగా పనిచేసిన ఓ ఆర్థికవేత్త మరోసారి సలహాదారుగా రాబోతున్నారనే ప్రచారం సాగుతోంది. కాగా కొందరు ఐఏఎస్‌లపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, వీరిని కూడా బదిలీ చేస్తారని తెలుస్తోంది. మొత్తం మీద వచ్చే రెండు,మూడు రోజుల్లో ఐఏఎస్‌ల బదిలీలు ఉంటాయంటున్నారు.