‘చంద్రబాబు’ రిటైర్మెంట్‌పై కీలకవ్యాఖ్యలు...!
‘లోకేష్’ను ‘సిఎం’ చేస్తారా...?
ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ ఈరోజు తన రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ తీరాన తన తోడల్లుడు ‘దగ్గుబాటి వెంకటేశ్వరరావు’ రాసిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ ‘వెంకటేశ్వరరావు’ రాజకీయాల నుంచి రిటైర్ అయి..ప్రశాంతంగా ఉంటున్నారని, తనకు అటువంటి పరిస్థితి వస్తుందని, దానికి తాను సిద్ధమవుతున్నానన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సందర్భోచితమే. అయితే..దీనిపై రాజకీయవర్గాలు ఆరా తీస్తున్నాయి. తాను రిటైర్ అయితే..తరువాత జీవితాన్ని ఎలా గడపాలో..ఇప్పటి నుంచో..ప్రణాళిక సిద్ధం చేసుకుంటానని నర్మగర్భంగా చెప్పడం..ఊహాగానాలకు తావిస్తోంది. 75ఏళ్ల ‘చంద్రబాబు’ ఇప్పటికీ ఆరోగ్యంగా, ఫిట్‌గానే ఉన్నారు. అయితే..ఆయన మరెన్నో రోజులు రాజకీయాల్లో ఉండరని గత కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. ఆయన తన తనయుడు ‘లోకేష్’కు పగ్గాలు అందిస్తారని, వచ్చే ఏడాది కానీ, రాబోయే ఏడాది కానీ ‘లోకేష్’ను ‘సిఎం’చేస్తారని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ఇది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే..ఇప్పుడు పరిపాలన చేస్తోంది కేవలం ‘తెలుగుదేశం ’ ప్రభుత్వం కాదు. దీనిలో ‘జనసేన’ ‘బిజెపి’లోకూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఎన్నికల ముందే వీరంతా కూటమిగా ఏర్పడి పొత్తులు ఏర్పాటు చేసుకుని ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ కూటమిలో కీలకమైన ‘జనసేన’ ‘చంద్రబాబు’ రిటైర్ అయితే..తమ అధినేత ‘పవన్‌కళ్యాణ్’ను సిఎం చేయాలని పట్టుపడుతోంది. ఇటీవల కాలంలో..‘లోకేష్’ను ‘డిప్యూటీ సిఎం చేయాలని కొందరు ‘టిడిపి’ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించడంతో..‘జనసేన’ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. ‘లోకేష్’ను ‘డిప్యూటీ సిఎం చేస్తే తమనేతను ‘ముఖ్యమంత్రి’ని చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో..ఇరు పార్టీల మధ్య తీవ్రంగా మాటల వాదనలు సాగాయి. దీంతో ‘చంద్రబాబు’ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
పవన్ ఒప్పుకుంటారా..?
ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ‘చంద్రబాబు’ రిటైర్ అయితే..‘లోకేష్’ సాఫీగా ముఖ్యమంత్రి కాలేరు. ఆయన ముఖ్యమంత్రి కావాలంటే ‘పవన్’, ‘బిజెపి’ పెద్దలు ఒప్పుకుంటేనే సాధ్యమవుతుంది. అయితే...వీళ్లు దానికి ఒప్పుకునే పరిస్థితి లేదు. ‘ఎన్‌డిఏ’ ప్రభుత్వం మరో 15ఏళ్లు అధికారంలో ఉంటుందని, అప్పటి వరకూ తమ ముఖ్యమంత్రి ‘చంద్రబాబే’నని ఇటీవల ‘అసెంబ్లీ’లో ‘పవన్’ ప్రకటించారు. అంటే మరో పదిహేను సంవత్సరాలు ‘చంద్రబాబు’ ముఖ్యమంత్రిగా ఉంటే తనకు ఓకే..ఒక వేళ ఆయన కాకపోతే..తాను ఆ పదవిలో ఉండాలని ‘పవన్’ నర్మగర్భంగా చెప్పినట్లైంది. ఇప్పటికే ఆయన ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నారు.ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే విషయాల్లో ఆయన దూరంగా ఉంటున్నారు. అదే మంచి పేరు వచ్చే విషయాల్లో ఆయన ముందుంటున్నారు. కొన్నింటికి ఆయన బాధ్యత తీసుకుంటూ..మరి కొన్ని విషయాల్లో తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు ‘బిజెపి’ ‘చంద్రబాబు’ తరువాత ఏమి చేయాలో..అనేదానిపై ఇప్పటికే ప్లాన్ వేసుకున్నదనే ప్రచారం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ‘చంద్రబాబు’ రిటైర్ అయితే..అంత సాఫీగా ‘లోకేష్’కు ముఖ్యమంత్రి పదవి వచ్చే పరిస్థితి లేదు. వాస్తవానికి ‘పవన్ పార్టీ’ ‘బిజెపి’ల మద్దతు లేకుండానే ‘టిడిపి’ ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకోగలదు. ఇప్పుడు కనుక ‘చంద్రబాబు’ రిటైర్ అయి ‘లోకేష్’ను సిఎం చేయాలనుకుంటే..వెంటనే చేసుకోవచ్చు. కానీ..కూటమి నిలువునా చీలిపోతుంది. కూటమి చీలితే..ఆ దెబ్బ వచ్చే ఎన్నికల్లో ‘టిడిపి’పై భారీగా ఉంటుంది. ‘లోకేష్’ను ‘చంద్రబాబు’ సిఎం చేస్తే కీలకమైన ‘కాపు’ ఓట్లు ఈసారి ‘టిడిపి’కి పడవు. తమ నేతను మోసం చేశారనే భావన వారిలో ఉంటుంది. మొన్నటి ఎన్నికల సందర్భంలోనే వారు సిఎం పదవిపై పలు డిమాండ్లు చేశారు. సిఎం పదవిని ‘చంద్రబాబు’ సగం రోజులు ‘పవన్’ సగం రోజులు పంచుకోవాలని డిమాండ్ చేశారు. అలా అయితే..పొత్తు పెట్టుకోవాలని ఆ వర్గం డిమాండ్ చేసింది. అయితే..‘జగన్’ను ఓడిరచడం ముఖ్యమని..ముందు అది చేద్దామని ‘పవన్’ వారికి నచ్చచెప్పి ‘టిడిపి’తో పొత్తు కుదుర్చుకున్నారు. ఇటువంటి పరిస్థితులున్నప్పుడు ‘చంద్రబాబు’ రిటైర్ అయితే..అంత సులువుగా ‘లోకేష్’కు ముఖ్యమంత్రి పదవి దక్కదు. అయితే..ఇవన్నీ ఊహాగానాలే అని, ‘చంద్రబాబు’ ఇప్పట్లో రిటైర్ కారని, 2029 ఎన్నికల తరువాతే...ఆయన రిటైర్ అవుతారని, అప్పటి వరకూ..ఏమీ జరగదని కొందరు ‘టిడిపి’ నేతలు అంటున్నారు.