లేటెస్ట్

‘మనల్ని తిట్టినవారే..అందలం ఎక్కుతున్నారు’..!?

తొమ్మిది నెలలకు ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,చోటా నాయకులు..పార్టీ అధికారంలోకి వస్తే..తమను అందలం ఎక్కిస్తారని, తాము చేసిన పోరాటాలకు గుర్తింపునిస్తారని, తమను అధినేత, ఆయన కుమారుడు నెత్తినపెట్టుకుని చూసుకుంటారని, రాష్ట్రం బాగుంటుందని, అభివృద్ధి చెందుతుందని, తమను అవమానించిన, హింసించిన వారికి తగిన గుణపాఠం నేర్పుతారని, ఇలా ఎన్నెన్నో ఊహించుకున్నారు. అయితే..అధికారంలోకి వచ్చిన తరువాత వారి ఊహలన్నీ క్రమంగా చెరిగిపోతూ ఉన్నాయి. తమను హింసించిన వారిని, తమ కార్యకర్తలను హత్యలు చేసినవారి, దోపిడీకి పాల్పడిన వారిని, అధికార మదంతో..ఊరేగిన వారిని, హత్యా రాజకీయాలతో చెలరేగిన ఉన్మాదులను ‘చంద్రబాబు’ శిక్షస్తారని వారు అనుకుంటే..అవేమీ జరగకపోగా...వారు దర్జాగా రోడ్లపై కాలరెగెరేసి తిరుగుతుంటే..‘ఈయన రాజకీయం ఇంతేలే..’ అంటూ చాలా చోట్ల సరిపెట్టుకుంటున్నారు. అయితే..ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన రాజకీయం వల్ల నిన్నటి దాకా..అధినేతను, టిడిపి పార్టీనీ, అధినేత బంధువులను పిచ్చితిట్లు తిట్టినవారికి ఎమ్మెల్సీ సీట్లు వస్తుండడంతో..కార్యకర్తలు తీవ్ర నిరాశ,నిస్రృహ,నిర్వేదాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమి భాగస్వామ్య పార్టీలకు ఇచ్చిన ఎమ్మెల్సీసీట్లలో ‘జనసేన’, ‘బిజెపి’లు నిర్ణయించిన అభ్యర్థులపై ‘టిడిపి’ కార్యకర్తలు, నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ‘జనసేన’ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన ‘పవన్‌ కళ్యాణ్‌’ సోదరుడు ‘నాగబాబు’కు మొదటి నుంచి ‘టిడిపి’కి వ్యతిరేకమే. గతంలో ఆయన ‘చంద్రబాబు’ను, ఆయన బావమరిది ఎమ్మెల్యే ‘బాలకృష్ణ’ను నానా తిట్లు తిట్టారు.నోటికి పట్టరాని విధంగా దూషించారు. సరే..‘పవన్‌కళ్యాణ్‌’ కోసం ఈ ఎంపికపై ‘టిడిపి’ కార్యకర్తలు నోరు మెదపకపోయినా..ఇప్పుడు ‘బిజెపి’ నిర్ణయించిన ‘సోము వీర్రాజు’పై మాత్రం తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


‘సోము’కు ఎమ్మెల్సీ ఎలా ఇస్తారంటూ..పార్టీ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఆయన సగం..‘బిజెపి’...సగం ‘వైకాపా’ అని..అటువంటి వ్యక్తిని ఎలా ఎమ్మెల్సీని చేస్తారంటూ..వారు అధినేత ‘చంద్రబాబు’ను నిలదీస్తున్నారు. టిడిపి, బిజెపి పొత్తును వ్యతిరేకించిన ‘వీర్రాజు’ ఇప్పుడు పొత్తులో భాగంగా సీటు ఎలా తీసుకుంటారని ధ్వజమెత్తుతున్నారు. తమ రెక్కల కష్టంతో అధికారంలోకి వస్తే..ఇలా టిడిపి వ్యతిరేకులను నెత్తికెక్కించుకోవడం ఏమిటని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే..వారు ఎంత మొత్తుకున్నా..ఆవేదన వ్యక్తం చేసినా..ఇక్కడ ‘చంద్రబాబు’చేసే దేమీ లేదని, కూటమి పొత్తులో భాగంగా ఆయా పార్టీలకు సీట్లు ఇచ్చారని, వారు వారి పార్టీలో ఎవరికి కేటాయించినా..అడిగే అధికారం ‘టిడిపి’కి, ‘చంద్రబాబు’కు లేదంటున్నారు. గతంలో ‘చంద్రబాబు’ ‘మోడీ’పై విమర్శలు చేశాడు..కదా..మరి ఇప్పుడు ‘చంద్రబాబు’కు సిఎం పదవి వద్దంటే..సరేనా..? అంటూ ‘బిజెపి’లో ‘సోము’ను సమర్థించే నేతలు వాదిస్తున్నారు. గతంలో ఎన్నో విమర్శలు చేసుకున్నా..అది అప్పటి పరిస్థితుల్లోనేనని..ఇప్పుడు అవి వర్తించవని వారు అంటున్నారు. కూటమి సజావుగా సాగాలంటో..ఇలాంటివి తప్పవని..దీన్ని ‘టిడిపి’ శ్రేణులు అర్థం చేసుకోవాలని వారు చెబుతున్నారు. కాగా..తమను, తమ అధినేతను దూషించిన వాళ్లే..ఇప్పుడు అందలం ఎక్కడంపై ‘టిడిపి’ శ్రేణులు తీవ్ర ఆగ్రహం, ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ