లేటెస్ట్

‘ఆంధ్రజ్యోతి’ సంచలనం...!

ఐఏఎస్‌ అధికారుల భార్యల అవినీతిపై కథనం

ప్రముఖ దినపత్రిక ‘ఆంధ్రజ్యోతి’లో సంచలన కథనం ఒకటి వచ్చింది. రాష్ట్ర పరిపాలనలో కీలకమైన స్థానంలో ఉన్న ఐఏఎస్‌ అధికారుల భార్యలు తమ భర్తల హోదాలను అడ్డుపెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆ కథనంలో పేర్కొంది. ఆయా ఐఏఎస్‌ అధికారుల పేర్లు నేరుగా ప్రస్తావించకుండా వారి హోదాలను చెప్పకుండా..పరోక్షంగా చెబుతూ వార్తను ప్రచురించింది. ఈ కథనం ఇప్పుడు ఐఏఎస్‌ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించిన అధికారుల్లో ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’కు అత్యంత సన్నిహితులైన వారు కూడా ఉన్నారు. వారి పేరు నేరుగా రాయకపోయినా..గతంలో వారు పనిచేసిన చోటు, గత ప్రభుత్వంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ..వారిని టార్గెట్‌ చేసింది. కొద్దిగా రాజకీయ, అధికార పరిచయాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వారు ప్రస్తావించిన పేర్లు ఎవరివో తెలిసిపోతుంది. దీనిపై ఐఏఎస్‌ అధికారుల్లో, సచివాలయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. ఫలానా..అధికారి అంటూ..వారు తమ చర్చల్లో వారి పేర్లను బహిరంగంగా చెబుతున్నారు. ఈ కథనంలో ఒకరు కాదు..దాదాపు నలుగురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల భార్యల గురించి ప్రస్తావించారు. అయితే ముఖ్యమైన అధికారినే ఎక్కువగా టార్గెట్‌ చేశారు. అయితే..ఆ అధికారికి ఐఏఎస్‌ వర్గాల్లో మంచివాడు అనే పేరే ఉంది. ఆయన తన జీతం సొమ్ములను బడుగు,బలహీనవర్గాల పిల్లలకు ఖర్చు చేస్తారని, పెద్దగా అవినీతికి పాల్పడరనే పేరు ఉంది. జీవిత ఆఖరి రోజుల్లో తాను ‘జీరో’తో వెళ్లిపోవాలని ఆయన తనకు తెలిసిన వారి వద్ద, సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తుంటారు. స్వంత సొమ్మే పేదలకు ఖర్చు చేసే ఆ అధికారిపై ఇటువంటి కథనం రావడం అధికార, రాజకీయ వర్గాల్లో విస్మయం కల్గిస్తోంది. గుప్తదానాలు ఎన్నో చేసే ఆ అధికారి భార్య పేరుతో ఇటువంటి కథనం రావడం ఆయన సన్నిహితులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన సన్నిహితుల కథనం ప్రకారం ఆయన భార్య ఆరోగ్యం సరిగా లేదని,ఆమె ఇతర రాష్ట్రాల్లో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. అయితే..ఆమె భారీగా వసూళ్లకు పాల్పడ్డారని పేర్కొనడంతో దుమారం రేపుతోంది. ఈ కథనంలో నిజా నిజాలు ఎలా ఉన్నా..సీనియర్‌ ఐఏఎస్‌లపై వచ్చిన మచ్చ ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే..ఈ వార్తను ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ సీరియస్‌గా తీసుకుని విచారణచేయిస్తారా..? లేక వదిలేస్తారో..చూడాలి. అయితే..కేవలం ఈ అధికారిని మాత్రమే టార్గెట్‌ చేశారని భావిస్తారనే ఉద్దేశ్యంతో..మరో ముగ్గురు అధికారుల అవినీతి వ్యవహారాన్ని కూడా ఆ కథనంలో ప్రస్తావించారు. దీనిలో ‘చంద్రబాబు’ సామాజికవర్గానికి చెందిన అధికారి కూడా ఉండడం విశేషం. మొత్తం మీద సీనియర్‌, జూనియర్‌ ఐఏఎస్‌ల వ్యవహారాలు అంత సరిగా లేవనేది నిజం. అయితే..వ్యవస్థలు మొత్తం నాశనమైన పరిస్థితుల్లో ఉన్నవారిలో మేలైన వారితో పనిచేయించుకోవాలని ‘చంద్రబాబు’ భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా..ఈ కథనాన్ని అడ్డుపెట్టుకుని ‘వైకాపా’ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తోంది. ‘టిడిపి’ అనుకూల పత్రికలోనే ‘చంద్రబాబు’ అవినీతి గురించి రాశారని, ఐఏఎస్‌ల అవినీతిలో ‘చంద్రబాబు’ పాత్ర ఉందని, ఐఏఎస్‌లు చేసిన అవినీతిలో ‘చంద్రబాబు’కు భాగం ఉందని, వారు సొమ్ములు వసూళ్లు చేసి..‘చంద్రబాబు’కు అందిస్తున్నారని ఆరోపణలు గుప్పించింది. దీనిపై ఆ పార్టీ ఛానెల్‌ ఈరోజు ప్రత్యేక విశ్లేషణను చేపట్టింది.మొత్తం మీద..ఐఏఎస్‌ల భార్యల దందాలపై ‘ఆంధ్రజ్యోతి’ రాసిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి విచారణ చేయించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. మరి ముఖ్యమంత్రి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ