పోస్టింగ్‌ల కోసం ప్రభుత్వంపై ఐఏఎస్‌ల ఒత్తిడి...!?
గత ‘జగన్’ ప్రభుత్వంలో ‘జగన్’ ఆడమన్నట్లు ఆడిన కొందరు ఐఏఎస్ అధికారులను ‘కూటమి ప్రభుత్వం’ అధికారంలోకి వచ్చిన తరువాత పక్కన పెట్టింది. వచ్చిన వెంటనే కొందరు సీనియర్ ఐఏఎస్‌లను వెయింటింగ్‌లో ఉంచింది. దాదాపు 8 మంది ఐఏఎస్ అధికారులు పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా ఉన్నవారిలో సీనియర్ ఐఏఎస్ ‘శ్రీలక్ష్మి’ కూడా ఉన్నారు. ఆమెతో పాటు ‘రావత్’, మురళీధర్‌రెడ్డి, ముత్యాలరాజు, మాధవీలత, నీలకంఠారెడ్డి, గౌతమి, దినేష్‌కుమార్‌లు ఉన్నారు. వీరిలో ‘దినేష్‌కుమార్’ ఇటీవల ‘ఫైబర్‌నెట్’ వ్యవహారంలో ఆ సంస్థ ఛైర్మన్ అయిన ‘జీవీరెడ్డి’తో లడాయి పెట్టుకుని వెయిటింగ్‌లోకి వెళ్లారు. కాగా ‘గౌతమి’ పనితీరుపై వివిధ వర్గాల ద్వారా ఆరోపణలు రావడంతో..ఆమెను ఇటీవలే వెయిటింగ్‌లో పెట్టారు. మిగతా..ఆరుగురు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వెయిటింగ్‌లోనే ఉన్నాఉ. కాగా...వీరిలో ‘శ్రీలక్ష్మి, రావత్, మురళీధర్‌రెడ్డి, ముత్యాలరాజు, మాధవీలతలు ‘జగన్’కు తొత్తులుగా వ్యవహరించారనే పేరుంది. వీరిలో కొందరు ‘జగన్’ అవినీతికి, అక్రమాలకు వంతపాడారని, ఆయన ఆడమన్నట్లు ఆడారని భావన కూటమి ప్రభుత్వంలో ఉంది. అందుకే ‘కూటమి ప్రభుత్వం’ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినా..వారికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కన పెట్టింది. అయితే వీరిలో కొందరు తమకు పోస్టింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలపై రకరకాలుగా ఒత్తిడి తెస్తున్నారు. కొందరు కులాలను అడ్డంపెట్టుకుని పోస్టింగ్‌లు అడుగుతుండగా, మరి కొందరు తమకు అనుకూలమైన రాజకీయనాయకుల ద్వారా తమ ప్రయత్నాలను తాము చేసుకుంటున్నారు.
ఇలా చేసుకుంటున్నవారు ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’ను ఆయన తనయుడు ‘లోకేష్’ను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఓ సీనియర్ ఐఏఎస్ నేరుగా ‘లోకేష్’ను కలిసి తనకు పోస్టింగ్ ఇవ్వాలని, ప్రభుత్వం ఏమి చెపితే..అది చేస్తానని ఆయనకు హామీ ఇచ్చారట. ‘జగన్’ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఈ ఐఏఎస్ తన కులాన్ని సాకుగా చూపించి..పోస్టింగ్ అడుగుతున్నట్లు తెలిసింది. మరోవైపు ‘కాపు’ నేతలను కలిసి మరో ఐఏఎస్ తనకు పోస్టింగ్ ఇప్పించాలని అర్థించినట్లు తెలుస్తోంది.పలువురు కాపు ఎమ్మెల్యేలతో..ఆ ఐఏఎస్ ‘చంద్రబాబు’, ‘లోకేష్’లపై ఒత్తిడి తెస్తున్నారట. అదే విధంగా..మరి కొందరు సొమ్ములు వెదజల్లడానికి సిద్ధంగా ఉన్నారట. దీంతో..త్వరలో ఒకరిద్దరికి త్వరలో పోస్టింగ్‌లు వస్తాయని ప్రచారం సాగుతోంది. అయితే..ఇప్పుడే పోస్టింగ్‌లు ఇస్తారా..? లేక కలెక్టర్ల సదస్సు ముగిసిన తరువాత పోస్టింగ్‌లు ఇస్తారా..? అనేది చూడాలి. కాగా ‘జగన్’ ప్రభుత్వంలో కొందరు ఐఏఎస్, ఐపిఎస్‌లకు ‘టిడిపి’ ముద్ర వేసి సంవత్సరాల తరబడి పోస్టింగ్‌లు ఇవ్వలేదని, ఇప్పుడు మాత్రం ఎందుకు ఇవ్వాలని ‘టిడిపి’ నేతలు కొందరు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో సీనియర్ ఐపిఎస్ అధికారి ‘ఏబీ వెంకటేశ్వరరావు’కు ఐదు సంవత్సరాల పాటు పోస్టింగ్ ఇవ్వలేదని, ఆయన న్యాయస్థానాల్లో హోరాహోరిగా పోరాడి సర్వీసును సాధించుకున్నారని, చివరకు కోర్టు ధిక్కరణ సమస్య రావడంతో ఆయన సర్వీసు ముగిసే చివరి రోజు పోస్టింగ్ ఇచ్చారని, ఇప్పుడు మాత్రం కొంపలు మునిగిపోయినట్లు పోస్టింగ్‌ల కోసం వారు ఒత్తిడి తెస్తున్నారని వారు విమర్శిస్తున్నారు. వీరంతా శుద్దపూసలేమీ కాదని, ‘జగన్’కోసం పనిచేసిన వారికి ఎందుకు పోస్టింగ్‌లు ఇవ్వాలని, వారంతా బాగానే వెనకేశారని, ఇప్పుడు వారిని తీసుకువచ్చి ప్రభుత్వంలో నింపితే..ప్రభుత్వ రహస్యాలను ‘జగన్’కు చేరవేస్తారనే అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద..కూటమి ప్రభుత్వంపై వివిధ వర్గాల ద్వారా వస్తోన్న ఒత్తిడితో వీరిలో కొందరికి పోస్టింగ్‌లు వస్తాయనే భావన వ్యాపించింది.