త్వరలో ‘అధికారవ్యవస్థ’ ప్రక్షాళన...!?
పలువురు ఐఏఎస్, ఐపిఎస్, హెచ్‌ఓడిలు బదిలీ...!
కసరత్తు చేస్తోన్న ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’
త్వరలో ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ అధికార వ్యవస్థను ప్రక్షాళన చేస్తారనే ప్రచారం సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరగబోయే అతి పెద్ద అధికార ప్రక్షాళన ఇదే కాబోతోంది. గత పది నెలలుగా కూటమి పాలనలో అధికారులపై పలు ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు ‘కూటమినేతల’కు సహకరించడం లేదని, ‘వైకాపా’ వారికే పనులు చేసి పెడుతున్నారనేది ప్రధాన విమర్శ. గత ప్రభుత్వ పాపాలకు వీరు ఇంకా కొమ్ము కాస్తున్నారని ‘కూటమి’ నేతలు విమర్శిస్తున్నారు. అలా కొమ్ముకాసే అధికారులను ముఖ్యమైన స్థానాల నుంచి తీసి వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ‘జగన్’ మనుషులుగా గుర్తింపు పొందిన వారు కీలక స్థానాల్లో ఉన్నారని, వారందరినీ బయటకు పంపాలని తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’పై ఒత్తిడి తెస్తున్నారు. ‘కూటమి ప్రభుత్వం’ గత పది నెలల్లో ఎన్నో మంచి పనులు చేసినా..సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా..ప్రభుత్వానికి మైలేజ్ రావడం లేదు. ముఖ్యంగా ‘టిడిపి’ కార్యకర్తల అసంతృప్తితో..ప్రభుత్వ పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికార వ్యవస్థతో పనులు చేయించుకోవాలని, ఎవరైనా..ఇంతేనని ‘చంద్రబాబు’ చెప్పినా..తమ్ముళ్లు మాత్రం ఒప్పుకోవడం లేదు.
సిఎంఓ అధికారులపై ఆరోపణలు...!
మరోవైపు కీలక స్థానాల్లో ఉన్న అధికారులపై అవినీతి ఆరోపణలు రావడం, ప్రభుత్వాన్ని సమర్థించే ఓ ప్రధాన పత్రికలో పరోక్షంగా ‘సిఎంఓ’ అధికారులపై అవినీతి ఆరోపణలు చేయడం ఇటీవల కాలంలో సంచలనం సృష్టించింది. ఏకంగా సిఎంఓకు చెందిన ముగ్గురుసీనియర్ అధికారుల భార్యలు తమ భర్తల అధికారాన్ని అడ్డుపెట్టుకుని హోటల్స్‌లో కౌంటర్లు ఓపెన్ చేశారని ఆరోపిస్తూ ఆ పత్రిక వార్తను ప్రచురిం చింది. ఇది అధికార వ్యవస్థలో పెను సంచలనం సృష్టించింది. అయితే దీనిపై ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’ ఎక్కడా స్పందించకున్నా ఆయన దీనిపై ఒక నిర్ధిష్టమైన ప్రణాళికతో ఉన్నారని ప్రచారం సాగుతోంది. అయితే..ఐదుగురు అధికారులపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉందా..? లేక కావాలనే వారిని భ్రష్టు పట్టించడానికి ఈ వార్తను ప్రచురించారా..? దీని వెనుక ఏమైనా శక్తులు ఉన్నాయా..? లేకపోతే..దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా..? అనే ప్రశ్నలు పలువురి నుంచి వస్తున్నాయి.
మరోవైపు కీలకమైన శాఖలకు అనుభవం లేని ఐఏఎస్‌లను నియమించారని, వారు..తమ అనుభవలేమితో..లేనిపోని తప్పులు చేసి ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారనే భావన ఉంది. దీనిలో చాలా వరకూ వాస్తవం ఉన్నా..అధికారుల కొరతతో జూనియర్లను నియమించాల్సి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. కాగా..అనువజ్ఞులైన తమను ఎందుకు కీలకపోస్టుల్లోకి తీసుకోవడం లేదని కొందరు కన్ఫర్డ్ ఐఏఎస్‌లు అంతరంగిక సమావేశాల్లో ప్రశ్నిస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించాలని వారు భావిస్తున్నారు. అయితే..వీరికి అనుభవం ఉందని, కింది స్థాయి నుంచి పనిచేసి..పైకి వచ్చారని, అయితే...వీరిలో కొందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, అటువంటి వారిని కీలకమైన స్థానాల్లో ఎలా నియమిస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి.కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత,కొందరు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు జగన్‌తో అంటకాగారనే ఆరోపణలతో వారికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కన పెట్టింది. అయితే..ఇప్పుడు వారంతా తమకు పోస్టింగ్‌లు ఇవ్వాలని వివిధరూపాల్లో ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే..వీరందరికీ ఇప్పుడు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చే పరిస్థితి లేదు. వీరిలో ఒకరిద్దరికి పోస్టింగ్‌లు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు..కీలకమైన స్థానాల్లో ఉత్తరాదికి చెందిన ఐఏఎస్‌లు ఉన్నారని, వారికి స్థానిక పరిస్థితులు తెలియవని, వారంతా ఒక మూసలో పనిచేసుకుంటూ వెళుతున్నారని, దీని వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయనే ప్రచారం ఉంది. ‘చంద్రబాబు’ కూడా వారిని ఎక్కువ ప్రోత్సహిస్తున్నారని, దాంతో..వారు ఎవరినీ లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటున్నారు.
కాగా కొంత మంది మంత్రులకు తమ శాఖాధిపతులతో విభేదాలు ఉన్నాయి. వారిని మార్చాలని కీలకమంత్రులు కోరుతున్నారు. అయితే..వారి మాటను ఎవరూ పట్టించుకోలేదని ప్రచారం సాగుతోంది. అయితే..ఇప్పుడు అధికార వ్యవస్థలో ప్రక్షాళనలో భాగంగా వారిని మారుస్తారని తెలుస్తోంది. కాగా..ఈ నెల 25,26వ తేదీల్లో కలెక్టర్ల సదస్సు జరగబోతోందని, దాని తరువాత అధికార వ్యవస్థను ప్రక్షాళన చేస్తారంటున్నారు. నెలాఖరు లోపు..అధికార వ్యవస్థను ప్రక్షాళన చేస్తారని, అదే సమయంలో డిప్యూటీ సిఎం ‘పవన్ కళ్యాణ్’ సోదరుడు ‘నాగబాబు’ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని చెబుతున్నారు. ‘నాగబాబు’కు మంత్రి పదవి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యేల కోటాలో ‘నాగబాబు’ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. దీంతో..ఆయన కోసం మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నారు. అదీ ఈ నెలాఖరులోనే ఉంటుంది. ఈరోజు ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’, ఉప ముఖ్యమంత్రి ‘పవన్‌కళ్యాణ్’లు ఢల్లీి వెళ్లారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని ‘మోడీ’ని రాజధాని ‘అమరావతి’ పున:నిర్మాణానికి శంఖుస్థాపన చేయడానికి ఆహ్వానిస్తారు. ఇప్పటికే ‘చంద్రబాబు’, ‘పవన్’లు ‘నాగబాబు’కు కేటాయించే మంత్రి పదవిపై ఒక అవగాహనకు వచ్చారంటున్నారు. మొత్తం మీద..ఈ నెలాఖరులోగా అధికార వ్యవస్థ ప్రక్షాళనతో పాటు, ‘నాగబాబు’కు మంత్రి పదవిని కూడా కేటాయించి,‘చంద్రబాబు’, ‘పవన్’లు పాలనపై పూర్తి దృష్టి పెట్టబోతున్నారంటున్నారు.