లేటెస్ట్

‘జగన్‌’ వంచ‌న‌కు బ‌లైన ‘మర్రి’..!?

మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ‘మర్రి రాజశేఖర్‌’ వైకాపాకు రాజీనామా చేశారు. ఆయన గత కొన్నాళ్లుగా రాజీనామా ఆలోచనలో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. స్వర్గీయ ‘సోమేపల్లి సాంబయ్య’ రాజకీయ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ‘మర్రి రాజశేఖర్‌’ తన మామ బాటలోనే పయనించారు. అనాదిగా కాంగ్రెస్‌ మద్దతుదారైన ‘సోమేపల్లి’ బాటలోనే ఆయన కూడా కాంగ్రెస్‌ వెంటే నడిచారు. ఆయన మామ అయిన ‘సోమేపల్లి’ ‘చిలకలూరిపేట’ నుంచి మూడుసార్లు గెలుపొందారు. 1978,1985,1994ల్లో ఆయన కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసి గెలిచారు. ‘కమ్మ’ సామాజికవర్గానికి గట్టిపట్టున్న ఈ నియోజకవర్గంలో ‘కాంగ్రెస్‌’ తరుపున అన్నిసార్లు ‘సోమేపల్లి’ గెలుపొందడం నిజంగా విశేషమే. అంతే కాకుండా ‘తెలుగుదేశం’ పార్టీ ప్రభంజనం సృష్టించిన 1985, 1994 ఎన్నికల్లో కూడా ‘సోమేపల్లి’ ఆ పార్టీ గాలిని తట్టుకుని నిలబడ్డారు. అటువంటి ప్రజామద్దతు ఉన్న నేత వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ‘మర్రి రాజశేఖర్‌’ ఒకే ఒక్క సారి, అదీ ఇండిపెండెంట్‌గా  గెలుపొందారు. మొత్తం మూడుసార్లు పోటీ చేసిన ‘మర్రి’ రెండుసార్లు ఓడి, ఒకసారి గెలుపొందారు. అయితే..2019 ఎన్నికలకు ముందు ‘జగన్‌’ ఆడిన నాటకంలో ఆయన బలయ్యారు. ఆయన నమ్మకద్రోహంతో ‘మర్రి’ రాజకీయ భవిష్యత్తు అంథకారంలో పడిరది. 2014లో జరిగిన ఎన్నికల్లో ‘మర్రి’ ఓడిపోయినా..నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉంటూ..ప్రజల్లో మంచి మైలేజ్‌ తెచ్చుకున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా..ఆయనదే గెలుపు అనే పరిస్థితి ఉంది. అయితే..టిడిపిలో ఉండి..ఆ పార్టీ మొక్కగా చెప్పుకున్న ‘విడుదల రజనీ’ దగ్గర సొమ్ములు తీసుకుని ‘మర్రి’కి టిక్కెట్‌ను ‘జగన్‌’ నిరాకరించారనే ప్రచారం ఉంది. ‘మర్రి’ వద్ద సొమ్ములు లేవనే ఒకే ఒక్క కారణంతో..ఆయనకు టిక్కెట్‌ ఇవ్వకుండా ‘రజనీ’కి టిక్కెట్‌ ఇచ్చారు ‘జగన్‌’..ఆ ఎన్నికల్లో ‘మర్రి’ ‘రజనీ’కి వ్యతిరేకంగా పనిచేస్తారేమోనన్న భయంతో..పార్టీ గెలిచినవెంటనే ‘ఎమ్మెల్సీ’ని చేస్తానని, తరువాత ‘మంత్రి పదవి’ కూడా ఇస్తానని ‘జగన్‌’ ‘మర్రి’కి బహిరంగ సభలో వాగ్ధానం చేశారు. అయితే..ఆయన ఆ వాగ్ధానాన్ని నిలబెట్టుకోలేదు. ఆయన పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.


ఇచ్చిన మాట ప్రకారం ‘మర్రి’కి న్యాయం చేయాల్సిన ‘జగన్‌’ ఆయనకు కనీసం ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేదు. పలుసార్లు ఎమ్మెల్సీల ఖాళీలు ఏర్పడినా..ఆయనకు ఇచ్చేందుకు ‘జగన్‌’ ఇష్టపడలేదు. అయితే.. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నప్పుడు ‘కమ్మ’ సామాజికవర్గ ఓట్లు పొందేందుకు ‘మర్రి’కి ఎమ్మెల్సీ ఇచ్చారు. మాట తప్పనని, మడమ తిప్పనని చెప్పే ‘జగన్‌’ ‘మర్రి’ని నమ్మించి మోసం చేయడం ఏమిటి..? ‘కమ్మ’ సామాజికవర్గానికి చెందిన ‘కొడాలి’ని మంత్రివర్గం నుంచి తప్పించిన తరువాత అయినా..‘మర్రి’కి ఎమ్మెల్సీ ఇచ్చి..ఆయనను మంత్రిని చేయాల్సింది. కానీ..‘జగన్‌’ అదేమీ చేయలేదు. రాష్ట్రంలో రాజకీయంగా ప్రభావంతమైన ‘కమ్మ’ కులానికి మంత్రి పదవి లేకుండా మూడేళ్లు గడిపేశారు. ఇంతటితో..‘జగన్‌’ మోసాలు ఆగలేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయం పాలయిన తరువాత కూడా ‘మర్రి’పై కుట్రలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఎన్నికల తరువాత ‘చిలకలూరిపేట’ ఇన్‌ఛార్జిగా ‘మర్రి’ని నియమించలేదు.గత ఎన్నికల్లో ‘గుంటూరు`2’లో పోటీ చేసి ఓడిపోయిన ‘రజనీ’ని మళ్లీ అక్కడ ఇన్‌ఛార్జిగా నియమించారు. దీంతో..‘మర్రి’ ఇక ఆపార్టీలో ఉంటే తనకు న్యాయం జరగదని భావించి రాజీనామా చేసినట్లున్నారు. మొత్తం మీద..‘జగన్‌’ను నమ్ముకుంటే..నట్టేట ముంచేస్తాడని ‘మర్రి’ ఉదంతంతో తేలిపోయింది. ‘ఇచ్చిన మాట తప్పడు..‘మాటకోసం’ ‘సోనియా’నే ఎదిరించిన ధీరుడంటూ..సోషల్‌ మీడియాలో జాకీలేసే వైకాపా అభిమానులు..‘మర్రి’ విషయంలో ‘జగన్‌’ చేసిన అన్యాయంపై నోరెత్తడం లేదు. ఏది ఏమైనా..‘జగన్‌’ మాటను గుడ్డిగా నమ్మిన ‘మర్రి’ తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ