‘దొంగల్లా సంతకాలు’-‘బడ్జెట్’ సమావేశాల్లో ఇదే హైలెట్...!?
దాదాపు నెలరోజుల పాటు జరిగిన రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు తొలి రోజు నుంచి ఆఖరి రోజు వరకూ ఆసక్తిని రేకెత్తించాయి. మొదట్లో ఉత్కంఠతలో ప్రారంభం కాగా..మధ్యలో అనాసక్తిగా, చివరి రోజుల్లో క్రీడలు, స్కిట్లతో, గిఫ్ట్‌లతో ఆహ్లాదకరంగా, ఆనందంగా, ఎనలేని సంతోషాలతో ముగిసాయి. చాలా సంవత్సరాల తరువాత అసెంబ్లీ సమావేశాలు ఇంత ఆసక్తిగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా జరిగాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ఇదే విధంగా జరిగేవి. అయితే అప్పట్లో ప్రధాన ప్రతిపక్షం సభకు హాజరైయి తమ గళాన్ని గట్టిగా వినిపించేది. అయితే..ఇప్పుడు మాత్రం ప్రధాన పార్టీగా ఉన్న ‘వైకాపా’ గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే హాజరయి తరువాత..ఎగగొట్టింది. సభలో ప్రధాన పార్టీ అయిన ‘వైకాపా’ లేకపోయినా..‘కూటమి పార్టీలు’ ప్రజా సమస్యలపై ఎకరువు పెట్టారు. కొన్నిసార్లు కూటమి సభ్యులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. మంత్రులను పలు ప్రశ్నలు వేసి..వారి నుంచి సమాధానాలను రాబట్టారు.
దొంగల్లా సంతకాలు...!
అయితే..తొలుత ఉత్కంఠతగా ఉభయసభలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగ సమయంలో సభకు హాజరైన ‘జగన్’ బృందం కేవలం 11 నిమిషాలు మాత్రమే సభలో ఉండి..గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడి..వెంటనే సభ నుంచి వెళ్లిపోయారు. వారు సభకు అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకే హాజరయ్యారనే విమర్శలు వచ్చాయి. వరుసగా 60రోజుల పాటు సమావేశాలకు హాజరు కాకపోతే..వారి సభ్యత్వాలు రద్దు అవుతాయని స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వైకాపా సభ్యులను హెచ్చరించారు. దీంతో..తమ సభ్యత్వాలు పోతాయోమోననే భయంతో ‘జగన్’తో పాటు ఇతర ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. ఆ తరువాత వారు సమావేశాలకు రాలేదని అందరూ అనుకున్నారు. కానీ..ఇక్కడే ట్విస్ట్ ఉంది. 11మంది వైకాపా సభ్యుల్లో 7గురు అసెంబ్లీకి వచ్చి ‘దొంగల్లా’ రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్లిపోయారట. ఈ విషయాన్ని సాక్షాత్తూ స్పీకర్ ‘అయ్యన్నపాత్రుడే’ వెల్లడిరచారు. ఇలా దొంగల్లా సభకు రావడం ఏమిటి..? మీరు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు..మీరు సభకు హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావించవచ్చుకదా..అంటూ ఆయన వారికి చివాట్లు పెట్టారు. ఈ సమావేశాల్లో ఇతర విషయాలకన్నా ఇదే బాగా హైలెట్ అయింది. మూడు లక్షల కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినా..ఎస్సీ వర్గీకరణపై చట్టం చేసినా..చివరకు ‘జగన్’ అసెంబ్లీకి వచ్చి వెళ్లినా...ఏదీ ప్రజలను అంతగా ఆకట్టు కోలేదు. వైకాపాకు చెందిన వారు దొంగచాటుగా అసెంబ్లీకి వచ్చి..దొంగల్లా సంతకాలు చేసిపోయారనేదే ఈ సమావేశాల్లో హైలెట్‌గా చెప్పుకోవచ్చు. ‘వైకాపా’ ఎమ్మెల్యేల కపట నాటకాన్ని స్పీకర్ వెంటనే ప్రకటించకుండా...వ్యూహాత్మకంగా ఆఖరి రోజు వెల్లడిరచారు. దీంతో..వైకాపా పరువు గంగలో కలిసిపోయింది. వీరికి ప్రజా సమస్యల కన్నా తమ సభ్యత్వాలు పోకుండా చూసుకోవడమే ముఖ్యమని తేలిపోయింది.
‘మండలి’లో నిలదీసిన ‘బొత్స’...!
కాగా..అసెంబ్లీకి హాజరు కామని చెప్పిన వైకాపా శాసనమండలికి మాత్రం ఠంచన్‌గా హాజరైంది. హాజరవడమే కాదు..ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసింది. ముఖ్యంగా సీనియర్ నేత ‘బొత్స సత్యనారాయణ’ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పలు సమస్యలపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం ఎదురుదాడి చేసినా..ఆయన చలించకుండా..తాను చెప్పాల్సింది చెప్పేశారు. అయితే..విద్యాశాఖ మంత్రి ‘నారా లోకేష్’ ఆయన దుమ్ము దులిపేశారు. ‘బొత్స’ నిర్వాకాలను ఎండగట్టారు. అప్పట్లో రాజధాని ‘అమరావతి’ని స్మశానం అన్న ‘బొత్స’ ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నామని, అప్పట్లో అలా చెప్పామని, ఇప్పుడు ‘అమరావతి’పై మళ్లీ పార్టీలో ఆలోచన చేస్తామని అనడం..వైకాపా ద్వందనీతి అంటూ సోషల్ మీడియా ఎద్దేవా చేసింది. కాగా..ఈ సమావేశాల సందర్భంగానే వైకాపాకు చెందిన మరో ఎమ్మెల్సీ ‘మర్రి రాజశేఖర్’ రాజీనామా చేశారు. ఇప్పటికే..నలుగురు వైకాపా ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా..ఇప్పుడు వారికి ‘మర్రి’ కలిశారు. మరో ఎనిమిది మంది వరకూ లైన్‌లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది.
విరగబడి నవ్విన ‘చంద్రబాబు’ ‘పవన్’లు...!
ఈ అసెంబ్లీ సమావేశాల్లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే..ఎప్పుడూ గంభీరంగా ఉండే ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ ఎమ్మెల్యేలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా విరగబడి నవ్వారు. ఆయనతోపాటు ఉపముఖ్యమంత్రి ‘పవన్ కళ్యాణ్’ ఎమ్మెల్యేలు ప్రదర్శించిన స్కిట్‌లకు పడిపడి నవ్వారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ‘విజయ్‌కుమార్’, ‘ఈశ్వరరావు’లు చేసిన ‘స్కిట్’కు ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్‌లు ఒకటే నవ్వుకున్నారు. మరోవైపు ఉపసభాపతి ‘రఘురామకృష్ణంరాజు’ దానవీరశూర్ణకర్ణలోని ‘ఎన్టీఆర్’ డైలాగ్ చెప్పి వారిద్దరితో పాటు, ఇతర సభ్యులను ఆకట్టుకున్నారు. ప్రభుత్వ చీప్‌విప్ ‘జి.వి.ఆంజనేయులు’ మాచర్ల ఎమ్మెల్యే ‘జూలకంటి బ్రహ్మారెడ్డి’ చేసిన ‘స్కిట్’ కూడా ఆకట్టుకుంది. ఇతర ఎమ్మెల్యేలుకూడా తమ నటనాచాతుర్యాన్ని ప్రదర్శించారు. అదే విధంగా క్రీడా పోటీలు కూడా ప్రజలను ఆకట్టుకున్నాయి. ప్రజాప్రతినిధులైనా..పోటీతత్వంతో వ్యవహరించి చూపరులను ఆకర్షించారు. గతంలో ఉన్న గ్రూప్ పోటోను మళ్లీ పునరుద్ధరించి..ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నారు.మొత్తం మీద..ఈ బడ్జెట్ సమావేశాలు అనుకున్నదాని కన్నా బాగానే జరిగాయి. గత సాంప్రదాయాలను పునరుద్ధరించడంతో పాటు..వివిధ అంశాల్లో సభ్యులు వ్యవహరించిన తీరు..అందరినీ ఆకట్టుకుంది. కాగా..ప్రజాప్రతినిధులందరికీ ఐపాడ్‌లు బహుకరించడంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రం దివాలా అంచున ఉందని ఒకపక్కన చెబుతూనే మరో పక్క ఖరీదైన ఐపాడ్‌లు బహుకరించడం ఏమిటనే ప్రశ్న పలువురు విమర్శకుల నుంచి వచ్చింది. కాగా..సభకు హాజరు కాని వైకాపా ఎమ్మెల్యేలు ఈ ఐపాడ్‌లు తీసుకుంటారా...? లేదా..? అనేది ఆసక్తికరం. వాస్తవానికి వారు దొంగచాటుగా అసెంబ్లీకి వచ్చి సంతకాలు చేసినా..వారు..సభకు హాజరైనట్లే...సభకు వచ్చారు కనుక వారికీ ఐపాడ్‌లు ఇస్తారేమోచూడాలి.