లేటెస్ట్

‘పి4’తో పేదరికం పోతుందా...!?

రాష్ట్రంలో చాలా రోజుల నుంచి ‘పి4’పై ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ ఎక్కడకు వెళ్లినా దీని గురించే ప్రస్తావిస్తున్నారు. దీంతో చాలా మందికి దీనిపై ఆసక్తి నెలకొంది. కొద్దిగా ఆసక్తి ఉన్న వారు..దీనిపై ఒకొరినొకరు ప్రశ్నలు వేసుకుంటున్నారు. అసలు ఏమిటీ ‘పి4’ అని..అయితే..దీనికి ఈరోజు ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’ వివరంగా సమాధానం చెప్పారు. ‘పి4’ అంటే ‘పబ్లిక్‌’, ప్రవేట్‌, పీపుల్‌,ప్రావర్టీ. ఈ నాలుగు పదాల కలయికతో ఒక కొత్త పథకం మొదలవబోతోంది. ప్రభుత్వ, ప్రవేట్‌ సంస్థలు, వ్యక్తులతో కలసి పేదరికంలో ఉన్న ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడం కోసం చేసే యత్నమే ‘పి4’. దీని ద్వారా రాష్ట్రంలో పేదరికంలో మగ్గుతున్న దాదాపు 35 లక్షల మందిని పేదరికం నుంచి బయటకు తేవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. సమాజంలో ఆర్థికంగా ఎదిగిన వారు, విదేశాల్లో ఉన్న వారి సహకారంతో రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. ‘ఉగాది’ రోజు ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’, ఉపముఖ్యమంత్రి ‘పవన్‌ కళ్యాణ్‌’, ఇతర మంత్రులతో కలసి ఈ పథకం వివరాలను వెల్లడిరచారు. అయితే..ఈ పథకాన్ని ఎలా అమలు చేయబోతున్నారో..ముఖ్యమంత్రి తరువాత వెల్లడిస్తానని సభాసాక్షిగా చెప్పారు. అయితే..ప్రస్తుతం వెల్లడైన వివరాల ప్రకారం పేదరికంలో ఉన్నవారిని ప్రభుత్వం, ప్రవేట్‌ వ్యక్తులు ఆదుకుని..వారిని పేదరికం నుంచి బయటకు తేవడమే లక్ష్యం. అయితే..ఈ పథకం అమలులో ఎవరినీ బలవంతం చేయరు. సమాజంలో ఆర్థికంగా బలోపేతం అయిన వారు..వారంత వారే స్వచ్ఛందంగా వచ్చి సహాయం చేయడం. 

ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ ఈ పథకంతో 2047 నాటికి రాష్ట్రంలో పేదలే లేకుండా చేస్తామని చెబుతున్నారు. అయతే..ఆయన ఆలోచనలు ఉన్నతమైనవే. అయితే ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందో తెలియదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ప్రతి ప్రభుత్వం తమ లక్ష్యం పేదరికం రూపు మాపటమే..లక్ష్యమని చెబుతూ వస్తున్నాయి. దేశాన్ని సుధీర్ఘంగా పాలించిన ‘కాంగ్రెస్‌’, ఇటీవల కాలంలో వరుసగా అధికారంలో ఉంటోన్న ‘బిజెపి’ , గతంలో అధికారంలో ఉన్న ‘జనతాదళ్‌’ పార్టీలు..ఇవన్నీ పేదలను ఉద్దరిస్తామనే చెప్పాయి. కానీ ఆచరణలో మాత్రం విఫలం అయ్యాయి. దేశంలో ఇప్పటికీ తినడానికి తిండిలేని వారు ఎందరో..? రెక్కాడితేకానీ..డొక్కాడని వారు..ఎందరో...? ఒకపూట తింటే..రెండోపూట ఏమిటో..అనే వారు ఎందరో..? ప్రభుత్వం ఇచ్చే బియ్యం, గోధుమల కోసం ఇప్పటికీ క్యూలు కట్టేవారెందరో..? దేశంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా..ఎంత మంది గొప్ప నాయకులు ప్రధానులు అయినా..పేదల బతుకుల్లో మార్పురాలేదన్నది పచ్చి నిజం. ఉన్నవాడు..మరింత ఉన్నవాడుగా మారిపోతుంటే..పేదవాడు..మరింతగా పేదరికంలో కూరుకుపోతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పేదరికం రూపుమాలనే ముఖ్యమంత్రి లక్ష్యం ఉన్నతమైనదే. అయితే..ఆచరణలో అది సాధ్యం అవుతుందా..? అనే ప్రశ్న పలువర్గాల నుంచి వస్తోంది. ఉన్నవాడు..మరింతగా పేదవాడ్ని దోచుకుంటున్నాడే కానీ..పేదరికాన్ని రూపుమాలని చూడడం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి చెబుతోన్న ‘పి4’ ప్రకారం ప్రభుత్వం తన వంతుగా..సంక్షేమపథకాలను ప్రకటించి.. వారికి అందిస్తుంది. లేదా వారి ఎకౌంట్లలో మరిన్ని సొమ్ములు వేస్తుంది. లేదా..మరింతగా బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు అందిస్తుంది. అంతే కానీ..నిర్ధిష్టంగా పేదరికాన్ని రూపుమాపే చర్యలు ఏమీ తీసుకోదు. అదేవిధంగా ప్రవేట్‌ సంస్థలు తమ లాభాలను వదులుకుని వారు పేదవారికేమీ సహాయం చేయరు. ఒకప్పుడు వందలకోట్ల వ్యాపారాలు చేసే వ్యాపారస్తులు ఇప్పుడు లక్షల కోట్లకు ఎలా ఎగబాకాలో ఆలోచిస్తారే కానీ..వారు..పేదల కోసం ఎందుకు ఆలోచిస్తారు. ఒకవేళ వాళ్లు వారి కోసం ఆలోచించారంటే..దాని వెనుక వారి వ్యాపార ప్రయోజనాలు తప్పక ఉంటాయి. వారి వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయంటే..అవి తప్పకుండా పేదలకు హాని చేసేవే. వారిని మరింతగా పేదరికంలోకి నెట్టేవే. ఈ ప్రవేట్‌ సంస్థలు కార్పొరేట్‌ రెస్పానిబులిటీ కింద కొన్ని నిధులను కేటాయిస్తున్నాయి. అయితే..ఇప్పుడు అవి తాము పేదలకు భారీగా నిధులు కేటాయిస్తున్నాం కాబట్టి తమకు ప్రభుత్వం నుంచి మరిన్ని మేళ్లు చేయాలని, నిధులు కేటాయించాలని, సబ్సీడీలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తాయి. దీని ద్వారా మళ్లీ పేదలకే నష్టం. తమ లాభాలను తగ్గించుకుని ఇవి పేదలకు మేలు చేసే అవకాశమే లేదు. అయితే..కొందరు ప్రవేట్‌ వ్యక్తులు, విదేశాల్లో ఉన్నవారు, దేశంలో మంచి మనస్సు ఉన్నవారు..ఈ పథకం కింద కొంత సొమ్ములను ఖర్చు చేయవచ్చు. మొత్తం మీద చూస్తే..ముఖ్యమంత్రి ఆలోచనలు ఉన్నతంగా ఉన్నా..అమలులో అవి ఎంత వరకు ఫలితాలను ఇస్తాయో చూడాలి. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ