లేటెస్ట్

‘మెగా కృష్ణారెడ్డి’ ‘కృష్ణ’ ఎలా అయ్యారు...!?

‘మెగా కృష్ణారెడ్డి’ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరేమో..! తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..యావత్‌దేశంలో వ్యాపార, అధికార, ఇతర రంగాల్లో ఆయన పేరు మారుమోగిపోతోంది. ‘మెగా కృష్ణారెడ్డి’గా ఆయన అందరికీ చిరపరిచుతుడు. అయితే..నిన్న ‘అమరావతి’లో జరిగిన ‘పి4’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తన పేరును ‘కృష్ణ’గా పేర్కొన్నారు. అదేమిటి..ఆయన ‘మెగా కృష్ణారెడ్డి’ కదా...ఇప్పుడు ఈయనేమిటి..‘కృష్ణ’ అని చెప్పుకుంటున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ ఆయనను ‘మెగా కృష్ణారెడ్డి’గా సంభోదిస్తుంటే..ఈయన మాత్రం తనను తాను పరిచయం చేసుకుంటూ ‘కృష్ణ’ అంటున్నారని అక్కడ ఉన్నవారితోపాటు, టీవీల్లో చూస్తున్నవారు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆయన సమాజంలో తనకు ఉన్న పేరును చెప్పడానికి ఇష్టపడలేదు...? ఒకవేళ ఆయనను ఆయన కుటుంబసభ్యులు, ఆయన సంస్థల్లో పనిచేసే వారు ‘కృష్ణ’ అని పిలుస్తారేమో తెలియదు కానీ..ఆయన అందరికీ తెలిసిన పేరు చెప్పకపోవడం వెనుక ఏదైనా..విషయం ఉందా..? అనే అనుమానాలు చాలా మందిలో వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి ‘మెగా కృష్ణారెడ్డి’ అంటే..దానిలో ‘మెగా’ అనేది ఆయన సంస్థ పేరు కాగా..‘కృష్ణారెడ్డి’ అనేది ఆయన పేరు. వాణిజ్య, అధికారవర్గాల్లో ‘మెగా కృష్ణారెడ్డి’ అంటే తెలుస్తుంది. కానీ..నిన్న ‘కృష్ణ’ అని ఆయన చెప్పుకోవడం ఎందుకో విడ్డూరంగా అనిపించింది. తన పేరు ఎవరికీ తెలియకుండా ఉండేందుకా..? లేక గతంలో..‘వైకాపా’తో కలిసి తిరిగింది..పలు ప్రాజెక్టులు పొందింది ఈయనే..అనే సంగతి అందరికీ తెలుస్తుందన్న సందిగ్దమా..? ఏమో..? లేక తెలంగాణలో ‘కెసిఆర్‌’తో కలిసి నిర్మించిన ‘కాళేశ్వరంప్రాజెక్టు’ కథల గురించి తెలుస్తుందన్న భయమా..? లేక ‘టిడిపి’ కార్యకర్తలు, నాయకులు ఆయనపై విమర్శలు చేస్తారన్న అనుమానామా..? ఏమో తెలియదు కానీ..ఆయన గురించి ఆయన పరిచయం మాత్రం ఆసక్తి కల్గించేదే. పేదలకు సహాయం చేస్తానని ఆయన ప్రకటించడం స్వాగతించవలసిన విషయమే. తనలాగా..మిగతా వారు ఎదగాలని ఆయన కోరుకున్నారు. 

కానీ..ఆయన ఎదుగుదల ఎలా జరిగింది..? ఆయన ఎదుగుదలలో....ఎవరెరు కీలకపాత్ర పోషించారు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి లక్షల కోట్ల ఆస్తి ఎలా సంపాదించగలిగారు..? అధికారంలో ఎవరు ఉన్నా..వాళ్లను  ఎలా బుట్టలో వేయగలుగుతున్నారు..? ఆయన ఎదిగిన క్రమాన్ని ‘పి4’లో పేదలకు తెలియజేస్తే..వాళ్లూ ఆయనను అనుసరిస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బద్దశత్రువులైన ‘చంద్రబాబు’, ‘జగన్‌’లను, ‘కెసిఆర్‌’, ‘చంద్రబాబు’లను ఎలా తన జేబులో పెట్టుకోగలిగారు..? ఇవన్నీ ఆసక్తిని రేకెత్తించేవే..! ఒకప్పుడు చిన్నచిన్న ప్రాజెక్టులను చేసే ‘కృష్ణ’ అదే ‘మెగా కృష్ణారెడ్డి’గా ఎలా ఎదిగారు...? ‘పట్టిసీమ’ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, తాము అధికారంలోకి వస్తే...అవినీతి అంతు చూస్తానని ‘జగన్‌’ గర్జిస్తే..అదే గర్జించిన పులిని ఈ ‘కృష్ణ’ ఎలా దారికి తెచ్చుకుని కొత్తగా ‘పోలవరం’ ప్రాజెక్టును సాధించారు..? అదే విధంగా...‘తెలంగాణ’లో ‘కాళేశ్వరం ప్రాజెక్టు’ పేరుతో లక్షల కోట్లు ఎలా అర్జించారు..అదే సమయంలో..అక్కడ ‘రేవంత్‌రెడ్డి’తో సంబంధాలు ఎలా కలుపుకున్నారు...? ఇలా ఒకటేమిటి..? సమస్తం..ఆసక్తికరమే...? పేదలను ఉద్దరించాలనకుంటున్న ‘చంద్రబాబు’ ప్రభుత్వం..ఈయన జీవితం గురించి అదే పేదలకు వివరించి, ఆయనకు సహాయం చేసినట్లే చేస్తే..వాళ్లు కూడా లక్షల కోట్లు కూడబెట్టుకుంటారు. అప్పుడు రాష్ట్రంలో ఎవరికీ ‘పి4’ అవసరమే ఉండదు. ఇదే విధానాన్ని దేశంలో..ఆ మాటకొస్తే ప్రపంచ మొత్తం అనుసరిస్తే..ప్రపంచంలో పేదలు, పేదరికం, ఆకలి, ఆకలిచావులే ఉండవు. దయగల ‘ఆంధ్రాప్రభుత్వాధినేతలు’ ఈ పనిచేస్తే చాలు.. సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరమే లేదు. ఆ తీరున వాళ్లు ఆలోచించాలని...రాష్ట్ర ప్రజలు సవినియంగా వేడుకుంటున్నారు. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ