లేటెస్ట్

‘పాస్టర్‌ ప్రవీణ్‌’ కేసు కొలిక్కి వచ్చినట్లేనా...!?

క్రైస్తవ మత ప్రబోధకుడు ‘ప్రవీణ్‌’ మృతి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. నాలుగు రోజుల కిందట ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారు. అయితే ఆయనను కొందరు వ్యక్తులు హత్య చేసి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని క్రైస్తవ పాస్టర్లు ఆరోపించారు. వారితో పాటు పలువురు రాజకీయనాయకులు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనను కావాలని హత్య చేశారని, ఒక పథకం ప్రకారం తుదముట్టించారని ఆరోపించడంతో పాటు రాజకీయాలకు అతీతంగా విచారించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో క్రైస్తవ మతస్థులకు రక్షణ లేదని, వారిపై దాడులు జరుగుతున్నాయని క్రైస్తవ సంఘాలతో పాటు, పలు రాజకీయపార్టీలు విమర్శలు గుప్పించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధతో విచారణను నిర్వహిస్తోంది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పాస్టర్‌ ‘ప్రవీణ్‌’ మృతిపై ఆందోళనను నెలకొనడంతో..ఐదుగురు డాక్టర్లతో, కెమెరాల మధ్యలో ఆయన భౌతికకాయానికి పోస్టుమార్టమ్‌ నిర్వహించారు. అయితే..ఇంకా పోస్టుమార్టమ్‌ రిపోర్టు రాలేదు. అయితే..ఈలోగానే చాలా మంది క్రైస్తవ మతానికి చెందిన పాస్టర్లు, రాజకీయనాయకులు ‘ప్రవీణ్‌’ది హత్యేనని, దీనికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. అంతే కాదు..‘ప్రవీణ్‌’ హిందూ మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు కనుక..ఆయనను డిప్యూటీ సిఎం ‘పవన్‌కళ్యాణ్‌’ మద్దతుతో అంతమొందించారని ఆరోపించారు. కొంత మంది పాస్టర్లు, అమలాపురానికి చెందిన మాజీ ఎంపి ‘హర్షకుమార్‌’ అయితే రెచ్చిపోయారు. ఆయన ఎందుకో..ఈ కేసును ఏదో రకంగా కూటమి ప్రభుత్వానికి పూయాలని చాలా తాపత్రయపడ్డారు. ఒకవైపు కేసు గురించి పోలీసులు విచారణ చేస్తుండగానే ఆయన దాన్ని హత్యగా తేల్చేశారు. ఆయనతో పాటు పాస్టర్లు అని చెప్పుకుంటున్న మరికొందరు కూడా ఇదే విధంగా రెచ్చిపోయి..క్రైస్తవుల్లో ఆందోళనలను పెంచడానికి తీవ్రంగా యత్నించారు.


వీరంతా ఒక పథకం ప్రకారం ఎవరో ఆడమన్నట్లు ఆడుతూ..కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే..వారెంత ఎగిరినా..వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో..ఇప్పుడు వారి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లైంది. ‘పాస్టర్‌ ప్రవీణ్‌’ హైదరాబాద్‌లో బయలు దేరిన దగ్గర నుంచి ఆయన ఎక్కెడెక్కడ ‘లిక్కర్‌’ కొన్నారు..‘విజయవాడ’లో ఎంత సేపు ఉన్నారు..ఆయన ప్రయాణించిన టూవీలర్‌కు లైట్‌ ఎందుకు లేదు...? ఇలా అనేక అంశాలపై పోలీసులు సీసీ కెమెరాల సాక్షిగా..నిజాలను వరుసగా బయటపెడుతోంది. దీంతో..నిన్నటి వరకూ ఒకటే ఆందోళన చెందిన వారంతా..ఇప్పుడు మూగనోము పట్టారు. ఈ కేసులో పోలీసులు నేడో రేపో పోస్ట్‌మార్టమ్‌ రిపోర్టును కూడా బయటపెట్టి..అసలేమి జరిగిందో వివరంగా చెప్పబోతున్నారు. దీంతో..ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినట్లువుతుంది. అయితే..‘ప్రవీణ్‌’ మరణంపై అవాస్తవాలను ప్రచారం చేసిన మాజీ ఎంపి ‘హర్షకుమార్‌’ మరి కొందరు పాస్టర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆయనది హత్యేనని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని రెచ్చగొట్టిన వీరిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తోంది. ఎవరో ఆడమనట్లు, సొమ్ముల కోసం ఈ వ్యవహారంలో కొందరు దిగజారి ప్రవర్తించారని, వారిపై చర్యలు తీసుకోవాలి ‘మహాసేన రాజేష్‌’ డిమాండ్‌ చేస్తున్నారు. పాస్టర్లకు చెడ్డపేరు తెచ్చేలా కొందరు వ్యవహరించారని, అయితే..‘ప్రవీణ్‌’ కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయంలో హుందాగా వ్యవహరించారని ఆయన అన్నారు. మొత్తం మీద పాస్టర్‌ ‘ప్రవీణ్‌’ మృతిపై నెలకొన్న గందరగోళానికి తెరపడనుంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ