రాజకీయ ‘లెజెండ్స్’...!?
ఇటీవల కాలంలో ‘ఆంధ్రప్రదేశ్’ ముఖ్యమంత్రి ‘నారా చంద్రబాబునాయుడు’, మాజీ ఉపరాష్ట్రపతి ‘ఎం.వెంకయ్యనాయుడు’ పలు సభల్లో కలిసి పాల్గొంటున్నారు. వాళ్లిద్దరూ పాల్గొన్న సభల్లో వారి అనుభవాలు, రాజకీయ చరిత్ర, అనుభవించిన పదవులు గురించి చెబుతుంటే రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి ఎనలేని ఆసక్తిని కల్గిస్తున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు దాకా..వీరిద్దరూ పెద్దగా కలిసి ఏ సభలోనూ పాల్గొనలేదు. అయితే రాష్ట్రంలో ‘కూటమి ప్రభుత్వం’ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం వీళ్లు తరుచూ కలుసుకుంటు న్నారు. దీంతో వీరి కలయిక, వీరి సమావేశాలపై, వారు చేసే వ్యాఖ్యలపై ఆసక్తి నెలకొంటుంది. పలు సభల్లో మాజీ రాష్ట్రపతి ‘వెంకయ్య నాయుడు’ ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’ను ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు, దానికి చంద్రబాబు స్పందించే తీరు చూసిన వాళ్లు వీరిద్దరూ అన్నదమ్ములా...? లేక స్నేహితులా అంటూ ఆరాలు తీస్తున్నారు. ఇప్పటి తరం వారికి వీరి గురించి పెద్దగా తెలియదు. అయితే..ఉమ్మడి రాష్ట్రంలో వీరిద్దరూ వేర్వేరు పార్టీల తరుపున ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం విశేషం. అయితే..వీరిలో ఒకరు ‘నెల్లూరు’ నుంచి మరొకరు ‘చిత్తూరు’ జిల్లా నుంచి రాజకీయప్రస్థానం ప్రారంభించారు. ‘వెంకయ్యనాయుడు’ ‘బిజెపి’ తరుపున రాజకీయాలు ప్రారంభించగా, ‘చంద్రబాబునాయుడు’ ‘ఇందిరాకాంగ్రెస్’ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. దాదాపు సమ వయస్కులైన వీరు 1978లో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఎటువంటి రాజకీయనేపథ్యం లేకుండా కేవలం రాజకీయాలపై ఆసక్తితో..రాజకీయాల్లోకి వచ్చి సుధీర్ఘకాలం రాజకీయాల్లో రాణించారు. వీరిలో ‘వెంకయ్యనాయుడు’ రాజకీయాల నుంచి రిటైర్ కాగా..‘చంద్రబాబు’ మాత్రం ఇంకా క్రియాశీలక రాజకీయాల్లోనే ఉన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి సుధీర్ఘరాజకీయ జీవితం ఎవరికీ లేదేమో. 1978లో ఇద్దరూ ఎమ్మెల్యేలుగా గెలిచినా..తరువాత రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ‘ఉదయగిరి’ నుంచి ‘వెంకయ్యనాయుడు’ వరుసగా రెండుసార్లు గెలుపొందారు. అయితే..ఆ తరువాత ఆయన ఏ ప్రత్యక్ష ఎన్నికల్లోనూ గెలుపొందలేదు. అయితే..రాజకీయంగా మాత్రం ఆయన కేంద్రస్థాయికి ఎగబాకారు. రెండుసార్లు ‘బిజెపి’ జాతీయఅధ్యక్షపదవిని నిర్వహించారు. తరువాత ‘వాజ్‌పేయి’, నరేంద్రమోడీ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. తరువాత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. స్వంత రాష్ట్రంలో రాజకీయ పునాది బలంగా లేకపోయినా..ఆయన ‘ఢల్లీి’ రాజకీయాల్లో తనవంతు పాత్ర పోషించారు. ఇలా..ఏ రాజకీయ నాయకుని జీవితంలో జరిగి ఉండదేమో...? పలుసార్లు వేర్వేరు రాష్ట్రాల నుంచి ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు. ఎటువంటి రాజకీయనేపథ్యం లేకుండా ‘వెంకయ్యనాయుడు’ తన వాగ్ధాటితో రాజకీయాల్లో తిరుగులేని స్థానానికి చేరారు. ఒకప్పుడు ‘బిజెపి’లోని అగ్రనాయకత్వంలో ఆయనకు నాలుగోస్థానం ఉండేది. అయితే..‘మోడీ’ కేంద్ర రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ‘వెంకయ్య’కు గడ్డురోజులు వచ్చాయి. చివరకు ఆయనను పొమ్మనకుండా పొగపెట్టి క్రియాశీలక రాజకీయాల నుంచి నిష్క్రమింపచేశారు. అప్పట్లో ఆయన దీని గురించి చాలా రోజులు మధనపడ్డారు. తనకు రాజకీయాలే పని అని, అవి లేకుండా తనకు రోజులు గడవవని పేర్కొన్నా...‘మోడీ’పట్టించుకోకుండా ఆయనను సాగనంపారు. అయితే..ఆయన ‘బిజెపి’లో ఉంటూ..‘టిడిపి’కి మేలు చేస్తున్నారని ఆయన ప్రత్యర్థులు పదే పదే ‘మోడీ’కి చాటీలు చెప్పడం..విభజిత రాష్ట్రానికి మేలు చేయాలని తన శాఖ పరిధిలోని నిధులను కేటాయించడంతో ‘మోడీ’ అనుమానాలు మరింత పెరిగి ఆయనను బలవంతంగా క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలిగేలా చేసింది. సుధీర్ఘ రాజకీయ జీవితంలో ‘వెంకయ్య’ ఎటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదంటే ఆయన నిజాయితీ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. రాజకీయాల నుంచి ఆయన వైదొలిగినా..తన స్వంత ట్రస్టుద్వారా ఆయన ప్రజలకు మేలు చేయడానికే ప్రయత్నిస్తున్నారు. తెలుగుభాష అంటే ఎంతో మమకారం ఉన్న ‘వెంకయ్యనాయుడు’ ఆ భాష అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు.
ఎక్కడో వెనుకబడిన ‘చిత్తూరు’ జిల్లా నుంచి ‘చంద్రబాబునాయుడు’ రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత ‘ఇందిరా కాంగ్రెస్’కు అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో అప్పట్లో చురుగ్గా ఉన్న ‘చంద్రబాబు’ ‘ఇందిరాగాంధీ’ దృష్టిని ఆకర్షించి ‘చంద్రగిరి’ సీటును తెచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో ‘ఇందిర’ ప్రభంజనం సృష్టించడంతో ఆయన కూడా గెలుపొందారు. గెలిచిన తొలిసారే..ఆయనకు మంత్రి పదవి కూడా దక్కడం..అప్పుడే సినీనటుడు ఎన్టీఆర్ తన కుమార్తెను ఆయనకు ఇచ్చి వివాహం చేయడంతో..ఆయన సుడి తిరిగిపోయింది. సుడితోపాటు కష్టపడేతత్వం ఆయనకు సుధీర్ఘ రాజకీయజీవితాన్ని ఇచ్చింది. 1983లో ‘ఎన్టీఆర్’ పార్టీని స్థాపించినా..‘చంద్రబాబు’ మాత్రం ‘కాంగ్రెస్’ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. అయితే..తరువాత తన మామ పార్టీలో చేరిపోయారు. ఇక అక్కడి నుంచి ఆయన వెనుతిరిగి చూడలేదు. 1983లో ‘నాదెండ్ల భాస్కర్‌రావు’ ఎన్టీఆర్‌ను దించిన వ్యవహారంలో ‘చంద్రబాబు’ క్రియాశీలకంగా వ్యవహరించారు. అప్పుడే ఆయనకు ‘వెంకయ్యనాయుడు’తో అనుబంధం పెరిగింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా..వారిద్దరి బంధానికి బీటలు వారలేదు. ‘వెంకయ్య’ ‘బిజెపి’లో ఉన్నా..‘బిజెపి’తో ‘చంద్రబాబు’ కయ్యం పెట్టుకున్నా..వారి మధ్య మాత్రం అగాధాలేమీ రాలేదు. అయితే..2019 ఎన్నికలకు ముందు ‘చంద్రబాబు’ ‘మోడీ’ని వ్యతిరేకించి బయటకు రావద్దని ‘వెంకయ్య’ ‘చంద్రబాబు’కు హితవు పలికారంటారు. తన మాట వినకే‘చంద్రబాబు’ కష్టాలు కొనితెచ్చుకు న్నారని ‘వెంకయ్య’ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారంటారు. ఇదెంత నిజమో తెలియదు. అయితే..‘మోడీ’తో తగవు ‘చంద్రబాబు’కు జీవితంలో ఎప్పుడూ చూడని దెబ్బను రుచిచూపించింది.
ఆ సంగతి ఎలా ఉన్నా...రాష్ట్రాభివృద్ధి కోసం ఈ ఇద్దరు నేతలు..ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత.. అనాధ అయిన ‘ఆంధ్రప్రదేశ్’ కోసం ఇరువురు పరితపించిపోయారు. రాష్ట్రానికి ప్రత్యేకప్యాకేజీ కావాలని ‘వెంకయ్యనాయుడు’ అప్పట్లో పార్లమెంట్‌లో పోరాడారు. ఆయన కృషి ఫలితంగానే రాష్ట్రానికి అప్పటి ‘కాంగ్రెస్ ప్రభుత్వం’ ప్యాకేజీని ప్రకటించింది. అయితే..తరువాత వచ్చిన ‘బిజెపి’ మాత్రం దానిని పక్కన పెట్టింది. అయితే..కేంద్రమంత్రిగా ‘వెంకయ్యనాయుడు’ రాష్ట్రాభివృద్ధికోసం తనశాఖ నుంచి నిధులను కేటాయించారు. ఒకవైపు ‘వెంకయ్య’ మరోవైపు ‘చంద్రబాబు’లు కలసి కేంద్రం నుంచి 2014`19మధ్య భారీగా నిధులను తెచ్చుకున్నారు. రాష్ట్రంపై ప్రేమతో..వారిద్దరూ అన్నదమ్ముల్లా అప్పట్లో కలసి కృషి చేశారు. అయితే..కాలక్రమంలో ‘వెంకయ్య’ బలవంతంగా రాజకీయాల నుంచి వైదొలగాల్సివచ్చింది. అయితే..ఇప్పటికీ ఈ ఇద్దరూ రాష్ట్రం కోసం తమకు చేతైనన పనులు చేస్తూనే ఉన్నారు. ఇటీవల ఒక సభలో ‘వెంకయ్యనాయుడు’ ‘చంద్రబాబు’ను ఉద్దేశించి మాట్లాడుతూ..ఆయన అంతా ఒకేసారి చేద్దామనుకుంటారు..అలా చేయలేక చేతులెత్తేసే పరిస్థితి వస్తుందని, అన్నీ ఒకేసారికాకుండా..ప్రాధాన్యతా క్రమంలో చేసుకోవాలని హితవు పలికారు. దీనిపై ‘చంద్రబాబు’ సానుకూలంగానే స్పందించారు. మొత్తం మీద..ఈ వెటరన్ నాయకులు..ఎప్పుడు కలిసినా..అక్కడ వారిద్దరి గురించి ఆసక్తికరమైన చర్చ సాగుతూనే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇద్దరిని రాజకీయ లెజెండ్స్‌గా చెప్పుకోవచ్చు. ఇక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఈ ఇద్దరు నేతలు రాజకీయాల్లో రాణించాలనే వారికి ఆదర్శనేతలవుతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.