10రోజుల్లో 10వేల ఉద్యోగాలు ఇవ్వవచ్చు..లోకేష్‌గారూ...!?
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. తాము అధికారంలోకి వస్తే..నిరుద్యోగులకు భారీగా ఉపాధి కల్పిస్తామని, రాష్ట్రానికి భారీగా పరిశ్రమలను తెస్తామని, తద్వారా..యువతకు భారీగా ఉపాధి కలుగుతుందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘టిడిపి’ అధినేత ‘నారాచంద్రబాబునాయుడు’ ఆయన తనయుడు ‘లోకేష్’లు ఒకటే ఊదరగొట్టారు. అప్పట్లో వారి మాటలను నిరుద్యోగ యువత బాగానే నమ్మారు. వారు చెప్పినంత కాకపోయినా..ఎన్నోకొన్ని ఉద్యోగాలు ఇస్తారని వారు ఆశపడ్డారు. అయితే..అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా.. ఇంత వరకూ ఎటువంటి ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం భర్తీ చేయలేదు. ఎన్నికల హామీ అయిన ‘మెగా డిఎస్సీ’ ఇంత వరకూ ముందుకు కదలలేదు..ఇదుగో..అదుగో అంటూ..కాలక్షేపం జరుగుతుందన్న అనుమానాలు నిరుద్యోగుల్లో వ్యక్తం అవుతున్నాయి. వీళ్లూ ‘జగన్’ వలే తమను మోసం చేస్తారా...? అంటూ వారు ఆరాలు తీస్తున్నారు. అయితే..నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’, ఆయన తనయుడు ‘లోకేష్’లు తీవ్రంగా యత్నిస్తున్నారు. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు తేవడానికి వారు బాగా కృషి చేస్తున్నారు. అయితే..వారి కృషి ఫలించి..ఉద్యోగాలు వచ్చే వరకు మరింత సమయం పడుతుంది. అందాకా నిరుద్యోగులు ఆగే అవకాశం లేదు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం కూడా భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశమే లేదు. అయితే..ఈ లోగా ప్రభుత్వ పరిధిలో వివిధ కార్పొరేషన్లలో ఉన్న దాదాపు 10వేల ఉద్యోగాలను భర్తీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రభుత్వ పెద్దలు దీనిపై దృష్టి పెట్టడం లేదు.
ఏడాది వృధా...!?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న వివిధ కార్పొరేషన్లలో ఉన్న అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేయలేదు. వివిధ స్థాయిల్లో దాదాపు 10వేలు ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ‘స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’లో 2వేల ఉద్యోగాలు, ఈ`ప్రగతిలో 1500 నుంచి 2000 వేల ఉద్యోగాలు, డిజిటల్ కార్పొరేషన్‌లో 2వేల ఉద్యోగాలు, ఏపీ ఫైబర్ నెట్‌లో 3వేల ఉద్యోగాలు 1100 కాల్ సెంటర్‌లో 2వేల ఉద్యోగాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా చిన్నా చితకా కార్పొరేషన్లలో మరో 5వేల ఉద్యోగాలు ఉన్నాయి. వీటిలో గతంలో వైకాపా హయంలో పనిచేసిన వారే పనిచేస్తున్నారు. వీరంతా అక్రమమార్గాల్లో నియమించినందున వారిని తొలగించి..అర్హులైన వారికి ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే వీరందరినీ భర్తీ చేయవచ్చు. అయితే ఎందుకో కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టడం లేదు. ఎన్నికలకు ముందు ‘టిడిపి’ కోసం ఎందరో యువకులు పనిచేశారు. వీరిలో అర్హులైన వారిని ఆయా సంస్థల్లో నియమించవచ్చు. దీనిపై ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. అయితే..అటు ప్రభుత్వ పెద్దలు కానీ, ఇటు ‘లోకేష్’ కానీ..దీనిపై దృష్టి పెట్టడం లేదు.
కార్యకర్తల ఆత్మహత్యలు...!
నిజంగా కార్యకర్తలను, పార్టీ కోసం పనిచేసిన వారిని ఆదుకోవాలంటే..ఇక్కడ చాలా మందికి ‘లోకేష్’ ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంది. ఇటీవల కాలంలో కొందరు ‘టిడిపి’ కార్యకర్తలు ఆర్థిక ఇబ్బందులతో ‘ఆత్మహత్య’లు చేసుకుంటున్నారు. ఇటువంటి వారికి..వీటిలో అవకాశం కల్పిస్తే..వారికి ఆర్థికంగా వెలుసుబాటు ఉంటుంది. పార్టీ కోసం తమ ఆస్తులు అమ్ముకుని పనిచేసిన యువకులను ఇప్పుడైనా ఆదుకోవాలి. వారు చనిపోయిన తరువాత వారి కోసం ఎన్ని ట్వీట్లు పెట్టినా..ఎన్ని సంతాప సందేశాలు పంపినా..వారి కుటుంబాలకు ఒరిగేదేమీ ఉండదు. ‘టిడిపి’ గెలిస్తే..తమకు ఉజ్వలభవిష్యత్తు ఉంటుందని భావించిన వారు ఇప్పుడు నిర్వేదానికి గురవుతున్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక..తమ ప్రాణాలనే తీసుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటామని చెబుతోన్న ‘లోకేష్’ ఈ ఉద్యోగాలను 10 రోజుల్లో భర్తీ చేసి అటువంటి వారిలో ఆత్మస్థైర్యం నింపే అవకాశం ఉంది. కానీ..ఆయన ఆదిశగా ఆలోచిస్తున్నట్లు లేదు. ఆయన చుట్టూ ఉండే కోటరీ కూడా..ఆయనకు ఈ విషయం గురించి చెప్పడం లేదేమో...? కార్యకర్తల్లో పార్టీపై విశ్వాసం నెలకొనాలంటే..ఇటువంటి చర్యలు ఇప్పటికైనా తీసుకోవాలి. ప్రభుత్వపరంగా ఉద్యోగాలు కల్పించుకోవడం తప్పేమీ కాదు. అన్ని నిబంధనలు, మార్గదర్శకాలు పాటించి...అర్హత కలిగిన వారిని నియమిస్తే..అటు వారికి..ఇటు ప్రభుత్వానికి మేలే. దీనిపై ఇప్పటికైనా ‘లోకేష్’ దృష్టి పెట్టాలని పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులు, కోరుకుంటున్నారు.