‘గుంటూరు’ జిల్లా కలెక్టర్‌గా ‘శ్రీధర్’...!?
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలకు అధికారవ్యవస్థలో భారీ మార్పులు తేబోతోంది. దీనిలో భాగంగా పాలనలో ముఖ్యమైన ‘ఐఏఎస్’, ‘ఐపిఎస్’ అధికారులను బదిలీ చేయబోతోంది. ఐఏఎస్, ఐపిఎస్‌ల బదిలీలకు సంబంధించి నేడు కానీ, రేపు కానీ అధికార ఉత్తర్వులు రాబోతున్నాయి. పలువురు జిల్లా కలెక్టర్లను మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా ‘కడప’ కలెక్టర్‌గా ఉన్న ‘చెరుకూరి శ్రీధర్’ను ‘గుంటూరు’ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేయబోతున్నారని తెలుస్తోంది. గత ‘చంద్రబాబు’ ప్రభుత్వంలో ఆయన ‘గుంటూరు జిల్లా’ జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. అప్పట్లో రాజధాని అమరావతి కోసం రైతుల నుంచి భూములను సేకరించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఆయన పనితీరు నచ్చడంతో..తరువాత ఆయనను ‘సిఆర్‌డిఎ’ కమీషనర్‌గా ‘చంద్రబాబు’ నియమించారు. అయితే..తరువాత ప్రభుత్వం మారడంతో..ఆయన చాలా ఇబ్బందులు పడ్డారు. ‘జగన్’ ఆయనను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని వేధింపులకు గురిచేసింది. ‘జగన్’ ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా చాలా రోజుల పాటు ఇబ్బందులకు గురిచేసింది. అయితే ప్రభుత్వం మారి ‘కూటమి ప్రభుత్వం’ అధికారంలోకి వచ్చినా..ఆయనకు వెంటనే పోస్టింగ్ లభించలేదు. అప్పట్లో ‘జగన్’ ప్రభుత్వ వేధింపుల్లో భాగంగా ఆయనపేరుతో ‘చంద్రబాబు’పై కేసులు నమోదు చేయించింది. దీంతో ‘చంద్రబాబు’ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. అయితే..ఆయనకు జరిగిన అన్యాయంపై మీడియాలో వార్తలు రావడంతో..చివరకు ‘శ్రీధర్’ను ‘కడప’ కలెక్టర్‌గా ‘చంద్రబాబు’ నియమించారు. కాగా తనకు ‘కృష్ణా’ జిల్లాలో పనిచేసే అవకాశం ఇవ్వాలని ‘శ్రీధర్’ కోరినా..ఆయన స్వంత జిల్లా అదే కావడంతో ఆయనకు అక్కడ పోస్టింగ్ లభిచంలేదు. అయితే..ఇప్పుడు మాత్రం ఆయనను ‘గుంటూరు’ జిల్లా కలెక్టర్‌గా నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజధాని ‘అమరావతి’ నిర్మాణాలు ఊపందుకున్న పరిస్థితుల్లో ఇక్కడ పనిచేసిన అనుభవం ఉన్న ‘శ్రీధర్’ను ఇక్కడ నియమిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలతో ఆయనను ఇక్కడ నియమిస్తారని తెలుస్తోంది. అదే విధంగా ‘అల్లూరిసీతారామరాజు’ జిల్లా కలెక్టర్ ‘దినేష్‌కుమార్’,‘ఏలూరు’ కలెక్టర్ ‘వెట్రిసెల్వి’,తూర్పుగోదావరి కలెక్టర్ ‘ప్రశాంతి’ ‘పల్నాడు’ కలెక్టర్ ‘అరుణబాబు’లకు‘బాపట్ల’ జిల్లా కలెక్టర్ ‘వెంకటమురళీ’, నెల్లూరు కలెక్టర్ ‘ఆనంద్’లు బదిలీ కావచ్చు. కాగా ‘అగ్రికల్చర్’ డైరెక్టర్ ‘ఢల్లీిరావు’ను బదిలీ చేస్తారని తెలుస్తోంది.
కార్యదర్శులకు స్థానచలనం...!
కాగా కొందరు కార్యదర్శులకు స్థానచలనం తప్పదని తెలుస్తుంది. ముఖ్యంగా కొందరు శాఖాధిపతులు మంత్రులను పట్టించుకోవడం లేదనే సిఎంకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో వారిని బదిలీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మున్సిపల్, పంచాయితీరాజ్, ఆర్థికశాఖ, ట్రాన్స్ పోర్టు, వైద్యశాఖ కార్యదర్శులను బదిలీ చేస్తారంటున్నారు. కాగా..సమాచారశాఖ డైరెక్టర్‌గా పనిచేస్తోన్న ‘హిమాన్ష్ శుక్లా’ బదిలీ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఆయనను ‘టూరిజం కార్పొరేషన్’ ఎండిగా నియమిస్తారంటున్నారు. మరి కొందరు మాత్రం ఆయనను అక్కడే కొనసాగించి ‘ఆర్టీజీఎస్’కు అదనపు బాధ్యతలు అప్పగిస్తారంటున్నారు. ఇటీవల కాలంలో ఆయన ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’ అభిమానాన్ని బాగా చూరగొన్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు చాలా మంది పోస్టింగ్‌లు లేకుండా ఉన్న ఐఏఎస్‌లు ఈసారైనా తమకు పోస్టింగ్‌లు లభిస్తాయమోననే భావనతో ఉన్నారు. గత ‘జగన్’ ప్రభుత్వంలో ఆయనతో అంటకాగిన ‘వై.శ్రీలక్ష్మి’ ‘ముత్యాలరాజు’లు తమకు పోస్టింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. వీరిలో ‘శ్రీలక్ష్మి’ తన సామాజికవర్గ నేతలతో ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’పై ఒత్తిడి తెస్తుండగా, ‘ముత్యాలరాజు’ తాను బీసీ వర్గానికిచెందిన వాడినని, తనకు ఉద్యోగం అవసరమని, తనకు వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. కాగా..ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. అయితే..ఎవరిని మారుస్తారనే దానిపై ఉత్కంఠత నెలకొంది. ఇటీవల కాలంలో ప్రభుత్వాన్ని సమర్థించే ఓ మీడియా..సిఎంఓపై తీవ్రస్థాయిలో దాడిచేసింది. మరి దీనిని ముఖ్యమంత్రి పరిగణలోకి తీసుకుంటారా.? తీసుకుంటే..ఎవరిపై చర్యలు ఉంటాయో అన్న ఆసక్తి అధికార, రాజకీయవర్గాల్లో ఉంది. వాస్తవానికి సిఎంఓలో ఎటువంటి మార్పులు ఉండవని ప్రచారం సాగుతోంది. అయితే అనూహ్యంగా ఒకరిద్దరిని తప్పిస్తారని ప్రచారం జోరుగా ఉంది. మరి ఈ ఉత్కంఠత తొలగాలంటే ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేవరకూ వేచి ఉండాల్సిందే..?