‘కొలికపూడి’ స్వయంకృతం...!?
‘తిరువూరు’ టిడిపి ఎమ్మెల్యే ‘కొలికపూడి శ్రీనివాసరావు’ వ్యవహారాన్ని ‘టిడిపి’ అధిష్టానం తేల్చేసినట్లు కనిపిస్తోంది. గత కొన్నాళ్లుగా ‘తిరువూరు’ ఎమ్మెల్యే వ్యవహారం పార్టీకి తలపోటుగా మారింది. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన దగ్గర నుంచి అటు పార్టీకి, ఇటు నియోజకవర్గ కార్యకర్తలు ఇబ్బందులు, చిక్కులు సృష్టిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే తనకు గిట్టనివారి ఇళ్లు కూల్చివేయించారనే ఆరోపణలు వచ్చాయి. తరువాత పార్టీకిచెందిన మహిళా కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నారని, తరువాత ఇసుక, మైనింగ్ వ్యవహారాల్లో తలదూర్చి సొమ్ములు డిమాండ్ చేస్తున్నారని, స్వంత పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్నారని, ‘కమ్మ’ సామాజికవర్గ నేతలను దూషించారని, లైంగికవేధింపులకు గురిచేస్తున్నారని, పనులు చేయాలంటే భారీగా లంచాలు డిమాండ్‌చేస్తున్నారని, ఇలా ఒకటి కాదు..రెండు కాదు పదుల సంఖ్యలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై పార్టీ అధిష్టానం ఆయనకు ఇప్పటికే పలుసార్లు హెచ్చరికలు జారీచేసింది. అయితే..ఆయన ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా..తనదారిలోనే వెళుతున్నారు. తాజాగా నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడు ఒక మహిళతో అసభ్యంగా మాట్లాడారని, ఆయనను పార్టీ నుంచి 48 గంటల్లో తొలగించకపోతే..తాను ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని అధిష్టానవర్గానికి హెచ్చరికచేశారు. అయితే..ఆయన హెచ్చరికలను అధిష్టానం పట్టించుకోలేదు. దాంతో..ఆయన ఇచ్చిన గడువు ముగిసిపోయింది. అయితే..ఈ పరిస్థితుల్లో రాజీనామా చేస్తానన్న ‘కొలికలపూడి’ ఆ వ్యవహారంపై స్పందించకుండా..ఈరోజు ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ ‘నందిగామ’ పర్యటనకు వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి ఆయనను పట్టించుకోలేదు. పార్టీ నాయకులందరినీ ఆప్యాయంగా పలకరించి భుజం తట్టిన ‘చంద్రబాబు’ ‘కొలికలపూడి’ని కనీసం పలకరించలేదు. ఆయనవైపు చూడడానికి కూడా అధినేత ఇష్టపడలేదని ప్రచారం సాగుతోంది. దీంతో..‘కొలికలపూడి’ వ్యవహారంపై అధినేత సీరియస్ నిర్ణయం తీసుకున్నారని, ఆయనను ఒక పార్టీ ఎమ్మెల్యేగా పరిగణించరని, నియోజకవర్గంలో ఆయన పెత్తనం ఏమీ ఉండదని, ఇన్‌ఛార్జిని నియమిస్తారని ప్రచారం సాగుతోంది. ఇక ‘కొలికలపూడి’ సాంకేతికంగా ఎమ్మెల్యేగా ఉంటారు..అంతే..ఇక నియోజకవర్గంలో ఆయన చేసేదేమీ ఉండదు. పార్టీ అధినేత దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని, ‘కొలికలపూడి’ ఇవ్వాల్సిన ఛాన్స్‌లన్నీ ఇచ్చారని కానీ..ఆయన దాన్ని నిలబెట్టుకోలేదనే ఆగ్రహం అధినేతలో ఉందని ఈ రోజుతో తేలిపోయిందని, ఆయన చీటీ ఇక చిరిగిపోయినట్లేననే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.
అంతా స్వయంకృతం...!?
మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకూ ‘టిడిపి’లో ‘కొలికపూడి’పై హీరో వర్షిప్ ఉండేది. ‘జగన్’ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అమరావతికి అనుకూలంగా ఆయన తీసుకున్న నిర్ణయంతో ఆయనకు ‘టిడిపి’లో చాలా మంది మద్దతుదారులుగా ఉండేవారు. ముఖ్యంగా ‘ఏబీఎన్’, టివి5 వంటి ఛానెల్స్‌లో ఆయన డిబేట్‌ను వారంతా ఆసక్తిగా చూసేవారు. ‘జగన్’కు వ్యతిరేకంగా ఆయన చేసే వ్యాఖ్యలు, ఆయన పోరాటంతో.. ప్రజల్లో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ‘అమరావతి’కి వ్యతిరేకంగామాట్లాడరని ‘ఏబీఎన్’ ఛానెల్‌లో బిజెపి నేత ‘విష్ణువర్ధన్‌రెడ్డి’పై దాడిచేయడం అప్పట్లో..‘అమరావతి’ మద్దతు దారుల్లో సంతోషాన్ని నింపింది. ఆయన పోరాటానికి గుర్తింపు ఇవ్వాలని టిడిపిలో మెజార్టీ వారు ఆశించడంతో..‘చంద్రబాబు’ ఆయనకు ‘తిరువూరు’ టిక్కెట్ ఇచ్చారు. ‘టిడిపి’గాలిలో ఎమ్మెల్యేగా గెలిచిన ‘కొలికలపూడి’ తరువాత దారి తప్పారు. ఎవరైతే..తనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇప్పించారో...వారిపైనే ఆయన తిరగబడుతున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్‌తో పాటు, ఎన్నికల నిధులు ఇచ్చిన వారిని కులాల పేరుతో దూషిస్తున్నారు. ఎవరైతే..తనను మోశారో..వారినే ఆయన లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఏదో ఒకటీ రెండు తప్పులుచేశారంటే..ఏదో అనుకోవచ్చు కానీ..రోజూ..అదే తీరుతో వ్యవహరించడంతో..ఇక అధిష్టానం ఏదో ఒక చర్య తీసుకోక తప్పని పరిస్థితి. దీంతో..ఆయనను పార్టీకి దూరంగా పెట్టాలనే కఠిన నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి ఆయనే సృష్టించారు.
‘కొలికపూడి’ దారి ఎటు...!?
తాజాగా తన పట్ల ‘చంద్రబాబు’వ్యవహరించిన తీరుతో ‘కొలికపూడి’ ఏ నిర్ణయం తీసుకుంటారో..అన్న ఆసక్తి అటునియోజకవర్గ ప్రజలతో పాటు, రాజకీయ వర్గాల్లోనూ నెలకొంది. తాను ఇచ్చిన 48 గంటల గడువు ముగియడంతో..ముందు చేసిన ఛాలెంజ్ ప్రకారం ఆయన రాజీనామా చేయాలి. ఒకవేళ చేయకపోతే..ఆయనకే..ఇబ్బంది. ఇప్పుడు..ఆయనను పిలిచి మాట్లాడేందుకు అధిష్టానం సిద్ధంగా లేదు. ఈ పరిస్థితుల్లో ఇంకా నాలుగేళ్లు ఉన్న ఎమ్మెల్యే పదవిని ఆయన వదులుకుంటారా..? ఒక వేళ వదులుకుంటే..ఆయన పరిస్థితి ఏమిటి..? టిడిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే..ఆయన ఎటువైపు వెళతారు. ‘వైకాపా’లోకి వెళతారా..? వెళితే..ఒక వేళ ఉప ఎన్నిక జరిగితే..ఆయనకు అక్కడ టిక్కెట్ ఇస్తారా..? ఇచ్చినా..ఆయన గెలుస్తారా..? ఇవన్నీ..సందేహాలే..? అయితే..ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయరని, ఎమ్మెల్యేగా ఉంటూనే..‘టిడిపి’పై విమర్శలు, ఆరోపణలుచేస్తూ..వారికి చికాకులు సృష్టించాలనే ఎత్తుగడతో..ఆయన ఉన్నారనే ప్రచారం సాగుతోంది. వైకాపాతో ఒక అవగాహనకు వచ్చి..‘కూటమిప్రభుత్వం’ నిత్యం విమర్శలు, ఆరోపణలు చేయాలనే ఆలోచన ఆయనలో ఉందంటున్నారు. గతంలో వైకాపా ప్రభుత్వ హయాంలో ఆ పార్టీలో ఎంపిగా గెలిచి తరువాత ‘జగన్’కు ఎదురు తిరిగిన ‘రఘురామకృష్ణంరాజు’ వలే..ఈయనా ‘చంద్రబాబు’కు వ్యతిరేకంగా చాకిరేవు పెట్టాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ‘జగన్’తో అవగాహనకు వచ్చారనే ప్రచారం ఉంది. అయితే..ఇవన్నీ ఇప్పుడే జరగవు. నిదానంగా జరుగుతాయని, ఇవన్నీ జరగడానికి మరింత సమయం ఉందంటున్నారు. మొత్తం మీద..సామాన్యవ్యక్తిగా ఉన్న ‘కొలికలపూడి’ని ‘టిడిపి’ పిలిచి ఎమ్మెల్యేనుచేస్తే..ఆయన వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.