లేటెస్ట్

పిల్లి మెడలో గంట కట్టిన బీఆర్ఎస్ సోషల్ మీడియా!!

హైదరాబాద్ యూనివర్సిటీ భూముల్లో చెట్లు తొలగిస్తున్న వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా బయట పెడుతున్న పలు వీడియోలు సంచలనం అవుతున్నాయి. ఈ వ్యవహారంలో అత్యున్నత న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోవడంతో పనులకు కాస్త బ్రేక్ పడింది. ఇది ఇలా ఉంచితే ఇప్పుడు ఈ వ్యవహారం చినికి చినికి గాలి వానగా మారడంతో ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న కాంగ్రెస్ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళ పాటు జరిగిన విధ్వంసానికి సంబంధించి పలు విషయాలను లెక్కలు, ఆధారాలతో సహా బయటకు తీస్తోంది. 2014 నుంచి 2023 వరకు గులాబీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున చెట్లు నరికినప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీస్తోంది. హరిత హారం పేరుతో అడవులను పెంచాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఇందుకోసం పది వేల కోట్ల రూపాయలను రెండు శాఖల ద్వారా కేటాయింపులు చేసారు. 2015 నుండి 2022 వరకు జరిగిన హరితహారం కార్యక్రమం కింద 219 కోట్ల మొక్కలు నాటినట్లు సీఎం హోదాలో కేసీఆర్ ప్రకటించారు. దీని కోసం 9,777 కోట్లు ఖర్చు అయినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీని కోసం గానూ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 5,006.82 కోట్లు కేటాయించగా.. అటవీ శాఖ నుంచి 2,567.12 కోట్లు కేటాయించి.. పూర్తి మొత్తం ఖర్చు చేసారు. అప్పుడు నాటిన మొక్కలు 85% బతికాయని కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రకటన కూడా చేసారు. 

ఆ లెక్కన తెలంగాణాలో అటవీ విస్తీర్ణం భారీగా పెరగాలి. కాని తగ్గింది అనేది కాంగ్రెస్ చెప్తున్నా లెక్క. 2014 నాటికి  తెలంగాణ అటవీ విస్తీర్ణం 21,591 చ.కి.మీ కాగా అది 2021 నాటికి 21,213 చ.కి.మీకి తగ్గింది. దీనిపై బీఆర్ఎస్ సోషల్ మీడియా సమాధానం చెప్తుందా అని కాంగ్రెస్ సోషల్ మీడియా నిలదీస్తోంది. 2014 నుంచి 2024 మధ్య కాలంలో.. అంటే కేసీఆర్ సీఎం గా ఉన్న సమయంలో 11 వేల 422.47 హెక్టార్ల అటవీ భూమిని అధికారికంగా.. అటవీయేతర ప్రయోజనాల కోసం కేటాయింపులు చేసారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున మొక్కలు నరికేశారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా గాని పర్యావరణ వేత్తలు గాని మాట్లాడలేదు. ఇక అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి 2016 నుంచి 2019 మధ్య కాలంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం గానూ.. 12,12,753 చెట్లను నరికినట్టు కాంగ్రెస్ అప్పటి పత్రికల కథనాలు, ఆధారాలతో సహా బయటకు తీసింది. ఈ ప్రాజెక్ట్ కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయగా.. ఇప్పుడు మోటార్ల సమస్యతో ప్రాజెక్ట్ ఎందుకు పనికి రాకుండా పోయింది. ఎప్పుడు మళ్ళీ వినియోగంలోకి వస్తుందో తెలియని పరిస్థితి. ఇక ఇందుకోసం 8,000 ఎకరాల్లో అడవిని నరికి చదును చేసారు. మరి దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదనేది కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రశ్న. దానితో పాటుగా 2014 నుంచి 2023 మధ్య కాలంలో అటవీ భూములు సహా 4,28,437 ఎకరాల భూమిని కేసీఆర్ సర్కార్ వేలం ద్వారా విక్రయించగా.. TSIIC, HMDA ఆధ్వర్యంలో జరిగిన పలు వేలాల ద్వారా 31,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మరి దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదనేది కూడా కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. కేవలం ట్రేండింగ్ లో ఉన్న అంశం కాబట్టే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని, అది అభివృద్ధి అయితే ఇది కూడా అభివృద్దే కదా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ