ఏప్రిల్ 15న మంత్రిమండలి సమావేశం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఈ నెల 15వ తేదీన అత్యవసరంగా సమావేశం కాబోతోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ విడుదల చేశారు. ఈనెల 15న అమరావతిలోని వెలగపూడి సచివాలయలోని మొదటి భవనం నందు గల సమావేశ మందిరంలో ఉదయం 11గంటలకు మంత్రివర్గం సమావేశం కాబోతోంది. దీనికి అన్నిశాఖల స్పెషల్ చీఫ్ కార్యదర్శులు, ప్రిన్సిపల్ కార్యదర్శులు, కార్యదర్శులు తమ ప్రతిపాదలను నిర్ణీత నమూనాలో పంపించాలని సిఎస్ కోరారు. సమావేశ ఎజెండా ఎమిటో అధికారికంగా ఇంకా వెలువడలేదు. అయితే..ఈ నెల 20వ తేదీలోపు ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆయన అమరావతిని సందర్శిస్తారని, రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని తిరిగి ఆయన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన అంశాలపై మంత్రిమండలిలో చర్చిస్తారని తెలుస్తోంది. అదే కాకుండా పి4 పథకం తీరుతెన్నులపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలో పేదరికం నిర్మూలన లక్ష్యంగా, ప్రభుత్వ-ప్రైవేట్-ప్రజల భాగస్వామ్యం (P4) పద్ధతిని అమలు చేసి, "జీరో పోవర్టీ" లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్ర స్థాయి పి4 సొసైటీ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదించనుంది..ఈ సొసైటీని ముఖ్యమంత్రి నాయకత్వంలో ఏర్పాటు చేసి, ఉప ముఖ్యమంత్రిని భాగాస్వామ్యం చేస్తున్నారు. పి4 కార్యక్రమంలో 5 లక్ష 'గోల్డెన్ ఫ్యామిలీలను ఆగస్టు 15 నాటికి గుర్తించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే విధంగా గ్రామ వాలంటీర్లకు సంబంధించిన సమస్యపై కూడా మంత్రిమండలి చర్చించవచ్చు. ఇవే కాకుండా ఇతర ముఖ్య విషయాలపై కూడా మంత్రిమండలి చర్చించనుంది.