లేటెస్ట్

‘పి4’తో రాజకీయ లబ్ది ఉంటుందా...!?

ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ ఎక్కడికి వెళ్లినా ‘పి4’ (పబ్లిక్‌, ప్రవేట్‌, ప్రజలభాగస్వామ్యం) గురించి ఘనంగా చెబుతున్నారు. సమాజంలో పేదలు లేకుండా చేయడమే తన జీవిత ఆశయమని..ఈ పథకాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తెలుగు సంవత్సరాది అయిన ‘ఉగాది’ నుంచి లాంఛనంగా ప్రారంభించింది. రాష్ట్రంలో పేదరికం లేకుండా నిర్మూలించడమే ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకం ద్వారా సమాజంలోని ఉన్నత స్థాయిలో ఉన్న 10శాతం సంపన్నులు (మార్గదర్శుకులు) సమాజంలోని దిగువ 20శాతం పేద కుటుంబాలను (బంగారు కుటుంబం) దత్తత తీసుకుని, వారికి మార్గదర్శకత్వం మరియు ఆర్థిక సహాయం అందించి వారిని పేదరికం నుంచి బయటకు తెస్తారు. ఇది స్థూలంగా ‘పి4’ గురించి.  అయితే ఈ కార్యక్రమానికి ‘చంద్రబాబు’  కోరుకున్న విధంగా స్పందన వస్తోంది. కొందరు సంపన్నలు ఇప్పుడిప్పుడే ‘చంద్రబాబు’ పిలుపుకు స్పందిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చాలని ఆయన భావిస్తున్నారు. అంటే దాదాపు ఒక కోటి మందిపై దీని ప్రభావం ఉంటుందని అంచనా వేయవచ్చు. ఈ పథకం ద్వారా నిరుపేదలైన వారే లబ్ది పొందుతారు. ఇప్పటికే..ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారిని ఆర్థికంగా ఆదుకుంటోంది. అయితే..ఇప్పుడు తెస్తోన్న ‘పి4’తో వారికి మరింత మేలు జరుగుతోంది. పేదరికంలో మగ్గుతోన్న వారికి ఇది అదనపు సహాయం అన్నమాట. దీని ద్వారా పేదల బతుకుల్లో వెలుగు నింపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే..ఇది ఎంత వరకు విజయవంతం అవుతుందో..చెప్పలేం. అయితే దీన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ గొప్పపట్టుదలతో ఉన్నారు. దీని కోసం రాష్ట్ర స్థాయి సొసైటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి స్వయంగా ముఖ్యమంత్రే ఛైర్‌పర్సన్‌గా ఉండబోతున్నారు. ఉపముఖ్యమంత్రి ‘పవన్‌కళ్యాణ్‌’ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. జిల్లా స్థాయిలో మంత్రి ఛైర్‌పర్సన్‌గా, నియోజకవర్గస్థాయిలో ఎమ్మెల్యే ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. 


రాజ‌కీయ‌ల‌బ్ది పొందుతారా..?

పటిష్టంగా ‘పి4’ అమలు చేయడానికి ఆయన చేయవలిసినదంతా ఒక పద్దతి ప్రకారం చేసుకుంటూ పోతున్నారు. అయితే..ఆయన అనుకున్నట్లు వచ్చే నాలుగేళ్లలో ఇది సమగ్రంగా అమలు అయితే..ఆయన పార్టీకి లేదా కూటమికి రాజకీయంగా ఇది లబ్ది చేకూరుస్తుందా..? అంటే చెప్పడం కష్టమే. ‘ఆంధ్రప్రదేశ్‌’లో ప్రజలు కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విడిపోయారు. వ్యక్తిగతంగా లబ్ది చేకూర్చినా..కొందరు తమ కులానికి, మతానికి, ప్రాంతానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప..తమకు మేలు చేసినవారిని రాజకీయంగా అంతగా ఆదరించరు. దీనికి స్పష్టమైన రుజువులు కూడా ఉన్నాయి. 2014 ఎన్నికల తరువాత ‘టిడిపి’ ప్రభుత్వం రాజధానిని ‘అమరావతి’లో ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు బ్రహ్మాండమైన ఆర్థిక లబ్ది చేకూర్చింది. అప్పటి వరకూ అక్కడ నామమాత్రంగా ఉన్న భూములు ధరలు ఒక్కసారిగా ఆకాశానంటాయి. లక్షల్లో ఉన్న భూముల విలువలు కోట్లకు చేరి..ఆ ప్రాంతంలో ఉన్నవారంతా..కోటీశ్వర్లు అయ్యారు. ఇందుకు భూములు లేని వారు మినహాయింపు. అయితే..రాజధాని వల్ల ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగానో..పరోక్షంగానో లాభమే తప్ప నష్టం జరగలేదు. అయితే..ఇలా లబ్దిపొందిన వారు..2019 ఎన్నికల్లో లబ్ది చేకూర్చిన ‘టిడిపి’ని ఘోరంగా ఓడించారు. రాజధాని ప్రాంతమైన ‘మంగళగిరి’లో టిడిపి అధినేత ‘చంద్రబాబునాయుడు’ తనయుడు ‘లోకేష్‌’ ఓడిపోయారు. ఆయనే కాదు..ఆ ప్రాంతంలో ఆయన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులంతా ఓడిపోయారు.తాము ఆ ప్రాంతానికి ఎంత మేలు చేసినా..తాము మాత్రం కులం, మతం, ప్రాంతాన్నే చూస్తామని ఓటర్లు...తేల్చి చెప్పారు. ఇదే కాదు..గతంలో..‘చంద్రబాబు’ ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ను ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేశారు. కానీ..2004 ఎన్నికల్లో ఆయన పార్టీకి గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రాంతంలో కేవలం ఒక్క సీటు మాత్రమే వచ్చింది. అంత అభివృద్ధి చేసినా..ప్రజలు రాజకీయంగా ఆయనకు లబ్ది చేకూర్చలేదు. తాను రాజకీయాలను పట్టించుకోనని ‘చంద్రబాబు’ చెబుతుంటారు. కానీ..ప్రజలకు మేలు చేయాలంటే..రాజకీయంగా బలంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు ఆయన ‘పి4’తో పేదల బతుకు మారుస్తానని చెబుతున్నారు. ఆయనైతే..ఆ పని ఖచ్చితంగా చేస్తారు. దీనిలో రెండో మాటకే తావు లేదు. అయితే..లబ్ది పొందిన వారు..ఆయనను గుర్తిస్తారా..? లేదా..? అనేది భవిష్యత్తులోనే తేలుతుంది. 

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ