షాక్‌లో ‘టిడిపి’ కార్యకర్తలు...!?
తెలుగుదేశం అధిష్టానం తీసుకున్న ఓ నిర్ణయంతో ‘టిడిపి’ కార్యకర్తలు షాక్ తిన్నారు. తమ అధిష్టానం తప్పు చేసిన వారిపై ఇంత కఠిన చర్యలు తీసుకుంటుందా..? స్వంత పార్టీ అయినా..సరే..తప్పు చేస్తే వదిలేది లేదన్న అధిష్టానం నిర్ణయంతో వారు నివ్వెరపోయారు. మనవాడు.. పగవాడు అనేది లేదని..తప్పు చేస్తే..ఎవరైనా సరే..శిక్ష వేయాల్సిందేనంటూ..అధిష్టానం తీసుకున్న నిర్ణయం పార్టీలో తీవ్ర కలకలం సృష్టించింది. ముఖ్యంగా మహిళల విషయంలో..తప్పు చేస్తే..అసలు ఊరుకునేది లేదని..ఈ సంఘటనతో అధిష్టానం తేల్చి చెప్పింది. వారు ఎంత పెద్దవారైనా..పార్టీకి ఎంత సేవ చేసినా..వదిలేది లేదని ‘చేబ్రోలు కిరణ్’ ఉదంతంతో చేష్టల ద్వారా నిరూపించింది. నిన్న ‘కిరణ్’ మాజీ ముఖ్యమంత్రి, ‘పులివెందుల’ ఎమ్మెల్యే ‘వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి’ సతీమణి ‘వై.ఎస్.భారతి’ని ఉద్దేశించి అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు..వైరల్ కావడం..విషయం ‘టిడిపి’ అధినేత ‘చంద్రబాబునాయుడు’ ఆయన కుమారుడు ‘లోకేష్’ దృష్టికి వెళ్లిన వెంటనే..‘కిరణ్’ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి..వెంటనే అరెస్టు చేయించారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.ఆయనను అరెస్టు చేసే వరకూ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి పర్యవేక్షణ కూడా సాగింది. పార్టీ క్రమశిక్షణ విషయంలో ‘చంద్రబాబు’ సీరియస్‌గా ఉంటారనే విషయం వారికి తెలుసు కానీ..మరీ ఇలా ఉంటారని వారెవరూ ఊహించలేదు. స్వంత పార్టీ కార్యకర్త తప్పు చేస్తే..సహజంగా ఆయన మందలిస్తారు. తరువాత అదే తప్పు పదే పదే చేస్తే..మాత్రం చర్యలు తీసుకుంటారు. కానీ...‘కిరణ్’ విషయంలో మాత్రం రెండో ఆలోచనే లేకుండా చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి ‘కిరణ్’ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయి. ఆయన వ్యాఖ్యలను ఎవరూ సమర్థించరు.. అంగీకరించరు. ఈ విషయాన్ని తెలుసుకున్న ‘కిరణ్’ వెంటనే..‘భారతి’కి పదే పదే క్షమాపణలు చెప్పారు. అయితే చేసిన ఆయన చేసి తప్పు క్షమించేది కాకపోవడంతో..ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ‘వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి’ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుంచి ‘కిరణ్’ ఆయన పాలనపై, ఆయన తీరుపై తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. ‘జగన్’ గ్యాంగ్‌కు భయపడకుండా..తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ వస్తున్నారు. పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పనిచేశారు. పార్టీని మళ్లీ అధికారంలోకి తేవడంలో తన వంతు పాత్ర పోషించారు. అయితే..ఆయన చేసిన వ్యాఖ్యలను ఎవరూ సమర్థించలేని పరిస్థితి ఉండడంతో..ఆయనపై వేటు పడిరది.
‘జగన్’ అలా...‘బాబు’ ఇలా...!?
కాగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి ‘జగన్’కు..‘చంద్రబాబు’కు పోలికలు తెచ్చి..తమనేత వ్యవహరించిన తీరును టిడిపి నేతలు కొనియాడుతున్నారు. గతంలో ‘జగన్’ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షాత్తూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ‘చంద్రబాబు’ను ఆయన సతీమణి ‘భువనేశ్వరి’ని బూతులు తిట్టించారు. సభ్యసమాజం వినలేని మాటలను ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు నాయకులు మాట్లాడు తుంటే ‘జగన్’ పగలబడి నవ్వుతూ..తన పార్టీ వారిని మరింతగా ప్రోత్సహించేవారు. అంతేనా ‘జగన్’ బహిరంగ సభల్లో తన కంటే పెద్దవాడైన ‘చంద్రబాబు’ను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడేవారు. అంతే కాకుండా తన పార్టీ వారికి ‘చంద్రబాబు’, ‘లోకేష్’, ‘పవన్’లను తిట్టాలని రోజూ పార్టీ కార్యాలయం నుంచి స్క్రిప్ట్ పంపించేవారు. తన పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా.. దూషించినా..ఎప్పుడూ చర్యలు తీసుకున్న పాపానపోలేదు. అయితే..ఇప్పుడు ‘చంద్రబాబు’మాత్రం తన పార్టీ వారు మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన వెంటనే చర్యలు తీసుకుని వారిని జైలుకు పంపించారు. మహిళలను అసభ్యంగా దూషించినా..వారి పట్ల అమర్యాదగా మాట్లాడినా.. వారిపై దాడులు చేసినా..ఊరుకునేది లేదని..వారు స్వంత పార్టీ వారైనా..వదిలేది లేదని ‘కిరణ్’ ఉదంతంతో చాటి చెప్పారు. తనకూ..‘జగన్’కూ ఉన్న తేడాను ఆయన తన పనితీరు ద్వారా నిరూపించుకున్నారు.
కార్యకర్తల నైతిక స్థైర్యం దెబ్బతినదా...!?
కాగా ‘కిరణ్’పై చర్యలను పార్టీ సోషల్ మీడియా సమర్థిస్తూనే...మరోవైపు ఆసక్తికరమైన ప్రశ్నలను సంధిస్తూంది. పార్టీ కార్యకర్త ‘కిరణ్’ తప్పు చేస్తే ఆగమేఘాలపై చర్యలు తీసుకున్నారు..బాగానే ఉంది. మరి గతంలో ‘చంద్రబాబు’ సతీమణి ‘భువనేశ్వరి’ని, ఆయన కోడలు ‘బ్రాహ్మణి’ని అసభ్యకరంగా, తిడుతూ...రంకులు అంటగట్టిన ‘వైకాపా’ నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని వారు ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా..వారినిఎందుకు జైలుకు పంపలేదు. వారేమో..ఇష్టారాజ్యంగా అధినేత సతీమణిని, లోకేష్ సతీమణిని దూషిస్తారు.. మరి వారిని ఎందుకు వదిలిపెడుతున్నారు. వారికి మనకు తేడా చూపించాల్సిందే కానీ..వారు చేస్తోన్న తప్పుడు పనులపై వెంటనే చర్యలు ఏవి..? ‘కిరణ్’ విషయంలో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్న అధిష్టానం ‘వర్రా రవీందర్‌రెడ్డి’,‘ఇప్పాల రవీంద్ర’, ‘ప్రవీణ్‌రెడ్డి’, ‘అనితారెడ్డి’ పాలేటి కృష్ణవేణి, గోరంట్ల మాధవ్, కారుమూరి నాగేశ్వరరావు, అంబటి, కొడాలి, రోజా, ద్వారంపూడి, అమర్‌నాధ్‌రెడ్డి, వల్లభనేని వంశీ’లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. వారిని అలా వదిలేసి..స్వంత పార్టీ కార్యకర్తను ఏదో అంతర్జాతీయ ఉగ్రవాది అన్నట్లు ముసుగేసి పోలీసులు తీసుకెళ్లడం ఏమిటి..? దీని ద్వారా పార్టీ కార్యకర్తల నైతిక స్థైర్యం దెబ్బతినదా..? పార్టీ అధినేతను దూషిస్తున్నారనే బాధతోనే..అతను తొందరపడ్డాడు. దానికి చట్టప్రకారం చర్యలు తీసుకోవడం సబబే. కానీ..అదేసమయంలో ప్రత్యర్థులపై ఇదే తీరులో ఎందుకు చర్యలు లేవు..? అంటూ..పార్టీ కార్యకర్తలు, నాయకులు మదనపడుతున్నారు. తండ్రీకొడుకులకు లేని బాధ మనకెందుకన్న భావన పార్టీ వర్గాల్లో వస్తోంది. ‘వైకాపా’ వారిని పూలతో కొడుతూ..స్వంత పార్టీ వారిని తలుపు చెక్కలతో కొడుతున్నారని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు పార్టీ నాయకులు మాత్రం..‘కిరణ్’పై చర్యలు తీసుకుని పార్టీ..అసభ్యంగా వాగేవారికి చెక్‌పెట్టిందని, రేపటి నుంచి వైకాపా వాళ్లు ఇలా అసభ్యంగా మాట్లాడితే..‘కిరణ్’పై తీసుకున్న చర్యలనే వారిపైనా తీసుకుంటారని, ఏదో ఒకచోట ఇటువంటి వాటికి చెక్ పెట్టాలనేదే పార్టీ అధినేత లక్ష్యమని చెబుతున్నారు.