ఐఏఎస్‌ల బదిలీలు
రెవిన్యూశాఖాధిపతి ఆర్.పి.సిసోడియాను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘విజయానంద్’ ఉత్తర్వులను జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెవిన్యూశాఖాధిపతిగా ‘ఆర్.పి.సిసోడియా’ను ప్రభుత్వం నియమించింది. గత వైకాపా పాలనలో రెవిన్యూ వ్యవహారాలకు సంబంధించి అనేక అవకతవకలు, అవినీతి, అక్రమాలు జరగడంతో సీనియర్ ఐఏఎస్ అయిన ‘సిసోడియా’ను ఆశాఖలో నియమించింది. అయితే..ఆయన ప్రభుత్వం అనుకున్న రీతిలో పనిచేయలేకపోయారు. దాదాపు ఏడాది కావస్తున్నా ప్రజల నుంచి వస్తోన్న భూ సమస్యలకు పరిష్కారం చూపలేకపోవడం, శాఖలో ఆయన పనితీరుపై విమర్శలు ఉండడంతో..ఆయన బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఆయనను చేనేత మరియు వస్త్రపరిశ్రమ, పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. దాంతో పాటు గతంలో ఆయన అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ బాధ్యతల నుంచి తొలగించారు. సిసోడియా నిర్వహిస్తున్న రెవిన్యూశాఖను జి.జయలక్ష్మికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎపిహెచ్‌ఆర్‌డిఐ డైరెక్టర్ జనరల్‌గా ఐటిశాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌కు అదనపు బాధ్యతలను ఇచ్చారు. వీరితో పాటు గత ప్రభుత్వంలో ‘జగన్’తో అంటకాగారనే ఆరోపణలు ఎదుర్కొన్న పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ‘జగన్’ కార్యాలయంలో పనిచేసిన ‘ముత్యాలరాజు’కు గ్రామీణాభివృద్ధి రాష్ట్ర సంస్థ, పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్‌గా నియమించారు. వెయిటింగ్‌లో ఉన్న కె.మాధవీలతను ఏపీ రైతు బజార్ సిఇఓగా నియమించారు. అదే విధంగా ‘గౌతమి’ని ఆదివాసీ సంక్షేమశాఖ కమీషనర్‌గా నియమించారు. ఇటీవల వరకూ ‘ఎపీ ఫైబర్ నెట్’ ఎండిగా ఉండి ‘జివిరెడ్డి’తో లడాయిపెట్టుకున్న ‘కె.దినేష్‌కుమార్’ను ఆయుష్ డైరెక్టర్ పోస్టు ఇచ్చారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న కె.నీలకంఠారెడ్డికి ఎపి రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. కాగా..వైకాపాకు అనుకూలంగా పనిచేశారనే విమర్శలు, పలు ఆరోపణలు ఎదుర్కొన్న పలువురికి ఇప్పుడు పోస్టింగ్‌లు ఇవ్వడం విశేషం. కాగా సాయంత్రం వరకు మరికొన్ని బదిలీలు జరిగే అవకాశం ఉంది. కాగా సిసోడియా బదిలీపై ముందుగా ప్రభుత్వం ఉత్తర్వులు వెలవరించింది. అయితే తరువాత ఎందుకో ఆ ఉత్తర్వులను ప్రభుత్వ సైట్ నుంచి తొలగించింది.