కూటమిపై వ్యతిరేకత నిజమే...!
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..కూటమి 75సీట్లు కోల్పోతుందని ఐఐటీకి చెందిన సర్వే సంస్థ చెప్పిందంటూ..ఓ పోస్టు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే..ఈ సర్వే చేసిందెవరో...ఎప్పుడు చేశారో..ఎందుకుచేశారో..తెలియదు. కానీ..దీన్ని పట్టుకుని వైకాపా ఒకటే హడావుడి చేస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్‌దే విజయం అంటూ..వైకాపా సోషల్ మీడియా జబ్బలు చరుచుకుంటోంది. పది నెలల్లో కూటమి పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని, అదే జగన్‌ను అధికారంలోకి తెస్తుందంటూ..వారు ఒకటే హడావుడి చేస్తున్నారు. అయితే ఐదేళ్ల కాలానికి ఎన్నికైన ఓ ప్రభుత్వాన్ని అంచనా వేయడానికి పది నెలలు సమయం చాలా తక్కువ. పది నెలల్లోనే బ్రహ్మోండమైన తీర్పు ఇచ్చిన ప్రజలు అప్పడే మనస్సు మార్చుకున్నారని చెప్పడం అతిశయోక్తి అవుతోంది. అయితే కూటమి పాలనపై ప్రజలకన్నా కూటమిలోని ప్రధానపార్టీ అయిన టిడిపి కార్యకర్తల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇలా కూటమిపై అసంతృప్తి వ్యక్తం కావడానికి పలు కారణాలు ఉన్నాయి.
1.కార్యకర్తల్లో అసంతృప్తి: టిడిపి అధికారంలోకి వస్తే..అంతా మంచే జరుగుతుందని, తమను వేధించిన వైకాపా నాయకులను జైలుకు పంపిస్తారని, పాలన సజావుగా సాగుతుందని, తమకు ఉపాధి దొరుకుతుందని, రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎక్కువ మంది కార్యకర్తలు భావించారు. అయితే వారి అంచనాలు నిజం కాలేదు. అధికారం ఉన్నప్పుడు అడ్డగోలుగా చెలరేగిపోయిన వైకాపా నాయకులను కనీసం అరెస్టులు చేయలేదు. చిన్నా చితకా నాయకులను మాత్రమే అరెస్టు చేశారు. పార్టీ కోసం గొంతులు కోయించుకున్న వారి కుటుంబాల సంగతే పార్టీ పట్టించుకోవడం లేదనే అక్కసు వారిలో ఉంది. పైగా ప్రత్యర్థులకు పెద్దపీట వేస్తున్నారనే భావన..తమ పనుల కంటే ప్రత్యర్థుల పనులే అవుతున్నాయనే ఆందోళన వారిలో ఉంది. స్థానిక ఎమ్మెల్యేలు వారిని పట్టించుకోకపోవడం..వారి పనులు చేయకపోవడం..ఒకవేళ చేసినా..కమీషన్లు అడుగుతుండడంతో..క్యాడర్ తీవ్ర నిరుత్సాహానికి గురవుతోంది. తాజాగా జరిగిన కిరణ్ సంఘటనలో పార్టీ పెద్దలు అనుసరించిన తీరు వారి అసంతృప్తిని పరాకాష్టకు గురిచేసింది. పార్టీ కోసం ప్రాణాలు అడ్డేసి పనిచేసిన వారికే ఈ గతి పడితే..ఇక మిగిలిన వారిని తండ్రీకొడుకులు పట్టించుకోరనే భావన వ్యక్తం అవుతోంది. దీంతో..పార్టీ క్యాడర్‌లో నిరుత్సాహం, నిర్వేదన, నిరసన, అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
2.మెగా డిఎస్సీ ఏదిః- కూటమి ప్రభుత్వ మొదటి హామీ అయిన మెగా డిఎస్సీని ఇంత వరకూ విడుదల చేయలేదు. ఇదుగో..అదుగో అంటూ..రోజులు నెట్టేసుకుంటూ వస్తున్నారు. దీంతో..దీనిపై వైకాపా అసత్య ప్రచారాలను చేస్తోంది. చంద్రబాబు మెగా డీఎస్సీ ఇవ్వరని..అలానే కాలక్షేపం చేస్తారని నిరుద్యోగులను రెచ్చగొడుతోంది. అమాయక నిరుద్యోగులు వారి బుట్టలో పడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం..లక్షలు వెచ్చించి శిక్షణ తీసుకుంటున్న వారు..ఆ ఖర్చులు భరించలేక అల్లాడిపోతున్నారు. మెగా డిఎస్సీ వస్తే..కనీసం ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో క్షణమో యుగంలా..నెట్టుకొస్తున్నారు. కానీ పాలకులు మాత్రం ఇంకా టైమ్ ఉందిలే..అంటూ కాలాన్ని గడిపేస్తున్నారు.
3. తల్లికివందనంః తాము అధికారంలోకి వస్తే చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.15వేలు ఇస్తామని ఎన్నికల ముందు కూటమి హామీ ఇచ్చింది. అయితే..అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా..ఇంత వరకు దాన్ని అమలు చేయలేదనే భావన సామాన్య ప్రజల్లో వ్యక్తం అవుతోంది. అదే విధంగా రైతు బంధు, ఉచిత బస్సు పథకాలు అమలు చేయలేదన్న అసంతృప్తి బాగానే ఉంది. అయితే..వీటిలో కొన్ని మే నెలలో అమలు చేస్తామని చెబుతున్నారు. కాగా ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో ఆరు సిలిండర్ల పథకాన్ని అమలు చేసినా..దానిలో కొన్ని లోపాలు ఉన్నాయి.
4.భూ సమస్యలుః గత వైకాపా పాలనలో జగన్ ప్రభుత్వం వేలాది భూములను కొట్టేసింది. అంతేనా...భూ సర్వే పేరిట భూ సమస్యలు సృష్టించింది. దాదాపు ప్రతి గ్రామంలో ఇవి భారీగా ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం దీనిపై ఇంత వరకూ ఒక పరిష్కారాన్ని కనుగొనలేక పోయింది. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఇదే.
5. వైకాపా అధికారులుః కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైకాపాలో పనిచేసిన వారే మళ్లీ ఇక్కడ పెత్తనం చేస్తున్నారన్న భావన కార్యకర్తల్లో నెలకొంది. వీళ్లంతా మళ్లీ వైకాపా వారికే పనులు చేసి పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయంలో, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న లోకేష్ కార్యాలయంలో వైకాపా సానుభూతిపరులు తిష్టవేశారని, వీరు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే నిర్ణయాలను తీసుకుంటున్నారని, భారీగా అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయినా తండ్రీకొడుకులు వారినే కొనసాగిస్తున్నారని ఆవేదన పార్టీ వర్గాల్లో ఉంది.
6.రాజధానిలో తట్ట మట్టి పోయలేదుః కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతున్నా..రాష్ట్ర రాజధాని అమరావతిలో తట్ట మట్టి పోయలేదనే విమర్శను ఎదుర్కొంటుంది. ప్రస్తుత సచివాలయానికి వెళ్లే కరకట్టనే ఇంత వరకు విస్తరించలేని వీళ్లు రాజధానిని ఎలా కడతారనే విమర్శలు భారీగా వస్తున్నాయి. గత ఎనిమిదేళ్ల నుంచి ఈ కరకట్ట మీద వెళ్లేవాళ్లు నరకం చూస్తున్నా..ఎవరూ పట్టించుకునే వాళ్లే లేరు. సీడ్ యాక్సిస్ రోడ్డుకు అనుసంధానం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ..కొందరు రైతులు భూములు ఇవ్వలేదనే సాకుతో..కరకట్టను విస్తరించకుండా..అలానే వదిలిపెట్టేశారు. రాజధానిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కేవలం అక్కడ ఉన్న కంపనే తొలగించారు తప్ప..ఎటువంటి పనులు చేయలేకపోయారు. ఇప్పుడు మళ్లీ ప్రధానితో శంకుస్థాపనలంటూ కాలయాపన చేస్తున్నారు. గతంలో..అలా చేసే..రాజధాని విషయంలో తీవ్రంగా దెబ్బతిన్నారు.
7.కొత్త పెన్షన్లు ఏవి...?ః కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సామాజిక పెన్షన్లు భారీగా పెంచేసింది. దీంతో పెన్షన్లు అందుకుంటున్న వారిలో సంతోషం వ్యక్తం అయింది. అయితే..అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోవడం..వారిని తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఎప్పుడు కొత్త పెన్షన్లు ఇస్తారంటూ..నాయకులు చుట్టూ తిరుగుతున్నారు. గత వైకాపా ప్రభుత్వంలో అర్హత లేని వారు లక్షలాది మంది పెన్షన్లు తీసుకుంటే..తమ ప్రభుత్వంలో నిజమైనవారికి పెన్షన్లు ఇప్పించలేక పోతున్నామంటూ స్థానిక నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
8.కుమ్మక్కు రాజకీయాలుః రాష్ట్ర స్థాయిలోని నేతలు వైకాపా నాయకులతో కుమ్మక్కు అయ్యారనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ప్రాణాలకు తెగించి వైకాపా నాయకుడు పెద్దిరెడ్డి కుటుంబంతో పోరాడితో..వారిచ్చే సొమ్ముల కోసం వారితో నాయకత్వం కుమ్మక్కు అయిందని, ఇప్పుడు చిత్తూరులో వైకాపా పాలనే నడుస్తోందన్న భావన ప్రతికార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. కేవలం ఈ జిల్లాలోనే కాదు..అన్ని జిల్లాల్లోనూ ఇదే రీతిలో ఉంది.
9.వైకాపా కాంట్రాక్టర్లకే పనులుః వైకాపా హయంలో జగన్‌తో అంటకాగిన కాంట్రాక్టర్లకే టిడిపి కూటమి ప్రభుత్వం మళ్లీ పిలిచి పెద్దపీట వేస్తోంది. దీంతో..వీళ్లూ వాళ్ల వద్ద కమీషన్లు తీసుకుని దండుకుంటున్నారనే అభిప్రాయాలు పెద్ద ఎత్తున్న వ్యాపిస్తున్నాయి. ఒకప్పడు తిట్టిపోసిన మెగా కృష్ణారెడ్డి, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్, మిధున్‌రెడ్డి కంపెనీలకే ప్రభుత్వం పెద్ద ఎత్తున్న పనులు ఇచ్చి వారి వద్ద నుంచి కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
10.నిర్ణయాలు తీసుకోవడంలో అలసత్వంః ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాలుగోసారి బాధ్యతలు నిర్వహిస్తున్నా..ఆయన గతంలో ఎప్పుడూ తడబడనంతగా ఇప్పుడు పాలనలో తడబడుతున్నారు. ఏ నిర్ణయం తీసుకోకుండా నాన బెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కొన్ని నామినెటెడ్ పదవులను ఇంకా భర్తే చేయలేదు. పార్టీ కోసం పనిచేసిన వారికి వెంటనే పదవులు ఇస్తే ఇప్పటికే ఏడాది గడిచిపోయేదని, రెండేళ్ల తరువాత మరి కొందరికి ఇస్తే..వాళ్లూ సంతోషపడేవారని కానీ..పదవుల పంపకాలపై నాన్చివేత ధోరణితో..పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
ఇవే కాదు..ప్రభుత్వంలో అవినీతి, పనితీరు చూయించలేకపోతున్న మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, మద్యం పాలసీతో పాటు.., కూటమి నేతల మధ్య నెలకొన్న విభేదాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అయితే..పైన పేర్కొన్న సర్వే నిజమో కాదో..కానీ..కూటమి ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నమాట నిజం. అయితే..ఈ వ్యతిరేకత జగన్‌కు లాభించదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారా అంటే నిస్సందేహంగా కారనే చెప్పవచ్చు. కూటమిపై ప్రజల్లో వ్యతిరేకతే ఉంది..కానీ జగన్‌పై కొన్ని వర్గాల్లో అసహ్యం,జుగుస్ప,ద్వేషం, విరక్తిలు నెలకొన్నాయి.. ఆయన చేసిన పాపాలు అంత తేలిగ్గాపోవు. అదే కూటమికి శ్రీరామరక్ష.