‘చంద్రబాబు’ ఇంటి చుట్టూ రియల్ ఎస్టేట్ సందడి...!?
రాజధాని అమరావతి నడిబొడ్డున ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ కుటుంబం స్వంత ఇంటిని నిర్మించుకుంటోంది. ఆ ఇంటి నిర్మాణం కోసం ‘చంద్రబాబు’ కుటుంబం 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, ఇంటి నిర్మాణానికి శంఖుస్థాపన కూడా చేసింది. దీంతో ఇక్కడ రియల్‌ఎస్టేట్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. బాగా ధనవంతులైన వారు..ఆయన ఇంటి చుట్టుపక్కల ఇళ్లు కోసం స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. గతంలోనే ఇక్కడ స్థలాలు కొన్నవారు..ఇప్పుడు వాటికి మంచి ధర లభిస్తుండడంతో..అమ్ముకునేందుకు సిద్ధం అవుతున్నారు. కొందరు ఇంకా మంచి ధరలు వస్తాయని వేచి చూస్తుండగా, మరి కొందరు మాత్రం అమ్ముకుంటున్నారు. అయితే..‘చంద్రబాబు’ కుటుంబం నిర్మిస్తోన్న భవనంపై ‘జగన్’కు చెందిన మీడియా విమర్శలు గుప్పిస్తోంది. అతి పెద్ద ప్యాలెస్ కట్టుకుంటున్నారని, అంత సొమ్ము ఆయనకు ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఇక్కడ గజం దాదాపు రూ.7500 ఉందని, దీని ప్రకారం మొత్తం ఆయన కుటుంబం కొనుగోలు చేసిన ఆస్తి విలువ సుమారు రూ.150 కోట్లు ఉంటుందని, ఇక నిర్మాణానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తారో ఊహకందడం లేదని విమర్శలు గుప్పిస్తోంది. ఇక్కడ గజం రూ.60 వేలు ఉంటుందని ‘జగన్’ పత్రిక చెబుతోంది. కాగా..గతంలో ఈ ప్రాంతం స్మశానం అని వ్యాఖ్యానించిన ‘వైకాపా’ నేతలు ఇప్పుడు అక్కడ భూమి ధరలు చూసి కళ్లు తేలేస్తున్నారు.
కీలక మంత్రికి భారీగా భూములు...!
కాగా ‘చంద్రబాబు’ ఇంటి చుట్టూరా ఆయన మంత్రివర్గంలో ఉన్న ఓ మంత్రికి భారీగా భూములు ఉన్నట్లు తెలుస్తోంది. సదరు మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, తెలంగాణ సలహాదారుకి భారీగా భూములు ఉన్నాయట. వీరందరు కలసి రాష్ట్ర విభజన సమయంలో రాజధాని ఇక్కడ వస్తుందని తెలిసి భూములు కొన్నారట. అప్పట్లో వీరు ఈ భూములను అతి తక్కువ ధరకే దక్కించుకున్నారు. వీరి భూముల వ్యవహారంపై అప్పట్లో ‘శాసనసభ’లో చర్చ కూడా జరిగింది. ‘అమరావతి’ భూముల కుంభకోణంలో వీరు ఉన్నారని, వీరితో పాటు ‘టిడిపి’కి చెందిన కీలక వ్యక్తులందరూ ఇక్కడ భూములు కొనుగోలు చేసి రైతులను మోసగించారని ‘జగన్’ ఆరోపించారు. అయితే..దీనిపై ఆయన ఐదేళ్ల కాలంలో ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. కాగా..ఇప్పుడా భూములకు భారీ రేట్లు వచ్చాయి. ‘చంద్రబాబు’ కుటుంబం కొనుగోలు చేసిన స్థలం పక్కనే వీరి భూములు ఉన్నాయి. వీరు గజం రూ.60వేల ధరకు అమ్ముతామని చెబుతున్నారట. అయితే..వీరిలో కొందరు ఆ ధరకు కూడా ఇవ్వమని..ఇంకా ధర పెంచితేనే..తమ భూములు ఇస్తామని చెబుతున్నారట. అప్పట్లో తమ వద్ద నుంచి అతి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసిన వీరు ఇప్పుడు భారీ ధరలకు అమ్ముకుంటున్నారని ఆ భూముల రైతులు వాపోతున్నారు. మొత్తం మీద రాజధాని అమరావతిలో ముఖ్యంగా ‘చంద్రబాబు’ ఇంటి చుట్టూ రియల్ ఎస్టేట్ సందడి జోరుగా ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.