‘గోవిందప్ప’తో నిజం కక్కిస్తారా...!?
మద్యం కేసులో అసలు నిందితుడైన ‘గోవిందప్ప బాలాజీ’ అరెస్టుతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. మాజీ ముఖ్యమంత్రి ‘వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి’కి సన్నిహితుడైన ‘బాలాజీ’ అరెస్టు వైకాపా వర్గాల్లో ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ‘జగన్’కు సన్నిహితులైన వారు పరార్‌లో ఉండడం..మద్యం సొమ్ములను ‘జగన్’కు చేర్చారని అభియోగాలను ఎదుర్కొంటున్న ‘బాలాజీ’ అరెస్టు వైకాపా అధినేతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ మద్యం కేసులో తమకు సంబంధం లేదని, మద్యం కేసులో నిందితులంతా టిడిపి వారేనని, వైకాపా మాజీ రాజ్యసభ సభ్యుడు ‘విజయసాయిరెడ్డి’ ‘చంద్రబాబు’తో ఒప్పందం చేసుకున్నాడని వైకాపా నాయకులు వాదిస్తున్నారు. దీనికి అనుగుణంగా తమ పత్రికలో కథనాలను వండివారుస్తున్నారు. నిన్నటి దాకా..మద్యం కేసులో కీలకమైన ‘కసిరెడ్డి’, ‘వాసుదేవరెడ్డి’లను వెనకేసుకొచ్చిన వైకాపా అధినేత ఇప్పుడు వాళ్లు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే అనుమానం రావడంతో వాళ్లు తన వాళ్లు కాదని, వాళ్లంతా ‘టిడిపి’కి చెందిన వారని ఎదురుదాడికి దిగారు. ఇప్పుడు ‘గోవిందప్ప’ విషయంలోనూ అదే విధంగా వ్యవహరిస్తున్నారు. ‘గోవిందప్ప’కు ‘భారతీ సిమెంట్’కు సంబంధం లేదని, ఆయన ‘వికాట్ గ్రూప్’కు చెందిన వ్యక్తి అని వాదిస్తోంది. అయితే.. ‘వికాట్ గ్రూప్’కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేస్తే ‘వైకాపా’ ఎందుకు ఉలిక్కిపడుతుంది. ‘జగన్’, ‘భారతి’లతో ‘గోవిందప్ప’కు సంబంధం లేకపోతే..మద్యం నిధులను ఆయన వారికి చేర్చకపోతే..విచారణకు సహకరించవచ్చు కదా...? పారిపోవాల్సిన అవసరం ఏముంది..? ఇప్పుడు ‘గోవిందప్ప’తో సిఐడి ఎక్కడ నిజం కక్కిస్తుందో అన్న భయం ‘జగన్’ బృందంలో ఉంది. ‘గోవిందప్ప’ సొమ్ములను ఎవరికి చేర్చాడో..ఆధారాలతో చెబితే..ఇక కేసులో అసలు నిందితులు బయటకు రాకతప్పదు. ఇన్నాళ్లూ అనుకున్నదే నిజమైతే ‘జగన్ దంపతుల’ అరెస్టు తప్పదు. మద్యం కుంభకోణంలో మనీ ట్రైల్ పై ‘గోవిందప్ప’తో సిఐడీ నిజాలు కక్కిస్తే..ఇక కేసు ఒక కొలిక్కి వచ్చినట్లే.