‘ధనుంజయరెడ్డి’ని అరెస్టు చేస్తారా..!?
మద్యం కేసులో ఓ సీనియర్ ఐఏఎస్ అరెస్టు కాబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ‘జగన్ ప్రభుత్వం మద్యం అక్రమాలపై సిట్‌తో విచారణ జరిపిస్తోంది. ఈ కేసులో ముఖ్యపాత్రదారులైన వారందరినీ సీఐడీ పద్దతి ప్రకారం అరెస్టులు చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే కేసులో కీలకమైన ‘కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి’ని అరెస్టు చేయగా మరి కొందరి అరెస్టు కోసం కసరత్తులు చేస్తోంది. అయితే ఈ కేసులో కీలక నిందితులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ‘ధనుంజయరెడ్డి’, జగన్ ఓఎస్టీ ‘కృష్ణమోహన్‌రెడ్డి’లను సీఐడీ విచారిస్తోంది. అయితే..విచారణకు వీరిద్దరూ సహకరించడం లేదని, మద్యం అక్రమ సొమ్ము ఎక్కడకు వెళ్లిందో..చెప్పాలని సీఐడీ ఎంత పద్దతిగా అడిగినా వీరు చెప్పడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వీరిని అరెస్టు చేసి విచారించాలని సీఐడి భావిస్తోంది. అయితే వీరు తమను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో సీఐడి వీరిపై ఇప్పటి వరకూ సానుకూలంగా వ్యవహరిస్తోంది. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు వీరి అరెస్టుకు రక్షణ కల్పించలేదు. మద్యం కేసు కీలక దశలో ఉందని, ఇప్పుడు వీరికి ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరని తేల్చి చెప్పింది. ఇప్పటికే వీరి హైకోర్టులోనూ ఉపశమనం లభించలేదు. దీంతో..ఇప్పుడు వీరిని ఖచ్చితంగా అరెస్టు చేస్తారనే వార్తలు వస్తున్నాయి. కాగా..రిటైర్డ్ ఐఏఎస్ అయిన ‘ధనుంజయరెడ్డి’ ఈ కేసులో అరెస్టు అయితే..ఇదో పెద్ద సంచలనమే. సిఎంఓ ఇన్‌ఛార్జి స్థాయిలో పనిచేసిన ఐఏఎస్ అధికారి అరెస్టు చేస్తే..ఈ కేసు వెనుక ఉన్న అసలైన నిందితులు బయటపడతారనే ప్రచారం సాగుతోంది. ‘ధనుంజయరెడ్డి’ని అరెస్టు చేస్తే..ఇక ‘జగన్’ బాగోతం మొత్తం బయటపెడతారని, ఈ కేసులో అసలేమి జరిగిందో..సిఐడీ కక్కిస్తుందని భావన వ్యక్తం అవుతోంది. మొత్తం మీద గతంలో ‘జగన్’ తండ్రి ‘రాజశేఖర్‌రెడ్డి’ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకుని పలువురు ఐఏఎస్ అధికారులను జైలుకు పంపిన ‘జగన్’ ఇప్పుడు తాను అధికారంలో ఉండి..మరోసారి ఐఏఎస్ అధికారులను జైళ్లపాలు చేస్తున్నారనే మాట సర్వత్రా వినిపిస్తోంది. ‘జగన్’ అక్రమాలకు సహకరించిన ఐఏఎస్‌లందరికీ ఇదే శిక్షపడుతుందని, ‘జగన్’కు ఎంత దూరంగా ఉంటే..అంత మంచిదనే సంగతి ఇప్పటికైనా కొంత మంది ఐఏఎస్‌లు తెలుసుకోవాలని రిటైర్డ్ ఐఏఎస్‌లు అంటున్నారు.