‘తాడేపల్లి ప్యాలెస్’ తలుపు తడుతోన్న మద్యం కేసు..!?
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు దేవుడిదయతో, మీ ఆశీస్సులతో అధికారంలోకి వస్తే..రాష్ట్రంలో మద్యమనేదే లేకుండా చేస్తా...? మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టేట్లు చేస్తా...? అంటూ బహిరంగ సభల్లో అప్పటి ప్రతిపక్షనేత ‘వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి’ ఒకటే గాండ్రించారు. అప్పట్లో ఆయన హావభావాలను చూసిన వారు..ఆయన అధికారంలోకి వస్తే..నిజంగానే మద్యపాన నిషేదం చేస్తారని ఆశించారు. అయితే అవన్నీ..మాయమాటలేనని, మద్యం పేరుతో తన బొక్కసాన్ని నింపుకునేందుకు ముందస్తుగా వేసిన ప్లాన్ అని అమాయక ఆంధ్రాప్రజలు గమనించలేకపోయారు. దేవుని ఆశీస్సులో, లేక ఒకసారి చూద్దామని భావించి ప్రజలు ఓట్లు వేస్తే..ఐదేళ్లపాటు వాళ్ల రక్తమాంసాలను మద్యం పేరిట ‘జగన్’ బృందం జుర్రుకుంది. పొద్దస్తమానం పనిచేసి..అలసి..సొలసి ఆ కష్టాన్ని మరిచేందుకు మద్యాన్ని తాగే కటిక పేదలను ఈ బృందం నిలువునా దోచుకుంది. తనను నమ్మి ఓట్లేసిన అమాయక ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాల రక్తాన్నే నాడు ‘జగన్ బృందం’ పీల్చుకుతింది. మద్యనిషేదమంటూ..మద్యం తాకితే షాక్ కొట్టాలనట్లు..గతంలో ఎప్పుడూ లేని రేట్లను పెట్టి..ఐదేళ్లపాటు తాడేపల్లి ప్యాలెస్‌ను నోట్లకట్లతో నింపేశారని నేడు సీఐడీ తేల్చుతూపోతోంది. ఐదేళ్ల పాటు నాసిరకం మద్యాన్ని సరఫరా చేసి..పేదలను కొల్లగొట్టి వేల కోట్లు అక్రమార్జన భాగోతాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జరుపుతోన్న ఈ కేసు..తిరిగి..తిరిగి ‘జగన్ దంపతుల’ చుట్టూనే తిరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ కేసులో పలువురు కీలక వ్యక్తులు అరెస్టు కాగా..ఇప్పుడు ‘జగన్’కు అత్యంత సన్నిహితులైన రిటైర్డ్ ఐఏఎస్ ‘ధనుంజయరెడ్డి’, ‘జగన్ ఓఎస్టీ ‘కృష్ణమోహన్‌రెడ్డి’ అరెస్టు అయ్యారు. ఇప్పుడు వీళ్ల అరెస్టు తరువాత..ఈ కేసు తాడేపల్లి వైపే వెళుతోందన్న సంకేతాలు వైకాపాలో భయాందోళనను సృష్టిస్తున్నాయి.
వాస్తవానికి ఈ కేసులో కొన్ని అరెస్టులు జరుగుతాయని, తరువాత తనపై ఆరోపణలు చేస్తారని, దాంతో కేసు ఆగిపోతుందని మాజీ ముఖ్యమంత్రి ‘వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి’ తొలుత భావించినట్లున్నారు. అయితే..ఈ కేసులో నిన్నటి దాకా తనతో ఉన్న మాజీ రాజ్యసభ సభ్యుడు ‘విజయసాయిరెడ్డి’ సీఐడి అధికారులకు మెరుగైన సమాచారం అందించడం, అప్పటి వరకూ మొండిగా ఉన్న బేవరేజ్ కార్పొరేషన్ ఎండి ‘వాసుదేవరెడ్డి’ అక్రమ మద్యం వ్యాపారుల్లో ఎవరెవరు ఉన్నారో..అంతిమలబ్దిదారు ఎవరో స్పష్టంగా చెప్పడంతో..ఈ కేసు ఊపదుకుంది. మొదట ‘కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి’ అరెస్టుతో ‘జగన్’ ఖంగుతిన్నారు. అయినా తన వద్దకు రాదులే అనే ధీమాతో ఉన్నారు. అయితే ఇప్పుడు ‘కసిరెడ్డి’ ఇచ్చిన సమాచారంతో ‘ధనుంజయరెడ్డి’, ‘కృష్ణమోహన్‌రెడ్డి’, భారతీ సిమెంట్ ఆడిటర్ ‘బాలాజీ గోవిందప్ప’ను అరెస్టు చేయడంతో..ఇక కేసు తనను చుట్టుముడుతోందన్న ఆందోళనతో ‘జగన్’ వీరిని అరెస్టు కాకుండా చూసేందుకు భారీగా ఖర్చు చేశారు. అయితే..ఆయన ఎంత ఖర్చు చేసినా..ఈ ముగ్గురు అరెస్టు అవడం ‘జగన్’ను నిర్ఘాంతపరిచింది. ఇప్పుడు వీరు అక్రమ మద్యం అంతిమ లబ్దిదారు ఎవరో సీఐడికిచెబితే..ఇక తాడేపల్లి చుట్టూనే కేసు తిరుగుతుంది. ఈ కేసులో ఇప్పుడు అరెస్టు అయిన ఈ ముగ్గురు నిజాలు కక్కితే..‘జగన్’దంపతులకు ఇక్కట్లు వచ్చినట్లే. నాడు అక్రమ మద్యం సొమ్ముల నోట్ల కట్టలు తాడేపల్లికే చేరాయని ఆరోపణలు ఉన్నాయి. వాటికి కనుక ఈ ముగ్గరు ఆధారాలు అందిస్తే..ఇక ఈ కేసులో ‘జగన్’ దంపతులు జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే.