డిప్యూటేషన్‌పై ఆంధ్రాకు ఇద్దరు ఐఏఎస్‌లు...!
ఆంధ్రా క్యాడర్‌కు చెందిన కొందరు ఐఏఎస్‌లు వివిధ కారణాలతో ఇక్కడ నుంచి నిష్క్రమిస్తుంటే..ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు ఐఏఎస్‌లు అమరావతిలో పనిచేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్‌లు ఇక్కడకు రాగా...ఇప్పుడు కర్ణాటకకు చెందిన ఓ మహిళా ఐఏఎస్ ఇక్కడకు డిప్యూటేషన్‌పై రావడానికి సిద్ధపడుతున్నారు. కర్ణాటకలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న హెబ్సిబా కొర్లపాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరనున్నారు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం ఆమెను రిలీవ్ చేసింది. త్వరలో ఆమె ఆంధ్రాలో కీలకమైన అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండిగా చేరుతుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రాజధాని నిర్మాణంలో ఆమె కీలకంగా పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. నిజాయితీ, అంకితభావంతో ఆమె పనిచేస్తారని, యువ ఐఏఎస్‌గా ఆమె వేగంగా పనులు చేస్తుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఒకవేళ ఆమెకు ఆ పదవి ఇవ్వకపోతే ఎపి మారిటైమ్ బోర్డు బాధ్యతలు అప్పగిస్తారంటున్నారు.
పత్తిపాడు ఎమ్మెల్యే అల్లుడు కూడా...!
కాగా గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు అల్లుడైన ఐఎఎస్ అధికారి కూడా రాష్ట్రానికి వస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి రామాంజనేయులు మాజీ ఐఏఎస్ అధికారి. ఆయన 2019లో టిడిపిలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయన పత్తిపాడు నుంచి పోటీ చేసి గెలుపొందరు. రామాంజనేయులు అల్లుడు కూడా ఐఏఎసే. ఆయన కూడా రాష్ట్రంలో పనిచేసేందుకు ఆసక్తితో ఉన్నారని, ఆయన కూడా ఇక్కడకు డిప్యూటేషన్‌పై వస్తున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద..ఐఏఎస్ అధికారుల కొరతను ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాల నుంచి డిప్యూటేషన్‌పై అధికారులు రావడం..ఊరటనిచ్చే అంశమే.