వృధానీటిపై తెలంగాణ రాద్ధాంతం ఏమిటి..?
వెనకటికి ఓ సింహం ఓ నది ఎగువభాగంలో నీరు తాగుతుంటుంది. అదే సమయంలో అక్కడికి దాహంతో ఉన్న ఓ మేక వచ్చి..సింహానికి దూరంగా..భయం..భయంగా నీరు త్రాగడానికి ప్రయత్నిస్తోంటోంది. అయితే..సింహం నీవు కింద నీళ్లు తాగితే..నాకు ఇబ్బంది...నీవు తాగడానికి వీళ్లేదంటుంది. అదేమిటి ప్రభూ..మీరు పైన ఎక్కడో ఉన్నారు..మీరు అక్కడ తాగి వదిలేసిందే కదా...నేను తాగుతోంది..అంటే..ఒక్కసారిగా సింహానికి ఎక్కడ లేని కోపం తెచ్చుకుని మేకను చంపేస్తుంది. అచ్చం ఇప్పుడు గోదావరి-బనకచర్ల వ్యవహారంలో తెలంగాణ వ్యవహరిస్తోన్న తీరు..సింహం-మేక కథను గుర్తు చేస్తోంది. నైసర్గికంగా ఎగువున ఉన్న తెలంగాణ, దిగువ ఉన్న ఆంధ్రప్రదేశ్ వల్ల తమకు నీటి కష్టాలు వస్తాయని, తద్వారా తెలంగాణ ఎడారి అవుతుందని ఆ రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించడానికి ప్రయత్నిస్తోంది. ఈ తతంగంలో అధికారపార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ ఎస్, బిజెపి పార్టీలు భాగస్వాములు అవుతున్నాయి. గోదావరి నుంచి వచ్చే మిగులు జలాలు సముద్రంలో కలిసిపోతున్నాయని, దీనిని రాయలసీమకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతోంది. దీన్ని ఇప్పుడు తెలంగాణ రాజకీయం చేస్తోంది. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే దీనిపై బిఆర్ ఎస్ రాజకీయం చేస్తుండగా, కాంగ్రెస్ దానికి జత కలిసింది. గోదావరి నది నుంచి ప్రతిఏటా లక్షల క్యూసెక్కులు నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. ఈ నీటిని వాడుకునేందుకు అందరికన్నా దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు హక్కు ఉంది. అయితే..నీరు వృధాగా సముద్రంలో కలిసినా..మాకు ఇష్టమే కానీ..ఆంధ్రా వాడుకోరాదన్నది తెలంగాణా నాయకుల ఉద్దేశ్యం. వృధాగా పోతున్న నీటిని వాడుకుంటే..నష్టమేమిటంటే..సరైన సమాధానం ఉండదు. కృష్ణా,గోదావరి నదుల్లో తమ వాటా తేల్చాలని, అలా తేల్చిన తరువాతే..దాన్ని వాడుకోవాలంటూ..అర్థం లేని..అడ్డంకులను తెలంగాణ సృష్టిస్తోంది. సామాన్య ప్రజలకు అసలు ఇదేమి రాజకీయమో అర్థం కావడం లేదు. ఒకవేళ తెలంగాణ గోదావరి నీటిని చుక్కకూడా కిందికి పోకుండా ప్రాజెక్టులు కట్టుకుని వాడుకుంటే..వాళ్లు చెప్పినదాంట్లో అర్థం ఉండేదేమో..? అప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు ఎలాంటి అనుమతులు లేకుండా కట్టుకున్నా ఆంధ్రా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. అలానే మరికొన్ని ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఒకవేళ ఏదైనా అభ్యంతరం ఉంటే ఆంధ్రాకు ఉండాలి. దిగువ రాష్ట్రంగా తమ నీటి హక్కుల కోసం ఉద్యమించాల్సింది ఆంధ్రా. కానీ..పైన చెప్పిన కథలా తెలంగాణ..పైన ఉండి..ఏదో రాజకీయ లబ్దికోసం..ఇలాంటి ఉద్యమాలు లేవదీయడం సమంజసం కాదు. నీటి వాటాలు తేల్చేది కేంద్రం...కేంద్రంపై ఒత్తిడి తెచ్చి..తమ వాటా తేల్చుకోవాల్సింది..తెలంగాణనే.