జగన్...ఓదార్పుయాత్ర-2...!?
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి మళ్లీ ఓదార్పుయాత్రలు మొదలుపెట్టారు. రాజశేఖర్‌రెడ్డి హెలీకాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన తరువాత ఆయన మృతిని జీర్ణించుకోలేని ఆయన అభిమానులు ఉమ్మడి రాష్ట్రంలో పలువురు మృతి చెందారని అప్పట్లో జగన్ ఓదార్పు యాత్రలు చేశారు. కాంగ్రెస్‌లోనే ఉంటూ ఆయనచేసిన యాత్రలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అప్పట్లో వై.ఎస్.మృతి చెందిన తరువాత తనకు కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి పదవి అప్పగించలేదన్న దుగ్ధతోనే ఆయన ఓదార్పు అంటూ రోడ్ల మీదకు వచ్చారు. అయితే.. అప్పట్లో ఆయనకు ప్రజల్లో బాగానే క్రేజ్ ఉండేది. వై.ఎస్ తనయుడు కావడంతో..వై.ఎస్‌ను అభిమానించేవారందరూ ఆయనకు మద్దతు పలికారు. కాంగ్రెస్ అభిమానులు, వై.ఎస్ మద్దతుదారులు అప్పట్లో జగన్ సభలకు భారీగా వచ్చేవారు. ఈ సందర్భంగా భారీగా జనాలను జగన్ పోగేసి రోడ్‌షోలు నిర్వహించేవారు. తనకు ప్రజల్లోబ్రహ్మాండమైన మద్దతు ఉందని చెప్పుకోవడానికే ఆయన అలా చేసేవారు. అయితే..ఇప్పుడు అచ్చం అలానే మరోసారి ఓదార్పు యాత్రలను మొదలు పెట్టారు.
మొన్న చీరాలలో రౌడీ షీటర్లను పోలీసులు కొట్టారని వారిని పరామర్శించిన జగన్ ఇప్పుడు బెట్టింగ్‌ల్లో సొమ్ములు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకున్న వైకాపా కార్యకర్తలను ఓదారుస్తున్నారు. ఈ ఓదార్పు వెంటనే కాదు..దాదాపు ఏడదా తరువాత ఆయన చేస్తోన్న ఓదార్పుయాత్రలపై టిడిపి మండిపడుతోంది. గత ఏడాది పందెంలో సొమ్ములు పోగొట్టుకుని, అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న మల్లిఖార్జునరావు అనే కార్యకర్త కుటుంబాన్ని ఇప్పుడు జగన్ పరామర్శించారు. ఆయన ఆత్మహత్య చేసుకుని ఏడాది అయిన తరువాత ఇప్పుడు జగన్‌కు ఆ కార్యకర్త గుర్తుకు వచ్చారా..? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. కాగా..జగన్ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలుచేసుకున్న పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలను ఓదార్చనున్నారట. దీనికి ఓదార్పుయాత్ర-2గా నామకరణం చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రతివారం..ఆయన ఏదో ప్రాంతంలో ఓదార్పుయాత్రలు చేస్తూ సందడి చేయనున్నారన్నమాట. జగన్ జనంలోకి వస్తే..జనాలు ప్రభంజనంలా వస్తున్నారని, ఇక తమదే మళ్లీ అధికారమని వైకాపా నేతలు..ఊహలపల్లకిలో తేలాడుతున్నారు. అయితే..పోగేసిన జనాలతో..యాత్రలు చేయగానే సరిపోదని, వై.ఎస్. చనిపోయినప్పుడు ఆయన ఓదార్పుయాత్ర చేశారని, అప్పట్లో కూడా జనం ఇలానే వచ్చారని, కానీ..ఎన్నికల్లో మాత్రం ఆయనకు ఓటు వేయలేదనే సంగతిని గుర్తించుకోవాలని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా జగన్ యాత్రలతో రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల సమస్య పుట్టుకొచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఈరోజు కూడా ఆయన యాత్రలో ఓ వ్యక్తి మృతి చెందారు. జనాలను పోగేసుకుని..యాత్రలంటూ.. ఆయన చేస్తోన్న రాజకీయం అధికారపక్షానికి చిరాకులు కల్గిస్తోంది. మరి చంద్రబాబు దీన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి.