ఉపఎన్నికలతో బలం తేల్చుకోండి: ప్రజల ప్రాణాలతో ఆట ఎందుకు జగన్?
ఎన్నికలు జరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే అవుతుంది. ఐదేళ్లకు ఎన్నికైన ప్రభుత్వానికి ఏడాది అంటే..కనీసం పావు వంతు కూడా పూర్తవలేదు. అయితే..వైకాపా అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి మాత్రం నేడో..రేపో.. ఎన్నికలన్నట్లు ఒకటే యాత్రలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ తన పార్టీ కార్యకర్తలను, నాయకులను రెచ్చగొడుతున్నారు. వారి ద్వారా రాష్ట్రంలో హింస చెలరేగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు జగన్‌పై వస్తున్నాయి. అంతే కాక ఆయన పర్యటనల్లో పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అసలు ఏడాదిలోనే జగన్ ఇంత బలప్రదర్శన చేయాల్సిన అవసరం ఏమిటి..? ఏడాది క్రితం ఆంధ్రాజనం ఆయనకు కనీస ప్రతిపక్షహోదా కూడా ఇవ్వకుండా కేవలం 11సీట్లకే పరిమితం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ రాజకీయనాయకుడైనా ఏమి చేస్తాడు..? తన పార్టీలో జరిగిన తప్పులను, తాను చేసిన తప్పులను బేరీజు వేసుకుని..భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచించుకుంటూ ఉంటాడు. మళ్లీ ప్రజలను తనవైపు తిప్పుకునే మార్గాలను వెతుకుంటుంటారు. కానీ..జగన్ మాత్రం దాని గురించి పట్టించుకోకుండా..రోడ్ల మీద యాత్రలు చేస్తూ శాంతిభద్రతల సమస్యలను సృష్టిస్తున్నారు. అంతేనా బలప్రదర్శనలో స్వంత పార్టీ కార్యకర్తలను, సామాన్యులను బలి తీసుకుంటున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
ఆయన ఇంత తొందరగా తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏమిటి..? ఇప్పటికిప్పుడు..తన బలాన్ని ఎవరికి చూపించాలను కుంటున్నారు. కేంద్రంలోని పెద్దలకా..? లేక ఆయన ప్రత్యర్ధులకా..? లేక మద్యం కేసుల్లో అరెస్టు నుంచి తప్పించుకునేందుకా..? తనకు ప్రజల్లో ఇంకా బలం తగ్గలేదని, రాబోయే రోజుల్లో వచ్చేది తానేనని అధికారులను బెదిరించేందుకా..? లేక పార్టీని కాపాడుకునేందుకా..? దీనికి సమాధానం జగనే చెప్పాలి. కానీ..ఆయన చెప్పరు. తన బలం తగ్గలేదని, గత ఎన్నికల్లో తన ఓటమికి ఈవిఎంలో కారణమని ఇంకా తన పార్టీ వారిని నమ్మించేందుకేమో..? తెలియదు కానీ..ఆయన చేస్తోన్న ఈ బలప్రదర్శన సామాన్యుల ప్రాణాలకు ముప్పుతెచ్చిపెడుతోంది. అదే సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రత సమస్యను సృష్టిస్తోంది. సామాన్యుల ప్రాణాలకు ముప్పుతెచ్చిపెట్టే ఇటువంటి బలప్రదర్శనలు చేయకుండా జగన్ తన బలాన్ని ఉప ఎన్నికల ద్వారా నిరూపించుకోవచ్చు. ఆ పార్టీ తరుపున ఎన్నికైన 11మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి..తన బలాన్ని ప్రజలకు, లేదా..తాను ఎవరికైతే చూపించాలని అనుకుంటున్నారో..వారికి చూపిస్తే సరిపోతుంది. ఇప్పటికే అసెంబ్లీకి రాకుండా జగన్ అండ్ కో తమ వైఖరిని చాటుకున్నారు. ఇప్పుడు వారందరూ రాజీనామా చేసి..తాము చేసింది సరైనదే అని ప్రజలతో చెప్పించాలి. అలా చెప్పించాలంటే...రాజీనామా చేసిన వారందరూ మళ్లీ గెలవాలి. ఒకవేళ ఆ 11మంది రాజీనామా చేసి..మళ్లీ గెలిస్తే ప్రజల్లో జగన్ బలం తగ్గలేదని రుజువవుతుంది. మరి ఇటువంటి సులువైన ఉపాయం ఉండగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఎందుకు జగన్...? ఇప్పటికైనా..ఈ దిశగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి..!