I&PR అవినీతిపై విచారణ ఎటుపోయిందో...!?
పక్కనపెట్టిన వారికి మళ్లీ పోస్టింగ్‌లు...!
సొమ్మలు చేతులు మారుతున్నాయా..?
మంత్రి పేషీపై అనుమానాలు...!
గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సమాచారశాఖను అడ్డగోలుగా దోచుకున్న ఉదంతంపై ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. ఒకవైపు విజిలెన్స్ మరోవైపు ఏసీబీ విచారణ జరుగుతోంది. అయితే..ఏడాది కాలంగా ఈ విచారణ నత్తనడకన నడుస్తోంది. నత్తలకు కూడా నడక నేర్పినట్లుగా ఈ విచారణ జరుగుతోందన్న అభిప్రాయాలు జర్నలిస్టు వర్గాల్లో ఉంది. గతంలో సమాచారశాఖ కమీషనర్‌గా వ్యవహరించిన విజయ్‌కుమార్‌రెడ్డి ఆయన సహచరులు అప్పట్లో భారీగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై రాష్ట్ర అసెంబ్లీలో కూడా సుధీర్ఘ చర్చ జరిగింది. అయితే..ఈ చర్చ సందర్భంగా తాము ఆరోపణలను ఎదుర్కొంటున్నవారిని వదిలేయమని, వారిని చట్టం ముందు నిలబెడతామని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పార్థసారధి సభ్యులకు హామీ ఇచ్చారు. అయితే..ఈ హామిని ప్రభుత్వం ఇంకా నిలబెట్టుకోలేదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌కుమార్‌రెడ్డి ఆయన సహచరులను తూతూ మంత్రంగా విచారించారనే విమర్శలు వస్తున్నాయి. విచారణాధికారులు..లోతుగా విచారణ చేయలేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా పత్రికలకు ప్రకటనల విడుదలలోనూ, అక్రిడిటేషన్ల మంజూరు విషయంలోనూ నిబంధనలను పాటించలేదని, వేలాదిగా అక్రిడిటేషన్లు అమ్ముకున్నారనే ఆరోపణలపైనా.. విచారణ సరిగా జరగలేదు. అదే విధంగా ఇంజనీరింగ్ విభాగంలో జరిగిన అవకతవకలు, అవినీతిపైనా విచారణ సరిగా జరిగిన పాపాన పోలేదు. అయితే.. విచారణ జరుగుతోన్న పరిస్థితుల్లోనే గతంలో కమీషనర్‌కు సహచరులుగా పనిచేసిన వారికి వరుసగా పోస్టింగ్‌లు ఇచ్చుకుంటూ పోతున్నారు. గత వారంలో సాధారణ బదిలీల్లో భాగంగా ఇంజనీరింగ్ విభాగంలో అధికారికి పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం తాజాగా జాయింట్‌డైరెక్టర్‌గా పనిచేసిన అధికారికి పోస్టింగ్ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. వీరిద్దరూ గత కమీషనర్ అవినీతికి, అక్రమాలకు సహకరించారనే ఆరోపణలపై ఏడాది నుంచి పక్కన పెట్టి జీఏడీకి అటాచ్‌చేశారు. అయితే ఇప్పుడు ఏసీబీ, విజిలెన్స్ విచారణలో ఏమీ తేలకుండానే..ఇప్పుడు వీరికి మళ్లీ పోస్టింగ్‌లు ఇవ్వడంపై విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి.
యోగా సందడిలో..సడేమియా...!?
ముఖ్యంగా మంత్రి కార్యాలయ అధికారి వీరికి పోస్టింగ్‌లు ఇవ్వడానికి ఉత్సాహపడుతున్నారని, ఆయనకు ఎందుకు వీరిపై అంత ప్రేమో అర్థం కావడం లేదని పలువురు జర్నలిస్టులు అంటున్నారు. అత్యంత వివాదాస్పదమైన జాయింట్ డైరెక్టర్‌కు పోస్టింగ్ ఇవ్వడానికి ఆయన రంగం సిద్ధం చేశారని, ఆయన కనుసన్నల్లోనే ప్రస్తుతం దస్త్రం నడుస్తోందని తెలుస్తోంది. రాష్ట్ర పాలనాయంత్రాంగం అంతా విశాఖపట్నంలో యోగా సందడిలో ఉన్న సమయంలో..ఈ అధికారికి పోస్టింగ్ ఇవ్వడానికి దస్త్రాన్ని శరవేగంగా కదిలిస్తున్నారు. మొన్నటికి మొన్న ఇంజనీరింగ్ అధికారికి పోస్టింగ్ ఇచ్చారు. ఆయన ఏమీ అరాచకాలు, అవినీతి చేయలేదని, ఏసీబీ, విజిలెన్స్ ఏమైనా సర్టిఫికెట్ ఇచ్చిందా..? లేదు కదా..మరి ఎందుకు వీరిపై అంత ప్రేమ..? ఒక వైపు ప్రభుత్వ పెద్దలు అవినీతిని, అక్రమాలను, అరాచకాలను సహించమని చెబుతూ మద్యం కేసు, ఇసుక కేసు ఇతర కేసుల్లో పెద్ద పెద్ద వాళ్లను అరెస్టులు చేసి జైలుకు పంపుతుంటే..సమాచారశాఖ అవినీతిపరులపై మాత్రం ఇంత వరకూ చర్యలు లేవు. వీరి అవినీతికి ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నా..వీరిని ఇంత వరకూ అరెస్టు చేయలేదు. మంత్రి కార్యాలయ అధికారికి వీరు తమ కులం, మతవాళ్లు అనే ప్రేమ ఏమైనా ఉందా....? లేకా ఇంకేమైనా ఉందా..? అనేది తెలియదు. వాస్తవానికి సమాచారశాఖ మంత్రి పార్థసారధి మంచివ్యక్తి అనే పేరుంది. అయితే ఆయన పేరును ఈ అధికారి చెడగొడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒకవైపు విజిలెన్స్, ఏసీబీ, కోర్టు కేసులు నడుస్తోన్న పరిస్థితుల్లో వీరికి మళ్లీ అక్కడే పోస్టింగ్‌లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది..? అత్యంత వివాదాస్పద అధికారిపై ఈ అధికారికి అంత ప్రేమ ఎందుకు..?
కృష్ణంరాజు పత్రికకు అక్రిడిటేషన్లు..!
ఇటీవల కాలంలో సాక్షి ఛానెల్ డిబేట్‌లో అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు పత్రిక సంపాదకుడు కృష్ణరాజు పత్రికకు భారీగా అక్రిడిటేషన్లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. తన పత్రికకు వచ్చిన అక్రిడిటేషన్లను ఈయన అమ్ముకున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉంది. గతంలో..జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న అధికారే దీనికి కారణం. కేవలం ఆయనొక్కక్కరికే కాదు..అప్పట్లో వైకాపా పార్టీ వారికి, లోకేష్‌ను, చంద్రబాబును దూషించేవారికి భారీగా అక్రిడిటేషన్లు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. కొంత మంది యూట్యూబ్ ఛానెళ్లను నడిపేవారికి కూడా అప్పట్లో భారీగా అక్రిడిటేషన్లు ఇచ్చారు. దీనిపై విచారణ జరగలేదు. వెటరన్ జర్నలిస్టులు, ఫ్రీలాన్స్ జర్నలిస్టుల పేరిట దోపిడీ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనా తూతూ మంత్రంగానే విచారణ జరిగింది. నాటి కమీషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రతి అవినీతి, అక్రమాల్లో భాగం ఉన్న వీళ్లను మళ్లీ శాఖలో చేర్చుకుంటే ప్రభుత్వ ప్రతిష్టను వీరు మంటగలుపుతారనడంలో ఎటువంటి సందేహం లేదు.
లోకేష్ జోక్యం చేసుకోవాలి...?
ప్రస్తుతం సమాచారశాఖలో ఇస్తోన్న పోస్టింగ్‌ల వ్యవహారంలో మంత్రి లోకేష్ జోక్యం చేసుకోవాలని పలువురు జర్నలిస్టులు కోరుతున్నారు. వైకాపాకు అనుబంధంగా, జగన్‌కు స్వంత మనుషుల్లా పనిచేస్తోన్న వీరికి మళ్లీ పోస్టింగ్‌లు ఇస్తే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి వైకాపా వారితో వీరు చేతులు కలుపుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. మొదటి నుంచి కులం, మతం పేరుతో వీరు...సమాచారశాఖను భ్రష్టుపట్టించారు. ఇటువంటి వారి విషయంలో..లోకేష్ అప్రమత్తంగా ఉండాలి. వివాదాస్పద అధికారిగా పేరుగాంచిన అధికారి ప్రస్తుతం పోస్టింగ్ లేకపోయినా..ప్రస్తుతం శాఖలో పనిచేస్తోన్న అధికారులపై బెదిరింపులకు దిగితున్నారు. తాను మరో పదేళ్లు శాఖలోఉంటానని, తన వ్యతిరేకులు అంతు చూస్తానని, రిటైర్ అయిన వారు పెన్షన్ ఎలా తీసుకుంటారో చూస్తానని బెదిరింపులకు దిగుతున్నారు. జగన్ పోలీసులను బెదిరించినట్లు ఈ అధికారి శాఖలో ఉన్న అధికారులను, సిబ్బందిని బెదిరిస్తున్నారు. మళ్లీ వస్తాను..మీ అంతు చూస్తాను..అంటూ జగన్ స్థాయిలో బెదిరింపులకు, దౌర్జ్యన్యాలకు దిగుతున్నారు. ఇటువంటి అధికారులకు మళ్లీ పోస్టింగ్‌లు ఇస్తే ఏమి జరుగుతుందో ప్రభుత్వ పెద్దలే ఊహించుకోవాలని పలువురు జర్నలిస్టులు అంటున్నారు. ప్రస్తుతం వీరికి ఇచ్చిన పోస్టింగ్‌లను రద్దు చేయాలని, అరాచకవాదులకు, అవినీతిపరులకు, వైకాపాకు వంతపాడేవారికి శాఖలో స్థానం లేకుండా చేయాలని జర్నలిస్టు వర్గాలు కోరుతున్నాయి.