సిఎస్, డీజీపీలకు ఎన్‌హెచ్ఆర్సీ నోటీసులు
చిత్తూరు జిల్లా, కుప్పం మండలంలోని నారాయణపురం గ్రామంలో ఒక మహిళపై స్థానిక వడ్డీకొండవాడి దారుణమైన దాడిపై మీడియాలో వచ్చిన కథనాన్ని సువో మోటు గుర్తించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) లకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని ఎన్‌హెచ్ఆర్సీ కోరింది. ఈ ఏడాది జూన్ 17న వెలువడిన మీడియా కథనం ప్రకారం, ఈ ఘటన జూన్ 16న చోటు చేసుకుంది. అప్పట్లో రూ. 80,000 రుణంగా తీసుకున్నందుకు ఆమె భర్త తిరిగి చెల్లించకపోవడంతో, ఆ మహిళను వడ్డీకొండవాడు అందరూ చూస్తుండగానే చెట్టుకు కట్టివేసి దారుణంగా కొట్టాడని పేర్కొంది. అనంతరం స్థానిక గ్రామస్తులు ఆమెను విడిపించారని వార్తలో పేర్కొనబడింది. దీనిపై జాతీయ మానవహక్కుల సంఘం స్పందిస్తూ...“మీడియా కథనం నిజమైతే, ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుంది. దీనిపై స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి మరియు డీజీపీకి నోటీసులు జారీ చేసి, రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.” ఈ నివేదికలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై తీసుకున్న చర్యల వివరాలు, మరియు బాధితురాలికి భద్రత, పునరావాసం కోసం చేపట్టిన చర్యలు ఏమిటో తెలపాలని ఎన్‌హెచ్ఆర్సీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. కాగా ఈ సంఘటన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వంత నియోజకవర్గంలో జరగడం సంచలనాన్ని సృష్టించింది. ప్రతిపక్ష వైకాపా దీన్ని రాజకీయం చేయాలని చూసినా..బాధితురాలికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకున్నారు. బాధిత మహిళపై దాడి చేసిన కుటుంబ సభ్యులను అరెస్టుచేయించారు. తరువాత ప్రభుత్వం తరుపున బాధిత మహిళకు రూ.5లక్షల ఆర్థిక సహాయంతోపాటు, అర ఎకరం భూమి, ఆమె పిల్లల చదువుల ఖర్చును కూడా ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు.