లోకేష్‌కు ప్రధాని మోడీ ప్రశంసపై ఆసక్తికర చర్చ...!?
ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌పై ఈరోజు ప్రశంసల జల్లు కురిపించారు. ప్రపంచ యోగా డే సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన కార్యక్రమాన్ని లోకేష్ అధ్భుతంగా చేశారని, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఆయన దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రధాని మోడీ లోకేష్‌ను మెచ్చుకున్నారు. దేశంలోని రాజకీయ నాయకులు లోకేష్‌ను చూసి నేర్చుకోవాలని కూడా ఆయన సూచించారు. ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ,అధికార వర్గాల్లో చర్చకు కారణమవుతున్నాయి. నిన్న మొన్నటి దాకా లోకేష్ అంటే ఇంకా పరిణితి చెందని నాయకుడని, చంద్రబాబు కుమారుడు అవడం వల్లే ఆయనకు పదవులు వచ్చాయని చాలా మంది భావించేవారు. ఆయన తెలుగు భాష మాట్లాడే విధానం సరిగా ఉండదని, చెప్పాలనకునేది అర్థం అయ్యేలా చెప్పలేకపోతున్నారని, ఆయన వ్యతిరేకులు ఆయనను చాలా చులకనగా చూసేవారు..మాట్లాడేవారు. అంతే కాదు..ఒక ముఖ్యమంత్రి కుమారుడు, మరో ముఖ్యమంత్రికి మనవడు, స్టార్ హీరో అల్లుడు అయి ఉండి కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదని ఎద్దేవా చేసేవారు. అయితే..ఈ ఎగతాళిని లోకేష్ సహనంతో ఎదుర్కొని..రాజకీయంగా, భాష పరంగా తిరుగులేని విధంగా మెరుగయ్యారు. మొన్నటి దాకా..లోకేష్‌ను గురించి పెద్దగా పట్టించుకోని మోడీ..అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి కూటమి గెలిచిన తరువాత..ఆయనను ఢిల్లీ రావాలని రెండు మూడు సార్లు ఆహ్వానించారు. అయితే..లోకేష్ వెంటనే ఢిల్లీ వెళ్లి ఆయనను కలవలేదు. అయితే..ఇటీవల రాజధాని అమరావతి పునఃప్రారంభం రోజున మళ్లీ మోడీ లోకేష్‌ను ఢిల్లీకి ఆహ్వానించారు. ఆ రోజు ఎందుకు మీరు ఢిల్లీ రావడం లేదు..రెండు సార్లు రమ్మని ఆహ్వానించినా రాలేదంటూ..చురకలేశారు. దీంతో..లోకేష్ కుటుంబంతో కలిసి మోడీ నివాసానికి వెళ్లారు.
మోడీ నివాసంలో సుమారు రెండు గంటల పాటు లోకేష్ కుటుంబంతో ప్రధాని మోడీ గడిపారు. ఒక మంత్రికి ప్రధాని అంత సమయం ఇవ్వడంపై రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యకర చర్చ జరిగింది. లోకేష్‌కు ప్రధాని అంత సమయం ఇవ్వడం బిజెపిలో కూడా చర్చకు కారణమైంది. స్వంత బిజెపి ముఖ్యమంత్రికి కూడా ప్రధాని మోడీ అంత సమయం ఇవ్వరని, లోకేష్‌తో ఆయన రెండు గంటలపాటు ఏమి చర్చించి ఉంటారనే దానిపై రకరకాల ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే వారిద్దరి మధ్య ఏమి జరిగిందనేది తెలియదు కానీ..తనతో మోడీ రెండు గంటల పాటు సమయం గడపడం తాను జీవితంలో మర్చిపోలేనని, ఆయన మార్గదర్శకంలో తాను పనిచేస్తానని లోకేష్ మొన్న ఢిల్లీలోప్రకటించారు. ఆ ప్రకటన తరువాత ఈరోజు విశాఖలో జరిగిన యోగా సభలో ప్రధాని బహిరంగంగా లోకేష్‌ను ప్రశంసించారు. దీంతో ఒక్కసారిగా లోకేష్ గ్రాఫ్ పెరిగిపోయింది. ఏ రాజకీయనాయకుడ్ని కూడా మోడీ ఇంతగా ప్రశింసించిన సందర్భం లేదు. అయితే..లోకేష్‌లో ఉన్న విషయపరిజ్ఙానం, కష్టించి పనిచేసే విధానం మోడీని ఆకట్టుకుందని, అందుకే ఆయన లోకేష్ పై ప్రశంసలు గుప్పించారని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా..లోకేష్ మోడీని ఆకట్టుకోవడంతో..ఇక రాష్ట్రంలో రాజకీయవారసత్వం శరవేగంగా మారుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అయితే..అది ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదు. ఒకవైపు చంద్రబాబు కుటుంబ సభ్యులు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయనపై ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు చలామణిలో ఉండగా, ఇప్పుడు మోడీని లోకేష్ ఆకట్టుకోవడంతో..ఇక ఆ పని త్వరగా అవుతుందనే విశ్లేషణలు జోరుగా వస్తున్నాయి. చూద్దాం..మరి ఏమి జరుగుతుందో..?