వచ్చేవారంలో ఐఏఎస్ ల బదిలీలు...!?
ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల బదిలీలు వచ్చే వారంలో జరిగే అవకాశాలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా అధికార వ్యవస్థను ప్రక్షాళన చేస్తారని, భారీగా ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను బదిలీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి గత వారంలోనే బదిలీలు ఉంటాయని అధికారయంత్రాంగం భావించింది. అయితే..గత నెల రోజులుగా రాష్ట్ర ఉన్నతాధికారగణమంతా విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంపైనే దృష్టి పెట్టింది. ఈ రోజు అది దిగ్విజయంగా ముగియడంతో ఇప్పుడు పాలనయంత్రాంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించనున్నారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ వారంలో ప్రభుత్వం ఏడాది పాలనపై సభ నిర్వహించనుంది. సచివాలయం వెనుక ఉన్న ప్రాంతంలో ఈ సభ జరగబోతోంది. అదే సమయంలో ప్రభుత్వ మరో మెగా హామీ రైతుసుఖీభవ పథకం అమలు చేయబోతున్నారు. అదీ ఈ వారంలోనే జరుగుతంది. మరోవైపు కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే..కలెక్టర్ల సమావేశంలోపే పలు జిల్లాల కలెక్టర్లను మార్చితే బాగుంటుందన్న అభిప్రాయం ఉన్నతాధికారుల నుంచి వస్తోంది. కలెక్టర్ల సమావేశ తేదీలు ఇంకా రాలేదు కనుక..ఈలోపే బదిలీలు ఉంటాయంటున్నారు.
సిఎంఓలో మార్పులు లేవట...!
కాగా గత కొంత కాలంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తోన్న కొందరు ఐఏఎస్ అధికారులను అక్కడ నుంచి తప్పిస్తారని రాజకీయ,అధికారవర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే..ఇది జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. మొదట వైకాపా ముద్ర పడిన అధికారిని తొలగిస్తారని జోరుగా ప్రచారం సాగింది. అయితే..ఈ అధికారిని ఇప్పుడు మార్చరని అంటున్నారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లు చెప్పిన పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారని, ఈయనవల్లే మద్యం కుంభకోణంలో వేగంగా విచారణ జరుగుతోందన్న భావన ప్రభుత్వ వర్గాల్లో ఉందట. దీంతో..ఈయనను మార్చరని అంటున్నారు. కాగా మరో యువ ఐఏఎస్ అధికారిని ఢిల్లీ పంపిస్తారని ప్రచారం ఉంది. ఇది ఎంత వరకు అమలు అవుతుందో చూడాలి. ఇక సిఎంఓలో మరో ఇద్దరు సీనియర్ అధికారులను ఎట్టి పరిస్థితుల్లో కదిలించరనే ప్రచారం ఉంది. వారిద్దరూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితులు. ఒకరిని ముఖ్యమంత్రే స్వయంగా ఆహ్వానించి పదవిని ఇవ్వగా..మరో అధికారి గతంలో చంద్రబాబు వద్ద పనిచేసిన అనుభవం ఉంది. దాంతో వారిద్దరినీ కదిలించే పరిస్థితే లేదు.
మరోవైపు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న విద్యాశాఖ మంత్రి లోకేష్ వద్ద పనిచేస్తోన్న ఇద్దరు సీనియర్ అధికారులనూ మార్చబోరని ప్రచారం సాగుతోంది. వీరిలో ఒకరు రాష్ట్రంలోనే అత్యంత నిజాయితీ, సమర్థత కలిగిన అధికారి కాగా, మరొకరు సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. దీంతో..లోకేష్ నిర్వహిస్తోన్న శాఖల్లోని అధికారుల్లో మార్పులు ఉండవంటున్నారు. పంచాయితీరాజ్‌శాఖ మంత్రి పవన్‌కళ్యాణ్ శాఖాధికారుల్లో మార్పులు ఉంటాయంటున్నారు. పంచాయితీరాజ్ కార్యదర్శిని బదిలీ చేస్తారనే ప్రచారం ఉంది. ఇక ఫైనాన్స్, వైద్యశాఖ, మైనింగ్, మున్సిపల్ తదితర శాఖల కార్యదర్శులను బదిలీ చేస్తారంటున్నారు. వీరితో పాటు పలు జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను బదిలీ చేస్తారనే ప్రచారం జోరుగా ఉంది. కాగా ఐపిఎస్ అధికారులను కూడా భారీగా మారుస్తారు. వివిధ జిల్లాల ఎస్‌పిలను బదిలీ చేస్తారంటున్నారు. మొత్తం మీద..వచ్చే వారంలో కీలకమైన బదిలీలు ఉంటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.