30న ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు...!?
కూటమి ప్రభుత్వం తన ఎన్నికల హామీల్లో ప్రధాన హామీ అయిన తల్లికివందనం పథకాన్ని అమలు చేయగా, మరో ప్రధాన హామీ అయిన ‘అన్నదాత సుఖీభవ’ పథకం ఇంకా అమలు కాలేదు. వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ఏడాదికి రూ.20వేలు ఇస్తామని కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. దీని కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.14వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు ఇవ్వనున్నాయి. అయితే ఈ పథకం అమలులో భాగంగా మొదట విడత రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు, కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయిలు ఇవ్వనున్నాయి. దీనిలో భాగంగా ఈ పథకాన్ని ఈనెల 20వ తేదీన అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా హామీ ఇచ్చారు. అయితే..ఆ హామీ ఇంకా నెరవేరలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ.5వేలు నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద రెడీగా ఉన్నా..పథకం మాత్రం అనుకున్న విధంగా అమలు కాలేదు. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఈ పథకం అమలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. దీనికి ప్రధాన కారణం సాంకేతిక సమస్యలే. ఈ సమస్యలకు గత వైకాపా ప్రభుత్వ నిర్వాకమే ప్రధాన కారణం. రైతుల భూముల రీ సర్వే పేరిట వైకాపా ప్రభుత్వం రైతుల భూములతో చెలగాటమాడుకుంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం అమలు చేయబోయే ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఎల్‌పిఎం(ల్యాండ్ పార్సిల్ మ్యాప్)వ్యవస్థతో వెబ్‌ల్యాండ్‌లో సమస్యలు వస్తున్నాయి. రీ సర్వే సమయంలో ఐదారుగురు రైతులను కలిపి సంయుక్తంగా ఎల్‌పిఎం నెంబర్‌ను కేటాయించారు. ఇప్పుడు అది సమస్యలను సృష్టిస్తోంది. ఇలా నమోదు అయిన రైతులకు ఎలా ఈ పథకాన్ని అమలు చేయాలనే సందేహాలు అధికారుల్లో నెలకొన్నాయి. దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని వల్ల ఈ పథకం అమలు ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఇదే కాకుండా గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆధార్ అనుసంధానం, మ్యూటేషన్లు, మృతుల పేర్లతో భూములు ఉండడం, 1బీలు రాకపోవడం, తాసిల్దాదార్ల డిజిటల్ సంతకాలు లేకపోవడంతో అర్హలు జాబితా గుర్తించడం ఆలస్యం అవుతోంది. దీంతో సొమ్ములు ఉన్నా ఈ పథకం అమలు ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అర్హుల జాబితాలు తయారు కావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది కనుక..ఈ నెలాఖరు నాటికి ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలు కావచ్చని తెలుస్తోంది. ఈనెల 30వ తేదీన అర్హులకు అన్నదాత సుఖీభవ కింద సొమ్ములు అందుతాయోమో చూడాలి. కాగా ప్రభుత్వ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో..తల్లికివందనం పథకం అమలులో కూడా పలు పొరపాట్లుజరిగాయనే వార్తలు వస్తున్నాయి. అర్హుల జాబితాను భారీగా కుదించారని, దీనికి ఈ రెవిన్యూ సమస్యలు కారణమనే భావన ఉంది. ఒకవైపు భారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్నా ప్రభుత్వానికి రావాల్సినంత మైలేజ్ రాలేదనే భావన వ్యక్తం అవుతోంది.