‘మేఘా’ కోసమే ‘బనకచర్ల’ ప్రాజెక్టు...!?
గోదావరి, కృష్ణా నదుల నుంచి వృధాగా సముద్రంలోకి పోయే నీళ్లను రాయలసీమకు తరలిస్తామని, తద్వారా రాయలసీమ వెనుకబాటును తరిమేస్తామని కూటమి అధినేత చంద్రబాబునాయుడు పదే పదే ప్రకటిస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రాజెక్టుపై చాలానే చర్చ సాగుతోంది. ఆంధ్రాలో ఈ ప్రాజెక్టుపై పెద్దగా చర్చ లేకపోయినా..తెలంగాణలో మాత్రం దీనిపై దుమారం రేగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టును నిర్మించడానికి వీలు లేదని, దీన్ని అడ్డుకుంటామని తెలంగాణలో పార్టీలకు అతీతంగా ప్రకటనలు చేస్తున్నారు. ఎగువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ వృధాగా పోయే నీటిని ఆంధ్రా వాడుకుంటే తప్పేమిటనే దానిపై నేరుగా ప్రకటన చేయకుండా గోదావరి, కృష్ణాల్లో తమ వాటా ఎంతో తేల్చాలని, తరువాతే..‘బనకచర్ల’ను నిర్మించుకోవాలని డిమాండ్ చేస్తోంది. వారి డిమాండ్‌ను ఆంధ్రా పట్టించుకోవడం లేదు. మీకు చేతనైతే..గోదావరి, కృష్ణాలపై ప్రాజెక్టులు నిర్మించుకోండి..నీటిని వాడుకోండి..అంటూ వారికి బంపర్ ఆఫర్‌ను ఆంధ్రాలోని పాలక కూటమి ఇచ్చేసింది. అయితే..దీనిపై తెలంగాణ పెద్దగా పట్టించుకోకుండానే..నీటిలో తమ వాటా తేల్చాలని, ‘బనకచర్ల’ ప్రాజెక్టును ఆపాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి యత్నిస్తోంది.
ఇది ఇలా ఉంటే..బనకచర్ల ప్రాజెక్టుపై ఇప్పుడు ఆంధ్రాలోనూ కొంత మంది మేధావులు, రిటైర్డ్ అధికారులు ఆంధ్రా ప్రభుత్వ తీరుపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. లక్ష కోట్ల బనకచర్ల ప్రాజెక్టు ‘మేఘా’ ఇంజనీరింగ్ కంపెనీకి కట్టబెట్టేందుకే..ఇలా చేస్తున్నారని, ఎటువంటి అనుమతులు లేకుండా అంత పెద్ద ప్రాజెక్టును ఎలా చేస్తారంటూ.. విమర్శలు గుప్పిస్తున్నారు. రిటైర్డ్ పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ‘మేఘా’కు అప్పనంగా ప్రజల సొమ్ములను దోచిపెట్టేందుకే ‘బనకచర్ల’ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఆయన ఆరోపించారు. ‘మేఘా’ ఇచ్చిన మ్యాప్ ప్రకారం ప్రాజెక్టును నిర్మిస్తున్నారని, దీనిపై ప్రజల్లో చర్చ జరగలేదని, కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని ఘాటుగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి అంబికాదర్బార్ అగర్‌బత్తీలా ‘మేఘా’ కృష్ణారెడ్డి ఉన్నారని, ఏ ప్రభుత్వం ఉన్నా ఆయనే సాగునీటి ప్రాజెక్టుల ద్వారా లబ్ది పొందుతున్నారని ఆరోపించారు.