వాళ్లిద్దరూ ‘మేఘా’కు దోస్తులే...?
బనకచర్ల ప్రాజెక్టు ‘మేఘా కృష్ణారెడ్డి‘ కోసమే చేస్తున్నారంటూ..రిటైర్డ్ పోలీసు అధికారి ఏబీ వేంకటేశ్వరరావు చేసిన ఆరోపణలు రాజకీయ, అధికార వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు నూటికి నూరుశాతం నిజమని చాలా మంది సీనియర్ అధికారులు, రాజకీయనాయకులు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మేఘా కృష్ణారెడ్డి హవా సాగుతుందని, బద్ద శత్రువులైన ‘చంద్రబాబు’, ‘జగన్’లూ..ఆయన విషయంలో మాత్రం అన్నాదమ్ముల్లా వ్యవహరిస్తారు. ఎవరు అధికారంలో ఉన్నా ‘మేఘా కృష్ణారెడ్డి‘కి మాత్రం ఆంధ్రా ప్రజల సొమ్ములను అప్పనంగా దోచిపెడతారనే విమర్శలు ఉన్నాయి. 2014-19 మధ్య టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ‘మేఘా కృష్ణారెడ్డి‘కి పట్టిసీమ ప్రాజెక్టును టిడిపి ప్రభుత్వం కట్టబెట్టింది. అప్పట్లో దీనిపై ‘జగన్’ బృందం నానా రాద్ధాంతం చేసింది. పట్టిసీమలో అవినీతి జరిగిందని ‘మేఘా కృష్ణారెడ్డి‘ ‘చంద్రబాబు’కు ముడుపులు ఇచ్చారని ఢిల్లీ దాకా ఫిర్యాదులు చేశారు. తాము అధికారంలోకి వస్తే..దాని సంగతి తేలుస్తామని ప్రకటించారు. అయితే..వాళ్లు అధికారంలోకి వచ్చిన తరువాత కనీసం మాట మాత్రంగానైనా..దాని ఊసు ఎత్తలేదు సరికదా..? అంతకు మించి ప్రాజెక్టులను ‘జగన్’ వారికి కట్టబెట్టారు. ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తోన్న నవయుగను తప్పించి మేఘాకు ‘జగన్’ అప్పగించారు. అప్పట్లో దీనిపై టిడిపి మండిపడింది. అంతేనా..నాడు-నేడు పనులతో పాటు అనేక పనులను ‘జగన్’ మేఘాకు అప్పగించారు. అయితే..అప్పట్లో టిడిపి అధినేత ‘చంద్రబాబు’తో పాటు, ఆయన సహచరులు దీనిపై విమర్శలు, ఆరోపణలు గుప్పించారు.
అయితే..2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన ‘చంద్రబాబు’ మేఘాపై చర్యలు తీసుకుంటారేమోనని టిడిపి కార్యకర్తలతో పాటు, సానుభూతిపరులు ఆశించారు. అయితే..ఆయన అధికారంలోకి వచ్చిన అరగంటలోనే...‘మేఘా కృష్ణారెడ్డి‘ ఆయన కార్యాలయంలో వాలిపోయారు. అంతేనా..ఆయనను తన ఊరికి ఆహ్వానించి దేవుడి ఆశీస్సులు అందించారు. దీంతో..మళ్లీ ‘మేఘా కృష్ణారెడ్డి‘ హవా ఇక్కడ మొదలైందని అందరికీ అర్థమైంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు మళ్లీ ‘చంద్రబాబు’ను అధికారంలోకి రానీయకుండా చేసేందుకు టివి9 మీడియాను కొనుగోలు చేసి ‘మేఘా కృష్ణారెడ్డి‘ ‘చంద్రబాబు’కు వ్యతిరేకంగా తన మీడియాను ఉసిగొల్పారు. అదొక్కటే కాదు..10టివితో పాటు మరికొన్ని ఛానెల్స్‌ను టిడిపికి వ్యతిరేకంగా ఎగదోశారు. ఎట్టిపరిస్థితుల్లో ‘చంద్రబాబు’ అధికారంలోకి రాకూడదనే భావనతో ‘మేఘా కృష్ణారెడ్డి‘ చేయాల్సిందంతా చేసేశారు. అయితే..ప్రజలు దాన్ని పట్టించుకోకుండా ‘చంద్రబాబు’కు అధికారం కట్టబెట్టారు. తనకు వ్యతిరేకంగా అంత చేసిన ‘మేఘా కృష్ణారెడ్డి‘ని మళ్లీ ‘చంద్రబాబు’ ఎందుకు చేరదీశారు. పోలవరం ప్రాజెక్టు పనుల దృష్ట్యా కాంట్రాక్టర్‌ను మారిస్తే..నష్టం వాటిల్లుతుందన్న ఆయన మాటలను ప్రజలు అర్థం చేసుకున్నారు. అయితే..ఇప్పుడు బనకచర్ల వ్యవహారంలో మళ్లీ మేఘా అంటే..ఏదో జరుగుతోందన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద..‘మేఘా కృష్ణారెడ్డి‘..‘చంద్రబాబు’తోనూ..‘జగన్’తోనూ.. వ్యవహారాలను నడిపి వారిని సంతృప్తి పరిచి..తానూ భారీగా సంతృప్తి పడుతున్నారనే మాట ఆయా వర్గాల్లో మొండుగా ఉంది.